క్రీడాభూమి

ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఆసియా చాంపియన్‌షిప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా, ఐదు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరింది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధ శతకంతో అజేయంగా నిలిచి, భారత్‌ను గెలిపించాడు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కేవలం ఆరు పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కెప్టెన్ దినేష్ చండీమల్ రూపంలో కోల్పోయింది. అతను నాలుగు పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో తొమ్మిది పరుగుల తర్వాత షెహాన్ జయసూర్య వికెట్ కూడా కూలింది. అతను మూడు పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ధోనీకి చిక్కాడు. బాధ్యతగా ఆడుతూ వచ్చిన ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కూడా 18 పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 57 పరుగుల వద్ద లంక నాలుగో వికెట్ చేజార్చుకుంది. ఈ దశలో స్కోరు వేగాన్ని పెంచేందుకు మిలింద సిరివర్దన, చమర కపుగడేర నడుం బిగించారు. వీరిద్దరి భాగస్వామ్యంలో శ్రీలంక స్కోరు వంద పరుగుల మైలురాయికి చేరింది. 22 పరుగులు చేసిన సిరివర్ధనను సురేష్ రైనా క్యాచ్ పట్టగా అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో, వీరి 43 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్ చివరి బంతిలో దసున్ షనక (1) రనౌటయ్యాడు. షనక కొట్టిన బంతిని చక్కగా ఫీల్డ్ చేసిన రోహిత్ శర్మ అతను క్రీజ్‌కు దూరంలో ఉండడంతో, గురి చేసి వికెట్లను పడగొట్టడంతో లంక ఐదో వికెట్ కోల్పోయింది. ఓవర్లు ముగింపు దశకు చేరుకోవడంతో, పరుగుల వేగం పెంచే క్రమంలో హార్డ్ హిట్టర్ తిసర పెరెరా 17 పరుగులు చేసి, ధోనీ క్యాచ్ అందుకోగా అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి నువాన్ కులశేఖర (13) రనౌటయ్యాడు. శ్రీలంక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 138 పరుగులు సాధించగా, అప్పటికి దుష్మంత చమీర రెండు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన శిఖర్ ధావన్ ఒక పరుగు చేసి, కులశేఖర బౌలింగ్‌లో చండీమల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌కావడంతో, 11 పరుగుల స్కోరువద్ద భారత్ మొదటి వికెట్ చేజార్చుకుంది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. అతను 15 పరుగులు చేసి కులశేఖర బౌలింగ్‌లోనే కపుగడేర క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో జట్టుకు అండగా నిలిచే బాధ్యత విరాట్ కోహ్లీ, సురేష్ రైనా భుజాలపై పడింది. వీరు 7.5 ఓవర్లలో 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 26 బంతుల్లో 25 పరగులు చేసి రైనాను కులశేఖర క్యాచ్ పట్టగా షనక అవుట్ చేయడంతో వీరి పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అనంతరం కోహ్లీకి యువరాజ్ సింగ్ తోడయ్యాడు. వచ్చీరావడంతోనే లంక బౌలర్లపై విరుచుకుపడిన యువీ పరుగుల వరద పారించాడు. అతను 18 బంతుల్లోనే 3 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 35 పరుగులు చేసి తిసర పెరెరా బౌలింగ్‌లో కులశేఖరకు దొరికిపోయాడు. 121 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య రెండు పరుగులకే రంగన హెరాత్ బంతిని అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి భారత్ విజయానికి 13 బంతుల్లో 14 పరుగుల దూరంలో ఉంది. 19వ ఓవర్ వేసిన సిరివర్దనే వేసిన బంతిని బౌండరీకి తరలించడం ద్వారా అర్ధ శతకాన్ని పూర్తి చేసిన కోహ్లీ, ఆతర్వాత హెరాత్ బౌలింగ్‌లో బంతిని విన్నింగ్ షాట్‌గా ఫోర్ కొట్టాడు. భారత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా, ఐదు వికెట్ల తేడాతో విజయభేరి మోగించే సమయానికి కోహ్లీ 56 (47 బంతులు, 7 ఫోర్లు), ధోనీ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. లంక కెప్టెన్ తనతోపాటు మరో ఆరుగురిని బౌలింగ్‌కు దింపినా ఓటమి నుంచి బయటపడలేకపోయాడు.

స్కోరుబోర్డు
శ్రీలంక ఇన్నింగ్స్: దినేష్ చండీమల్ సి ధోనీ బి ఆశిష్ నెహ్రా 4, తిలకరత్నే దిల్షాన్ సి అశ్విన్ బి హార్దిక్ పాండ్య 18, షెహాన్ జయసూర్య సి ధోనీ బి జస్‌ప్రీత్ బుమ్రా 3, చమర కపుగడేర ఏంజెలో మాథ్యూస్ బి హార్దిక్ పాండ్య 18, మిలింద సిరివర్దన సి సురేష్ రైనా బి అశ్విన్ 22, దసున్ షనక రనౌట్ 1, చమర కపుగడేర సి హార్దిక్ పాండ్య బి జస్‌ప్రీత్ బుమ్రా 30, తిసర పెరెరాసి ధోనీ బి అశ్విన్ 17, నువాన్ కులశేఖర రనౌట్ 13, దుష్మంత చమీర నాటౌట్ 2, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 138.
వికెట్ల పతనం: 1-6, 2-15, 3-31, 4-57, 5-100, 6-104, 7-105, 8-124, 9-138.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-23-1, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-27-2, హార్దిక్ పాండ్య 4-0-26-2, యువరాజ్ సింగ్ 1-0-3-0, రవీంద్ర జడేజా 2-0-19-0, రవిచంద్రన్ అశ్విన్ 4-0-26-2, సురేష్ రైనా 1-0-9-0.
భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ సి చండీమల్ బి కులశేఖర 1, రోహిత్ శర్మ సి కపుగడేర బి కులశేఖర 15, విరాట్ కోహ్లీ నాటౌట్ 56, సురేష్ రైనా సి కులశేఖర బి దుసన్ షనక 25, యువరాజ్ సింగ్ సి కులశేఖర బి తిసర పెరెరా 35, హార్దిక్ పాండ్య బి రంగన హెరాత్ 2, ధోనీ నాటౌట్ 7, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (19.2 ఓవర్లలో ఐదు వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-11, 2-16, 3-70, 4-121, 5-125.
బౌలింగ్: ఏంజెలో మాథ్యూస్ 3-0-16-0, నువాన్ కులశేఖర 3-0-21-2, తిసర పెరెరా 4-0-32-1, దుష్మంత చమీర 4-0-27-0, రంగన హెరాత్ 3.2-0-26-1, దసున్ షనక 1-0-7-0, మిలింద సిరివర్దన 1-0-13-0.

chitram...
18 బంతుల్లోనే 35 పరుగులు
యువరాజ్ సింగ్

ఫాంగిసో ఆశలపై నీళ్లు
జొహానె్నస్‌బర్గ్, మార్చి 1: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడాలన్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆరోన్ ఫాంగిసో ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తంకాగా, ఇటీవలే అతను ప్రిటోరియాలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) గుర్తింపుగల లాబొరేటరీలో బయోమెట్రిక్ పరీక్షలకు హాజరయ్యాడు. అయితే, అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు చేతి వంపు అనుమతించిన 15 డిగ్రీల కంటే ఎక్కువగా ఉందని ఆ పరీక్షల్లో స్పష్టమైంది. టి-20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో, కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి పరీక్షకు హాజరై, క్లీన్‌చిట్ పొందడం అసాధ్యంగానే కనిపిస్తున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫాంగిసో టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం లేదు.