క్రీడాభూమి

పాక్ క్రికెట్‌లో కొత్త ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 11: పాకిస్తాన్ క్రికెట్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. త్వరలోనే హోం సిరీస్‌లు స్వదేశంలోనే జరుగుతాయన్న నమ్మకం అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారుల్లో, ఇటు అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఏడు దేశాలకు చెందిన ఆటగాళ్లతో కూడిన వరల్డ్ ఎలెవెన్ జట్టు మూడు టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను పాకిస్తాన్ జట్టుతో ఆడనుండడం అక్కడి క్రికెట్‌కు కొత్త ఊపునిస్తున్నది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ మంగళవారం గడాఫీ స్టేడియంలో జరుగుతుంది. ఇదే స్టేడియంలో 13, 15 తేదీల్లో మిగతా రెండు టి-20 మ్యాచ్‌లు ఉంటాయి. పాక్ జట్టుకు సర్ఫ్‌రాజ్ అహ్మద్ నాయకత్వం వహిస్తుండగా, వరల్డ్ ఎలెవెన్‌కు కెప్టెన్‌గా ఫఫ్ డు ప్లెసిస్ సేవలు అందిస్తాడు. 2009లో శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత, జింబాబ్వేను మినహాయిస్తే, టెస్టు హోదా ఉన్న దేశాలేవీ పాక్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలో పాక్‌లో జరగాల్సిన మ్యాచ్‌లు రద్దయ్యాయి. అంతకు ముందే పాక్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను భారత్ రద్దు చేసుకోగా, లాహోర్‌లో లంక క్రికెటర్లపై దాడి తర్వాత అక్కడ మ్యాచ్‌లకు ఏ జట్టూ సాహసించలేదు. దీనితో పాకిస్తాన్ జట్టు హోం సిరీస్‌లకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని వేదికగా ఎంచుకుంది. చివరికి దేశవాళీ టి-20 టోర్నమెంట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) మ్యాచ్‌లను కూడా యుఎఇలోనే నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే, ఈ ఏడాది ధైర్యం చేసి, పిఎస్‌ఎల్ టోర్నమెంట్ ఫైనల్‌కు లాహోర్‌ను వేదికగా ప్రకటించారు. సర్వత్రా అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, పలువురు విదేశీ క్రికెటర్లతో కూడిన పిఎస్‌ఎల్ ఫైనల్‌ను పిసిబి లాహోర్‌లో విజయవంతంగా నిర్వహించింది. దీనితో, పాకిస్తాన్‌లో విదేశీ క్రికెటర్ల ప్రాణాలకు హాని లేదనే విషయం స్పష్టమైందని పేర్కొంటూ, ముందుగా నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారమే ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడాల్సిందిగా భారత్‌సహా అన్ని దేశాలనూ ఒప్పించాలని ఐసిసిని పిసిబి కోరింది. అయితే, భద్రతాపరమైన అభ్యంతరాలను వ్యక్తం చేసిన ఏ జట్టునూ ఫలానా దేశంలో సిరీస్‌లు లేదా టోర్నీలు ఆడి తీరాల్సిందిగా ఆదేశాలు జారీ చేయలేమని ఐసిసి చేతులెత్తేసింది. అదే సమయంలో పాక్‌లో క్రికెటర్ల భద్రతపై క్రికెటర్లు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నిరూపించేందుకు వరల్డ్ ఎలెవెన్ జట్టును అక్కడికి పంపింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత లాహోర్ చేసుకున్న వరల్డ్ ఎలెవెన్ జట్టు ఆటగాళ్లు సోమవారం కొంత సేపు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. ఈ మూడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలావున్నా, పాక్‌లో విదేశీ జట్లు సిరీస్‌లు ఆడేందుకు అవకాశాలు మెరుగుపడతాయని పిసిబి ఆశిస్తున్నది. పాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే దిశగా ఇది తొలి అడుగు మాత్రమేనని, ఒక భారీ మార్పుకు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ శ్రీకారం చుడుతుందని ఐసిసి ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి.