క్రీడాభూమి

భారత్ ఘోర పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 17: సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో దూసుకువెళ్తున్న భారత క్రికెట్ జట్టు సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టుమ్యాచ్‌లో ఆతిధ్య జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ప్రారంభ టెస్టులో 72 పరుగుల తేడాతో వెనుకబడిన భారత్ రెండో టెస్టులో 135 పరుగుల తేడాతో అపజయాన్ని మూటకట్టుకుంది. ఆతిధ్య జట్టు నిర్దేశించిన 287 లక్ష్యాన్ని ఛేదించడంలో పూర్తిగా చతికిలపడింది. ఇందుకు భారత్ జట్టులోని సభ్యులంతా తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా బ్యాటింగ్, అనవసర రనౌట్లు, చెత్తషాట్లతో ఆడడం వల్ల కేవలం 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల ఫ్రీడం సిరీస్‌ను 0-2 తేడాతో చేజేతులా చేజార్చుకుంది.
భారత్ జట్టు క్రికెటర్ రోహిత్‌శర్మ తమ జట్టు వికెట్లు పటపటా పడిపోతుండడంతో తనదైన శైలిలో ఆడుతూ చురుకుగా అర్ధవంతంగా ఆడుతూ పదునైన షాట్లతో అలరించాడు. రోహిత్‌శర్మ 74 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేసినా అర్ధసెంచరీని సాధించలేకపోయాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ప్రేక్షకులను కొంతవరకైనా అలరించాడు. భారత్ జట్టులో రోహిత్‌శర్మ ఒక్కడే కాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించి సిరీస్ కోల్పోయినా పరువు దక్కించాడు.
రెండో ఇన్నింగ్స్ ఐదోరోజున ఒక దశలో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 87 మాత్రమే చేయడంతో ఘోరాతి ఘోరంగా భారత్ జట్టు విఫలమై అవమానాన్ని మూటకట్టుకుంటుందనుకునే తరుణంలో మిగిలిన ఆటగాళ్ల సహకారంతో 151 పరుగైనా చేయగలగడం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది. 27వ ఓవర్‌లో డివిలియర్ వేసిన బంతిని ఆడబోయిన చటేశ్వర్ పుజారా అనవసర పరుగుకోసం యత్నించడంతో క్వింటన్ డికాక్ చేతిలో స్టంప్ అవుటై కేవలం 19 పరుగులు చేసి జట్టును నిరాశలో పడేశాడు. కగిసొ రబడ వేసిన బంతిని లెగ్ బౌండరీగా మలచబోయిన పార్ధివ్ పటేల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మోర్నె మోర్కెల్ అద్భుత క్యాచ్‌తో వెనుతిరిగాడు. హర్ధిక్ పాండ్య 18 బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 74 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత రవీంద్ర అశ్విన్ మూడు పరుగులు చేసి నింగ్డికి దొరికిపోగా, మహ్మద్ షమీ 24 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో 28 పరుగులు చేయగలిగాడు. 48వ ఓవర్‌లో రోహితశర్మ వికెట్‌ను రబడ చేజిక్కించుకోగా, ఆ తర్వాత వచ్చిన బౌలర్ నింగ్డి తన ఐదవ వికెట్‌గా మహ్మద్ షమీని మిడ్ ఆన్‌లో ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మిగిలిన బ్యాట్స్‌మన్లు జస్ప్రీత్ బుమ్రా రెండు పరుగులు, ఇశాంత్ శర్మ నాలుగు పరుగులు మాత్రమే చేసి భారత్‌ను నిరాశకు గురిచేశారు. ఇదిలావుండగా, రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 158 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ఆటతీరును ప్రదర్శించి 153 పరుగులు చేయడం గమనార్హం.
భారత ఆటగాళ్లకు పిచ్ సరిగా అనుకూలించకపోవడంతో ఆట చివరిరోజున కేవలం 50.2 ఓవర్లకే చాప చుట్టేశారు. రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజున మూడు ప్రధాన వికెట్లు పటపటా పడిపోయినా, కనీసం ఐదోరోజైనా పరువు నిలబెడతారనుకున్న భారత జట్టు ఆటగాళ్లు తమకు ఇంతటి ఘోర పరాజయం ఎదురవుతుందని బహుశా కలలో కూడా ఊహించి ఉండరేమో. దక్షిణాఫ్రికా 2015లో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా ఆ జట్టు కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ తన టీమ్ సమష్టి సహకారంతో, పటిష్టమైన జట్టు ఎంపికతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులు (50.2 ఓవర్లలో) చేసింది.
ఆరంగేట్రంలోనే అదుర్స్
దక్షిణాఫ్రికాకు చెందిన పేసర్ లుంగీ ఎంగ్డీ భారత్‌తో జరిగిన టెస్టుమ్యాచ్‌లో తొలిసారిగా ఆరంగేట్రం చేసి, ఆరంభంలోనే అందరి నోటా అదుర్స్ అనిపించేలా తన ప్రతిభను ప్రదర్శించాడు. ఎంగ్డి సొంత గడ్డ అయిన దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ మైదానంలో జరిగిన టెస్టుమ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం ఏడు వికెట్లు పడగొట్టి ఔరా..ఏమి ఈ పేసర్ ప్రతిభ అనేలా ఘనతను దక్కించుకున్నాడు. భారత్‌తో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో పార్ధివ్ పటేల్‌ను ఔట్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ పేసర్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడం గొప్ప విషయం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కే.ఎల్.రాహుల్, హార్ధిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, షమీ, బుమ్రా వికెట్లను పడగొట్టింది ఈ పేసరే. రెండో ఇన్సింగ్‌లో 12.2 ఓవర్లు వేసిన ఎంగ్డి కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా అవార్డును సాధించాడు. దక్షిణాఫ్రికా జట్టులో టెస్టు మ్యాచ్‌లలో ఐదు వికెట్లకు పైగా తీసిన పేసర్లలో ఆరో వ్యక్తిగా లుంగీ ఎంగ్డి రికార్డును సాధించాడు. టెస్టు మ్యాచ్‌లలో ఆరంగేట్రం చేసిన ప్రథమార్ధంలోనే ఐదు వికెట్లు తీసిన వారిలో దక్షిణాఫ్రికా పేసర్లలో లాన్స్ క్లూస్‌నెర్ (8/62, భారత్‌తో 1996లో జరిగిన మ్యాచ్), చార్లెస్ లాంగెవెల్డ్ (5/46 2005లో ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్), వెర్నన్ ఫిలాండర్ (5/15 ఆస్ట్రేలియాతో 2011లో జరిగిన మ్యాచ్), మర్చంట్ డీ లాంగె (7/81 శ్రీలంకతో 2011లో జరిగిన మ్యాచ్), కైల్ అబొట్టి (7/29 పాకిస్తాన్‌తో 2013లో జరిగిన మ్యాచ్) ఉన్నారు.
* * *
చిత్రం..భారత్‌తో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో ఆరు వికెట్లు సాధించిన ఆనందంలో దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగ్డి