క్రీడాభూమి

మిథాలీకి ఖరీదైన కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: మహిళల అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు తెలంగాణ బాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ అత్యంత విలాసవంతమైన బిఎండబ్ల్యు కారును బహూకరించాడు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో మంగళవారం ఆమెకు ఈ కారును బహూకరించాడు. మహిళల వనే్డ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించి, దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినందుకుగాను ఇంతకుముందు హామీ ఇచ్చినట్లుగా మిథాలీ రాజ్‌కు ఈ కారును బహూకరించినట్లు చాముండేశ్వరీనాథ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. ఐసిసి మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఇటీవల బ్రిస్టల్‌లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 6000 పరుగుల మైలురాయిని అధిగమించిన మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్రకెక్కిన విషయం విదితమే. మిథాలీ రాజ్‌కు చాముండేశ్వరీ నాథ్ కారును బహూకరించడం ఇదే తొలిసారి కాదు. 2005లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మిథాలీ రాజ్ భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు గుర్తింపుగా చాముండేశ్వరీ నాథ్ 2007లో కూడా ఆమెకు ఒక కారును బహూకరించాడు. చాముండేశ్వరీ నాథ్ గతంలోనూ ఇదేవిధంగా భారత స్టార్ షట్లర్ పివి.సింధు (రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించినందుకు), మహిళా జిమ్నాస్టు దీపా కర్మాకర్ (రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచినందుకు), జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సహా పలువురు క్రీడాకారులకు ఖరీదైన కార్లను బహూకరించిన విషయం విదితమే.
ఇంత స్పందనను ఊహించలేదు..
ప్రపంచ కప్‌లో తమ జట్టు ఆటతీరుకు ఇంత అద్భుతమైన స్పందన వస్తుందని తాను ఊహించలేదని మిథాలీ రాజ్ చెప్పింది. ‘్భరత్‌లో ఇంత గొప్ప స్వాగతం లభిస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఫైనల్లో మేము ఓడిపోయాం. ఒక జట్టుగా అది మాకు ఎంతో బాధవేసింది’ అని మంగళవారం ఇక్కడ జరిగిన ఓక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిథాలీ రాజ్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నది. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంతో మంది అభినందించడం గొప్పగా ఉందని, ఎందుకంటే ఇనే్నళ్లుగా మాకు ఎవరు కూడా ఇంతగా ప్రోత్సాహం ఇవ్వలేదని మిథాలీ వ్యాఖ్యానించింది. టీవీలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడం, సోషల్ మీడియా కూడా గొప్ప పాత్ర పోషించడం జట్టుకు సానుకూల వాతావరణంగా మారిందని ఆమె అన్నది. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్‌కు మేలు చేస్తుందని తాను భావిస్తున్నట్లు మిథాలీ తెలిపింది.

చిత్రం.. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు బిఎండబ్ల్యు కారును బహూకరిస్తున్న చాముండి