క్రీడాభూమి

కోహ్లీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 29: శ్రీలంకతో గాలే స్టేడియంలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 17వ శతం సాధించి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌ను మూడు వికెట్ల నష్టానికి 240 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసిన కోహ్లీ సేన తన ప్రత్యర్థి ముందు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం లంకను రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ చేసి, తిరుగులేని విజయం సాధించింది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో లంక చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన భారత్ బౌలింగ్‌లోనూ రాణించి, లంకను తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 309 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, లంకకు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో, నాలుగో రోజు, శనివారం ఉదయం ఆటను కొనసాగించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ కోహ్లీ సెంచరీ సాధించిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కోహ్లీ 136 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 103 పరుగులు చేయగా, అతనితో కలిసి నాటౌట్‌గా నిలిచిన అజింక్య రహానే 18 బంతుల్లో 23 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో దిల్‌రువాన్ పెరెరా, లాహిరు కుమార, దనుష్క గుణతిలకే తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
భారత్‌ను ఓడించి, స్వదేశంలో సత్తా చాటేందుకు 550 లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉండగా, లంక 22 పరుగుల వద్ద తొలి వికెట్‌ను ఉపుల్ తరంగ (10) రూపంలో కోల్పోయింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే క్రీజ్‌లో పాతుకుపోయి, 97 పరుగులు సాధించాడు. అతనితోపాటు వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా (67) కూడా అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మిగతా వారు క్రీజ్‌లో నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టడంతో, లంక ఇన్నింగ్స్ 76.5 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత్ భారీ విజయంతో, సిరీస్‌పై ఆధిక్యాన్ని సంపాదించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగి, 190 పరుగులు సాధించిన భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

* భారత నలుగురు టాప్ బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు సెంచరీలు సాధించడం 2009 తర్వాత ఇదే తొలిసారి.
* శ్రీలంక కెప్టెన్ రంగన హెరాత్, అసెల గుణరత్నే గాయాల కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. గుణరత్నే మొదటి రోజు ఆటలోనే గాయపడడంతో, తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దిగని విషయం తెలిసిందే. దీనితో మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లతోనే ఆటను ముగించాల్సి వచ్చింది. ఐదు రోజుల మ్యాచ్‌కి నాలుగు రోజుల్లోనే తెరపడడానికి ఇది కూడా ఒక కారణం.
* ఈ టెస్టులో భారత్, శ్రీలంక జట్లు కలిపి మొత్తం 1,376 పరుగులు చేశాయి. గాలేలో ఇప్పటి వరకూ జరిగిన 30 టెస్టుల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. 2013లో బంగ్లాదేశ్‌ను లంక ఢీకొన్నప్పుడు 1,613 పరుగులు నమోదయ్యాయి.
* ప్రత్యర్థికి ఈ మ్యాచ్‌లో భారత్ 550 పరుగుల లక్ష్యాన్ని సవాలుగా విసిరింది. 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 617 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా, ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈసారి భారత్ 550 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి, దానిని సులభంగానే కాపాడుకుంది.
* విదేశాల్లో భారత్ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. 1986లో లీడ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌ను 279 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఇప్పుడు 304 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. విదేశాల్లోనూ గొప్ప విజయాలను సాధించగలనని నిరూపించుకుంది. కాగా, శ్రీలంకకు ఇదే భారీ ఓటమి కావడం విశేషం. ఈ ఏడాది జనవరిలో కేప్ టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 282 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన లంక ఓటమికి ఈసారి మరో 22 పరుగులు జత కలిశాయి.

*అజేయ శతకంతో రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఒక టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో శతకాన్ని సాధించడం అతనికి ఇదే మొదటిసారి. ఇంతకు ముందు మూడో ఇన్నింగ్స్‌లో అతని అత్యధిక స్కోరు 96 పరుగులు

చిత్రం.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