క్రీడాభూమి

యవ సాకర్ ప్రపంచ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: యువ సాకర్ ప్రపంచ యుద్ధానికి భారత్ వేదిక కానుంది. శుక్రవారం నుంచి మొదలయ్యే అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో పోటీ పడేందుకు 24 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆతిథ్య దేశం భారత్ తొలి మ్యాచ్‌లో అమెరికాను ఢీ కొంటుంది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇదే స్టేడియంలో అంతకంటే ముందు కొలంబియా, ఘనా జట్ల మధ్య మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, మరో వేదికైన ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలోనూ రెండు మ్యాచ్‌లు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో న్యూజిలాండ్, టర్కీ జట్లు తలపడతాయి. రాత్రి 8 గంటలకు పరాగ్వే, మాలీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దేశంలో మొట్టమొదటిసారి జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) టోర్నమెంట్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను భారత ఫుట్‌బాల్ సంఘం పర్యవేక్షణలో లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ (ఎల్‌ఒసి) ద్వారా పూర్తయ్యాయి. వౌలిక సదుపాయాల కల్పన నుంచి ఆటగాళ్ల విడిది వరకు, రవాణా నుంచి క్రీడాకారుల భద్రత వరకూ అన్ని అంశాలనూ భారత అధికారులతోపాటు ఫిఫా అధికార ప్రతినిధుల బృందం కూడా పర్యవేక్షిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ టోర్నమెంట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. కాగా, ఆతిథ్య దేశ హోదాలో భారత్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించింది.
స్టార్ల తొలి అడుగులు ఇక్కడే..
‘్ఫఫా’ అండర్-17 వరల్డ్ కప్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎంతో మంది పేరుప్రఖ్యాతులు సంపాదించిన స్టార్లు ఈ టోర్నమెంట్‌లోనే తొలి అడుగులు వేశారు. రొనాల్డిన్హో లేదా నేమార్.. జేవీ లేదా ఇనీస్టా.. ఇకెర్ కాసిలాస్ లేదా టోనీ క్రూస్.. సాకర్ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాలను సృష్టించుకున్న ఎంతో మంది సూపర్ హీరోలు ప్రస్థానాన్ని ప్రారంభించింది ఇక్కడి నుంచే. ఈసారి కూడా, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లోని ఆనందాన్ని ఆసాంతం ఆస్వాదించడానికి అభిమానులు సిద్ధంకాగా, పలువురు యువ ఆటగాళ్లు భవిష్యత్తుపై కొండంత ఆశతో, తమను తాము నిరూపించుకోవడానికి ఉరకలు వేస్తున్నారు. వీరిలో ఎంత మంది రొనాల్డిన్హోలు, మారడోనాలు, లియోనెల్ మెస్సీలు, క్రిస్టియానో రొనాల్డోలు ఉన్నారో ఎవరికి తెలుసు? సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, 1997లో రొనాల్డిన్హో బ్రెజిల్ తరఫున ఆడి, అండర్-17 వరల్డ్ కప్‌ను అందుకున్నాడు. ఆతర్వాత అతను అధిరోహించిన శిఖరాల గురించి ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకర్ కాసిలాస్ అదే టోర్నీలో స్పెయిన్‌ను సెమీస్ వరకూ చేర్చాడు. తదుపరి అతను బార్సిలోనా తరఫున స్పానిష్ లీగ్ లా లిగాలో, స్పెయిన్ జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా వెలిగాడు. కాసిలాస్ కంటే నాలుగేళ్ల