క్రీడాభూమి

శ్రమించిన ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 1: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్లు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడైన ఫెదరర్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో విజయం కోసం వరుసగా మరోసారి తీవ్రస్థాయిలో ఐదు సెట్ల పాటు శ్రమించాల్సి వచ్చింది. రష్యా ఆటగాడు మిఖాయిల్ యోజ్నీతో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడి 6-1 తేడాతో తొలి సెట్‌ను గెలుచుకున్న ఫెదరర్ ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడ్డాడు. ఫలితంగా 6-7(3/7), 4-6 తేడాతో రెండు సెట్లను కోల్పోయిన ఫెదరర్ ఆ తర్వాత పుంజుకుని 6-4, 6-2 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకోవడం ద్వారా అతి కష్టం మీద మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. న్యూయార్క్‌లో ఫెదరర్‌కు ఇది 80వ విజయం కాగా, వయసులో తన కంటే ఒక ఏడాది చిన్నవాడైన యోజ్నీ (35)తో ఆడిన 17 మ్యాచ్‌లలో 17వ విజయం. యుఎస్ ఓపెన్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఫెదరర్ (36) ప్రీ-క్వార్టర్ ఫైనల్ బెర్తు కోసం స్పెయిన్‌కు చెందిన ఫెలిసియానో లోపెజ్‌తో తలపడనున్నాడు. లోపెజ్‌తో ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్ అన్ని మ్యాచ్‌లలోనూ విజయభేరి మోగించాడు. ఇదిలావుంటే, ఫెదరర్ మాదిరిగానే రెండో రౌండ్‌లో విజయం కోసం ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు రాఫెల్ నాదల్ కూడా చెమటోడ్చాల్సి వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రపంచ 121వ ర్యాంకు ఆటగాడు టారో డేనియల్‌తో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త వెనుకబడిన నాదల్ తొలి సెట్‌ను 4-6 తేడాతో చేజార్చుకున్నాడు. అయితే ఆ తర్వాత తనదైన పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి 6-3, 6-2, 6-2 తేడాతో వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకుని ప్రత్యర్థిని ఓడించిన నాదల్ మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. యుఎస్ ఓపెన్ 2010, 2013 ఎడిషన్లలో టైటిళ్లు సాధించిన నాదల్ అర్జెంటీనాకు చెందిన లియోనార్డో మేయర్‌తో తలపడనున్నాడు.
రబ్లెవ్ సంచలనం
కాగా, పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో రష్యాకి చెందిన 19 ఏళ్ల యువ ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ 7-5, 7-6(7/3), 6-3 తేడాతో 7వ సీడ్ ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై సంచలన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతనితో పాటు డొమినిక్ థెయిమ్ (ఆస్ట్రియా), యుఎస్ ఓపెన్ 2009 ఎడిషన్ చాంపియన్ జువాన్ మార్టిన్ డెల్‌పోట్రో (అర్జెంటీనా), 9వ సీడ్ ఆటగాడు డేవిడ్ గోఫిన్ (బెల్జియం) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. 24వ సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన డెల్‌పోట్రో పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 6-2, 6-3, 7-6(7/3) తేడాతో స్పానిష్ క్వాలిఫయర్ మెనెండెజ్ మాసెయిరస్‌ను ఓడించగా, 4 గంటల 12 నిమిషాల పాటు సాగిన మారథాన్ మ్యాచ్‌లో గోఫిన్ 3-6, 7-6(7/5(, 6-7 (2/7), 7-6(7/4), 6-3 తేడాతో గుయిడో పెల్లా (అర్జెంటీనా)పై విజయం సాధించాడు.
కుజ్నెత్సొవాకు చుక్కెదురు
అయితే మహిళల విభాగంలో రష్యాకి చెందిన ఎనిమిదో సీడ్ క్రీడాకారిణి స్వెత్లానా కుజ్నెత్సొవా పోరాటానికి తెరపడింది. యుఎస్ ఓపెన్ 2004 ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన కుజ్నెత్సొవా రెండో రౌండ్‌లో 6-3, 3-6, 6-3 సెట్ల తేడాతో జపాన్ క్రీడాకారిణి కురుమి నరా చేతిలో పరాజయం పాలైంది. దీంతో మహిళల సింగిల్స్ విభాగంలోని ఎనిమిది మంది టాప్ సీడ్స్‌లో ఐదో క్రీడాకారిణి ఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది. కుజ్నెత్సెవాతో పాటు ఇంతకుముందు సిమోనా హాలెప్, కరోలిన్ వొజ్నియాకి, డిఫెండింగ్ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్, జొహన్నా కోంటా కూడా మూడో రౌండ్‌కు చేరకముందే ఓటములపాలైన విషయం తెలిసిందే. కాగా, మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా (2016 ఎడిషన్ రన్నరప్)తో పాటు నాలుగో సీడ్ ఎలినా స్వితోలినా, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (ఉక్రెయిన్) కూడా తమ తమ ప్రత్యర్థులను ఓడించారు.

చిత్రాలు..ఫెదరర్, *నాదల్‌కూ తప్పని తిప్పలు, *రెండో రౌండ్‌లోనే చేతులెత్తేసిన కుజ్నెత్సొవా