క్రీడాభూమి

యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ క్వీన్ స్టెఫెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 10: అమెరికా క్రీడాకారిణి స్లొయేన్ స్టెఫెన్స్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. తుది పోరులో తన దేశానికే చెందిన సన్నిహిత స్నేహితురాలు మాడిసన్ కీస్‌ను 6-3, 6-0 తేడాతో చిత్తుచేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 83వ స్థానంలో ఉన్న స్టెఫెన్స్ సుమారు 61 నిమిషాలు జరిగిన పోరులో 16వ ర్యాంకర్ మాడిసన్ కీస్‌పై గెలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇద్దరూ అమెరికనే్ల కావడంతో, ప్రేక్షకుల మద్దతు ఇద్దరికీ లభించింది. 22 ఏళ్ల మాడిసన్ కీస్, 24 ఏళ్ల స్టెఫెన్స్‌లో ఎవరు పాయింట్ సంపాదిస్తే వారికి ప్రేక్షకులు జేజేలు పలికారు. కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా, సుమారు 11 నెలలు విశ్రాంతి తీసుకున్న స్టెఫెన్స్ ఈ ఏడాది వింబుల్డన్‌తో మళ్లీ కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ టోర్నీలో ఆమె పోరు మొదటి రౌండ్‌కే పరిమితమైంది. ఆతర్వాత వాషింగ్టన్ ఓపెన్‌లోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంది. మొదటి రౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో, ఈసారి యుఎస్ ఓపెన్‌లో స్టెఫెన్స్ రాణించడం చాలా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, విశే్లషకుల అభిప్రాయాలను, అంచనాలను తారుమారు చేస్తూ స్టెఫెన్స్ ఒక్కో అడ్డంకిని అధిగమించింది. సెమీస్‌లో హాట్ ఫేవరిట్, తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్‌ను ఓడించడంతో, టైటిల్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. అయితే, మాడిసన్ కీస్ కూడా మంచి ఫామ్‌లో ఉండడంతో, టైటిల్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మ్యాచ్ ఆరంభంలో మాడిసన్ కీస్ విరుచుకుపడితే, స్టెఫెన్స్ ఎక్కువ సేపు రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. దీనితో వెనుకడుగు వేసినట్టు కనిపించిన స్టెఫెన్స్ క్రమంగా బలాన్ని పుంజుకుంది. అసాధారణ సర్వీసులకు, అద్భుతమైన ప్లేసింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా, బంతిని తిప్పికొట్టడానికి, పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడడానికి సమయాన్ని వెచ్చించింది. ఆమె వ్యూహం ఫలించింది. మొదటి సెట్‌లో స్టెఫెన్స్ కేవలం రెండు పొరపాట్లు చేస్తే, మాడిసన్ కీస్ 17 పొరపాట్లతో మ్యాచ్‌ని సంక్లిష్టం చేసుకుంది. మొదటి సెట్‌లో స్టెఫెన్స్ సాధించిన 30 పాయింట్లలో కేవలం రెండు మాత్రమే ఆమె తన సొంత శక్తితో సంపాదించింది. మిగతావన్నీ మాడిసన్ కీస్ చేసిన పొరపాట్ల వల్లే ఆమె ఖాతాలోకి చేరాయి. గంటకు సుమారు 118 మైళ్ల వేగంతో సర్వీసు చేసినప్పటికీ స్టెఫెన్స్‌పై మాడిసన్ కీస్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మొదటి సెట్‌లో కొంత వరకూ పోరాడిన మాడిసన్ కీస్ రెండో సెట్‌లో ఆ మాత్రం ఎదురుదాడికి కూడా చేయలేక చేతులెత్తేసింది. ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరడం ఇద్దరికీ ఇదే మొదటిసారికాగా, మాడిసన్ కీస్‌ను రన్నరప్ ట్రోఫీకి పరిమితంకాగా, స్టెఫెన్స్ కొత్త చాంపియన్‌గా అవతరించింది.
గత ఏడాది మాడిసన్ కీస్ చేతి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోగా, స్లొయెన్ స్టెఫెన్స్ కాలికి ఆపరేషన్ జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతున్నప్పుడు, దానికి సాజరుకాలేకపోయిన ఇద్దరూ ఫోన్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నాడు. ఇద్దరూ గాయాల నుంచి కోలుకొని, మళ్లీ కెరీర్‌ను మొదలుపెట్టారు. యుఎస్ ఓపెన్ ఆరంభం దాకా ఇద్దరూ చెప్పుకోదగ్గ విజయాలను నమోదు చేయలేకపోయారు. కానీ, ఈ టోర్నీలో ఎవరూ ఊహించని రీతిలో చెలరేగిపోయారు. అడ్డంకులను అధిగమిస్తూ, ఫైనల్ చేరారు.

ఈ టోర్నమెంట్ 1968లో ఓపెన్ శకంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక అన్‌సీడెడ్ క్రీడాకారిణి మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించడం ఇది రెండోసారి. 2009లో కిమ్ క్లిజ్‌స్టెర్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను గెల్చుకుంది. ఆ ఫీట్‌ను పునరావృతం చేసిన ఘనత స్టెఫెన్స్‌కు దక్కింది. ఈ ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను నలుగురు వేర్వేరు క్రీడాకారిణులు కైవసం చేసుకోవడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెన్‌ను సెరెనా విలియమ్స్ గెల్చుకోగా, ఫ్రెంచ్ ఓపెన్‌ను జెలెనా ఒస్టాపెన్కో తన ఖాతాలో వేసుకుంది. వింబుల్డన్ టైటిల్‌ను గార్బెనె ముగురుజా సాధించింది. ఏడాదిలో చివరిదైన యుఎస్ ఓపెన్‌లో స్టెఫెన్స్ విజేతగా నిలిచింది. ఈ విధంగా చివరిసారి, 2014లో లీ నా (ఆస్ట్రేలియా), మరియా షరపోవా (ఫ్రెంచ్ ఓపెన్), పెట్రా క్విటోవా (వింబుల్డన్), సెరెనా విలియమ్స్ (యుఎస్ ఓపెన్) గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్నారు. కాగా, యుఎస్ ఓపెన్‌లో ఇద్దరు అమెరికర్లు ఫైనల్‌లో టైటిల్ కోసం పోరాడడం 2002 తర్వాత ఇదే మొదటిసారి. అప్పట్లో సెరెనా విలియమ్స్ తన అక్క వీనస్ విలియమ్స్‌ను ఓడించింది.

చిత్రం..యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీతో అమెరికా క్రీడాకారిణి
స్లొయెన్ స్టెఫెన్స్