సీనియర్ జేవీ గురించి తెలియని సాకర్ అభిమానులు చాలా తక్కువగా ఉంటారు. డిగో మారడోనా, మెస్సీ, రొనాల్డో వంటి మేటి ఆటగాళ్ల సరసన చోటు దక్కించుకొని, సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆటగాడు అతను. జేవీ ప్రయాణం కూడా అండర్-17 వరల్డ్ కప్ నుంచే మొదలైంది. జర్మనీకి చెందిన టోనీ క్రూస్ కూడా ఈ యువ వరల్డ్ కప్ వీరుడే. రహీం స్టెర్లింగ్, మెంఫిస్ డెపే, గియోవనీ డస్ సాంటోస్, జేమ్స్ రోడ్రిగెజ్, ఆలెగ్సాండ్రో డెల్ పియెరో, వాన్క్‌వో కనూ, లండన్ డొనొవాన్, ఫ్రానె్సక్స్ ఫాబ్రిగాస్, కార్లొస్ టెవెజ్, జేవియర్ మచెరానో, ఎస్టెబాన్ కాంబియాసో, డానీ వెల్‌బెక్.. ఇలా చెప్తూ పోతే ఎంతో మంది సాకర్ వీరులు ‘పిల్ల’ వరల్డ్ కప్‌లోనే తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నారు. సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. నేమార్ 2009 అండర్-17 వరల్డ్ కప్‌లో ఆడాడు. సాకర్ మహా వృక్షంగా ఎదిగాడు. ఇటీవలే బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జర్మెయిన్ (పిఎస్‌జి)కి రికార్డు స్థాయి ధరకు ట్రాన్స్‌ఫరైన నేమార్ తనకు భవిష్యత్తులో సాకర్ ప్రపంచం జేజేలు పలుకుతుందని అప్పట్లోనే నిరూపించుకున్నాడు. 263 మిలియన్ డాలర్ల ధర పలికిందంటే నేమార్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఇలాంటి అసాధారణ ఆటగాళ్లేకాదు.. వివాదాస్పదులు కూడా అండర్-17 వరల్డ్ నుంచే పుట్టుకొచ్చిన సందర్భాలున్నాయి. 1987లో ఈ టోర్నమెంట్ కెనడాలో జరిగినప్పుడు బొలివియా తరఫున ఆడిన మార్కో ఎచెవెరీ కొద్దికాలంలోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 1994లో అతను వరల్డ్ కప్‌లో ఆడాడు. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగిన నాలుగో నిమిషంలోనే జర్మనీ లెజెండరీ ఫుట్‌బాలర్ లోథార్ మథియాస్‌ను ఉద్దేశపూర్వకంగా గాయపరిచాడు. రిఫరీ అతనికి రెడ్‌కార్డు చూపి బయటకు పంపాడు. ఆ ప్రవర్తనే అతని కెరీర్‌ను చిక్కుల్లోని నెట్టింది. సామర్థ్యం ఉన్నప్పటికీ, క్రమశిక్షణ లేకపోవడంతో కెరీర్‌ను అతను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. నాణేనికి బొమ్మాబొరుసు ఉన్నట్టే, అండర్-17 వరల్డ్ కప్ వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ప్రతిభావంతులు వెలుగులోకి రావడం, భవిష్యత్తులో సాకర్‌కు విశేష సేవలు అందించడం, చిన్నతనం నుంచే అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవడం వంటి సుగుణాలు ఈ టోర్నీ ద్వారా లభిస్తాయి. అయితే, అదే సమయంలో హఠాత్తుగా వచ్చిపడే స్టార్‌డమ్ కొంత మంది సమర్థులైన యువ ఆటగాళ్లను తప్పుతోవ పట్టించే ప్రమాదం ఉంది. కోట్లకు కోట్ల డబ్బు, విలాసవంతమైన జీవితం, ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పట్టే అభిమానులు వంటి అంశాలు సహజంగానే టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఏవో కొన్ని నష్టాలున్నాయని అండర్-17 టోర్నమెంట్‌ను తప్పుపట్టడానికి వీల్లేదు. ఈ టోర్నీతోనే ఎంతో మంది ప్రతిభావంతులు సాకర్ ప్రపంచానికి లభిస్తునే ఉన్నారు. ఇక ముందు కూడా ఇదే ఒరవడి కొనసాగడం ఖాయం. సందేహాలకు తెరదించి, ‘యువ’ ప్రపంచ కప్‌ను ఆస్వాదించడానికి సిద్ధమవుదాం.