క్రీడాభూమి

గెలుపు తేలిక్కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: అంతర్జాతీయ బాడ్మింటన్ మ్యాచ్‌లలో పోటీ మరింత తీవ్ర రూపం దాల్చిందని, దీంతో సుదీర్ఘమైన ర్యాలీలతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయని ‘తెలుగు తేజం’ పివి.సింధు (22) అభిప్రాయపడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆదివారం సుదీర్ఘంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాతో హోరాహోరీగా తలపడిన సింధు చివరికి రజత పతకాన్ని గెలుచుకుంది. సుదీర్ఘమైన ర్యాలీలతో ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో 110 నిమిషాల పాటు ఒకుహరాతో తలపడిన సింధు చివరికి వెంట్రుకవాసిలో ఓటమిని ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి బాడ్మింటన్ మ్యాచ్‌లలో పరిస్థితులు అంత సులభంగా లేవని, పురుషుల సింగిల్స్, డబుల్స్ సహా అన్ని విభాగాల మ్యాచ్‌లు సుదీర్ఘమైన ర్యాలీలతో హోరాహోరీగా సాగుతున్నాయని, ప్రతిభతో పాటు క్రీడాకారుల మధ్య పోటీ విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని సింధు పేర్కొంది. ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో వరుసగా రెండుసార్లు (2013, 2014 ఎడిషన్లలో) కాంస్య పతకాలను గెలుచుకున్న సింధు గ్లాస్గో నుంచి మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరికీ అంత సులభంగా పాయింట్లు లభించడం లేదు. ప్రతి పాయింట్ కోసం తీవ్రస్థాయిలో పోరాడాల్సి వస్తోంది’ అని సింధు స్పష్టం చేసింది.
గ్లాస్గోలో ఆదివారం ఒకుహరాతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు గురించి సింధు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఈ మ్యాచ్‌లో నేను మానసికంగా, శారీరకంగా ఎంతో అలసటకు గురయ్యా. అయినప్పటికీ ఇది ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ గనుక ప్రతి క్షణం పాయింట్ సాధించడం గురించే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో నాతో పాటు ఒకుహరా కూడా సమాన స్థాయిలో అలసటకు గురైంది. మా ఇద్దరి మధ్య పోరు సుదీర్ఘమైన ర్యాలీలతో సాగింది. వీటిలో ఒక ర్యాలీ ఏకంగా 73 షాట్లతో సాగింది. మా ఇద్దరి మధ్య ఇంతటి సుదీర్ఘ పోరాటం జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ ఆద్యంతం చాలా గొప్పగా సాగింది’ అని వివరించింది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలవడం విచారాన్ని కలిగించిందని ఆమె పేర్కొంది. ‘ఇది చాలా గొప్ప మ్యాచ్. ఒకుహరా కూడా ఎంతో బాగా ఆడింది. చివరి గేమ్‌లో మేమిద్దరం 20-20 పాయింట్లతో సరిసమానంగా నిలువడంతో విజయం ఎవరినైనా వరించే అవకాశం ఏర్పడింది. దీంతో నేను మరింత గట్టిగా పోరాడినప్పటికీ అదృష్టం కలసి రాలేదు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత నాలో విచారం అలుముకుంది. కానీ ఈ ఓటమి గురించి పట్టించుకోకుండా భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించాలని నిశ్చయించుకున్నా. దీంతో మరుసటి రోజుకే నేను మళ్లీ నేను సాధారణ స్థితికి చేరుకోగలిగా. ఏది ఏమైనప్పటికీ ఈ చాంపియన్‌షిప్‌లో నేను సాధించిన పతకం రంగు (కాంస్య వర్ణం నుంచి రజత వర్ణంలోకి) మారినందుకు సంతోషంగా ఉంది. రియో ఒలింపిక్స్ తర్వాత ఉత్తమ టోర్నమెంట్లలో ఇది ఒకటి. ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్ భిన్నమైనది. ఇంతకుముందు ఈ టోర్నీలో రెండు సార్లు కాంస్య పతకాలను సాధించిన నేను ఈసారి మరో అడుగు ముందుకేసి రజత పతకాన్ని గెలుచుకోగలిగినందుకు చాలా ఆనందిస్తున్నా’ అని సింధు వివరించింది.
అదీ జరుగుతుంది..
ప్రంపచ చాంపియన్‌షిప్‌లో సింధుతో పాటు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడంతో ఫైనల్‌లో పోరు వీరిద్దరి మధ్యే జరుగుతుందని ఎంతో మంది భావించారు. అయితే ఒకుహరాతో జరిగిన సెమీఫైనల్ పోరులో సైనా ఓటమిపాలవడంతో ఇది సాకారం కాలేదు. అయితే మున్ముందు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో తనకు, సైనాకు మధ్య పోటీ జరిగే అవకాశం లేకపోలేదని సింధు చెప్పింది. ‘గ్లాస్గోలో ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు భారతీయుల మధ్యే జరుగుతుందని మేము అనుకున్నాం. కానీ అలా జరగలేదు. అయితే ఈ టోర్నీలో ఏదో ఒకరోజు నేనూ, సైనా అమీతుమీ తేల్చుకునే అవకాశం ఉందని కచ్చితంగా చెప్పగలను’ అని సింధు స్పష్టం చేసింది.