క్రీడాభూమి

హార్దిక్ ఆట సూపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 14: యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు టెస్టు జట్టులో చోటు కల్పించడం లాభించిందని, అతను అద్భుతంగా ఆడాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. శ్రీలంకతో మూడు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత అతను మాట్లాడుతూ, హార్దిక్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడినట్టు చెప్పాడు. జట్టుకు ఇదో శుభ పరిణామనని, మిగతా క్రికెటర్లకు అతని స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని చెప్పాడు. లంకలో టెస్టు సిరీస్ చాలా సంతృప్తికరంగా సాగిందని తెలిపాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయాలను నమోదు చేయడం ఎంతో ఆనందకరంగా ఉందన్నాడు. తమది యువ ఆటగాళ్లతో కూడిన జట్టుగా అభివర్ణించిన కోహ్లీ, భవిష్యత్తులో మరిన్ని టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇదే రీతిలో విజృంభిస్తామని, జాలి అనేది లేకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడినప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామని అన్నాడు.
పోటీ తీవ్రంగా ఉంది: ధావన్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న శిఖర్ ధావన్ మాట్లాడుతూ, జట్టులో ప్రతి స్థానానికీ పోటీ తీవ్రంగా ఉందని, భారత జట్టు ప్రమాణాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమేనని వ్యాఖ్యానించాడు. టెస్టు సిరీస్‌లో తనకు చోటు దక్కకపోవడంతో, హాంకాంగ్‌లో సెలవులు గడుపుతున్నానని, మురళీ విజయ్ గాయం కారణంగా వైదొలగడంతో తనకు అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నాడు. ఫామ్‌ను కోల్పోయినప్పుడు నిరాశ చెందడంగానీ, తన ఆట శైలిని మార్చుకోవడంగానీ చేయనని స్పష్టం చేశాడు. దూకుడుగా ఆడడం తనకు ఇష్టమని, ఇదే తరహా ఆటను కొనసాగిస్తానని చెప్పాడు. పోటీ పెరిగినప్పుడు ఎవరైనా సర్వశక్తులు ఒడ్డి పోరాడతారని అన్నాడు.
ఇంకా కష్టపడతా: హార్దిక్ పాండ్య
టెస్టు క్రికెట్ ఆడడం అనుకున్నంత సులభం కాదని, ఈ ఫార్మాట్‌లో రాణించడానికి ఇంకా కష్టపడతానని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తీసుకున్న యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. ఈ సిరీస్‌కు వచ్చే సమయానికి తన ఖాతాలో ఒక్క ఫస్ట్‌క్లాస్ సెంచరీ కూడా లేదన్నాడు. చివరి టెస్టులో పిచ్ తీరు, వాతావరణం తనకు బాగా అనుకూలించాయని తెలిపాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, శతకాన్ని అందుకున్నానని అన్నాడు. కెప్టెన్ కోహ్లీ, జట్టులోని ఇతర సభ్యులు తనను ప్రోత్సహించారని, వారి సహకారంతోనే తాను ఆటను మెరుగుపరచుకుంటున్నానని చెప్పాడు.
భారత్ అద్భుతంగా ఆడింది: చండీమల్
ఈ సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా ఆడిందని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ కితాబునిచ్చాడు. టాస్ అనేది ఎవరి చేతిలోనూ ఉండదని అంటూ, మ్యాచ్‌లపై టాస్ కూడా ప్రభావాన్ని చూపిందన్నాడు. సిరీస్ మొత్తం మీద టీమిండియా అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిందని చెప్పాడు. భారీ స్కోర్లు సాధిస్తున్న కారణంగా, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం కోహ్లీకి లభించిందని చెప్పాడు. ఈ పరాజయాలకు కుంగిపోవడం లేదని, ఇప్పుడు నేర్చుకున్న పాఠాలతో మళ్లీ ఫామ్‌లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌లో సత్తా చాటుతామని అన్నాడు.