క్రీడాభూమి

ఆరేళ్ల జైలు చాలదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 2: రెండు కాళ్లూ లేకపోయినా, కృత్రిమ కాళ్లతోనే పరుగులు తీస్తూ, ప్రపంచ మేటి అథ్లెట్‌గా ఎదిగిన ఆస్కార్ పిస్టోరియస్‌కు ‘హత్య కేసు’లో విధించిన ఆరేళ్ల జైలు శిక్ష చాలా చిన్నదని, ఆ శిక్షను పెంచాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తున్నది. శుక్రవారం ఈ ప్రత్యేక అప్పీల్‌పై బ్లూంఫొంటైన్ అప్పీల్ కోర్టు ఒక రోజు విచారణ జరుపుతుంది. తీర్పును వెంటనే లేదా తర్వాత ప్రకటించవచ్చు. దక్షిణాఫ్రికాలో సంచలంన సృష్టించిన ఈ కేసు మళ్లీ కోర్టుకు రావడంతో అందరి దృష్టి మరోసారి రాబోయే తీర్పుపై కేంద్రీకృతమైంది. తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్ హత్య కేసులో ఇప్పటికే జైలు ఊచలు లెక్కిస్తున్న అతని శిక్షాకాలం ఆరేళ్ల నుంచి 15 సంవత్సరాలకు పెరగే అవకాశాలున్నాయి. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించడమేగాక, సమ్మర్ ఒలింపిక్స్‌లో సాధారణ అథ్లెట్స్‌తో పోటీపడిన మొట్టమొదటి వికలాంగ అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన పిస్టోరియస్ ‘బ్లేడ్ రన్నర్’గా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, గర్ల్‌ఫ్రెండ్ రీవా హత్య కేసులో ఇరుక్కొని ఒక్కసారిగా ప్రతిష్ఠ కోల్పోయాడు. 2013లో ‘ప్రేమికుల రోజు’నే తన ప్రేయసి రీవాను హత్య చేశాడన్న అభియోగంపై విచారణను ఎదుర్కొంటున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తన గదిలోకి చొరబడ్డారన్న అనుమానంతో కాల్పులు జరిపానని, రీవా హత్య ఉద్దేశపూర్వకంగా జరగలేదని పిస్టోరియస్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. రీవాను హత్య చేయాలన్న ఉద్దేశం అతనికి లేకపోయినా, అనధికారికంగా తుపాకీని కలిగి ఉండడం, కాల్పులు జరపడం అతను చేసిన తప్పులని స్పష్టం చేసింది. ఈ కేసులో అతనిని దోషిగా తేల్చింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టుకు ఎక్కినప్పటికీ పిస్టోరియస్‌కు ఊరట లభించలేదు. అతనిని దోషిగానే పేర్కొన్న సుప్రీం కోర్టు ఆరేళ్ల శిక్ష విధించింది. రీవాను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ పలు సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందు ఉంచడంతో పిస్టోరియస్ తనను తాను సమర్థించుకోలేకపోయాడు. ప్రాసిక్యూషన్ ఆరోపణలు, డిఫెన్స్ వివరణలతో కేసు చిట్టా పెరిగిపోయింది. మొత్తం మీద సుమారు 2,000 పేజీల వివరణలను న్యాయస్థానం అధ్యయనం చేసింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను, వాదనలను తిప్పికొట్టేందుకు పిస్టోరియస్ తరఫు న్యాయవాదులు చివరి వరకూ ప్రయత్నించారు. కానీ, సుప్రీం కోర్టు అతనిని దోషిగానే ప్రకటించింది. వాష్ రూమ్‌లో ఉన్న రీవాను పిస్టోరియస్ తుపాకీతో కాల్చి హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వాదన. బాత్‌రూమ్ తలుపుల నుంచి బులెట్లు దూసుకెళ్లిన ఆనవాళ్లున్నాయి. అంతేగాక, పిస్టోరియస్ వద్ద ఉన్న ఒక క్రికెట్ బ్యాట్‌పైనా రక్తం మరకలున్నాయి. స్టార్ బ్యాట్స్‌మన్ హెర్చెల్ గిబ్స్ సంతకం చేసి మరీ పిస్టోరియస్‌కు ఆ బ్యాట్‌ను బహూకరించాడు. ఆ బ్యాట్‌ను రీవా హత్యకు ‘బ్లేడ్ రన్నర్’ ఉపయోగించాడని ప్రాసిక్యూషన్ కథనం. హత్య జరిగిన రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత పిస్టోరియస్, రీవా పెద్దగా వాదించుకోవడం వినిపించిందని చుట్టుపక్కల వాళ్లు కోర్టులో సాక్ష్యమిచ్చారు. మద్యం మత్తులోవున్న పిస్టోరియస్ తన గర్ల్‌ఫ్రెండ్ రీవాతో ఘర్షణ పడ్డాడని, కోపం తట్టుకోలేక ఆమెపై బ్యాట్‌తో దాడి చేసి ఉంటాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ప్రాణభయంతో రీవా బాత్‌రూమ్‌లోకి పరిగెత్తిందని, పిస్టోరియస్ తన బెడ్ పక్కనే ఉన్న తన కృత్రిమ కాళ్లను తగిలించుకొని వెళ్లి, బయటి నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడని కోర్టుకు వివరించింది. ప్రాసిక్యూషన్ వివరణ, సేకరించిన సాక్ష్యాలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. అధికారుల అనుమతిగానీ, లైసెన్సుగానీ లేకుండా మారణాయుధాన్ని కలిగి ఉండడం దక్షిణాఫ్రికాలో తీవ్రమైన నేరమన్న విషయాన్ని ప్రస్తావించింది. రీవాను హత్య చేయాలన్న ఉద్దేశం అతనికి లేకపోవచ్చని, కానీ, లైసెన్సు లేని తుపాకీని కలిగి ఉండడం, దానిని ఉపయోగించడం నేరాలని కోర్టు స్పష్టం చేసింది. దొంగలు లేదా తనను హత్య చేయడానికి ఎవరో దుండగులు ఇంట్లోకి ప్రవేశించారని అనుకున్నానని, అలికిడిని బట్టి వారు వాష్ రూమ్‌లోకి చొరబడ్డారని భావించి కాల్పులు జరిపానని పిస్టోరియస్ ఇచ్చిన వివరణతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఆగంతకులు చొరబడినట్టు అనుమానం వస్తే, ముందుగా భద్రతా సిబ్బందికి ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రాసిక్యూషన్ ప్రశ్నకు డిఫెన్స్ నుంచి సరైన సమాధానం లేదని స్పష్టం చేసింది. కాల్పులు జరపడానికి ముందు, లేదా ఆ తర్వాతైనా పోలీసులకు తెలపకుండా సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పిస్టోరియస్‌ను దోషిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ, అతనికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. దీనితో సుమారు ఏడాదిన్నర కాలంగా అతను జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అయితే, ఒక హంతకుడికి ఆరేళ్ల శిక్ష సరిపోదని, అతనిని మరింత కఠినంగా శిక్షించాలని ప్రాసిక్యూషన్ వేసిన కేసును సుప్రీం కోర్టు శుక్రవారం పరిశీలిస్తుంది. ఒకే రోజు జరిగే రివ్యూకు పిస్టోరియస్ హాజరయ్యే అవకాశం లేదు. అతనికి ఎంత కాలం జైలు శిక్ష విధించాలనే విషయంపై ప్రాసిక్యూషన్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా, దక్షిణాఫ్రికా చట్టాలను అనుసరించి కనీసం 15 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఎలావున్నా, ఇప్పటికే పిస్టోరియస్ అథ్లెటిక్స్ కెరీర్ పూర్తిగా నాశనమైంది. అతను తిరిగి ట్రాక్‌పై కనిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమనే చెప్పాలి.

చిత్రం..పిస్టోరియస్