క్రీడాభూమి

సెమీ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వీన్స్‌టౌన్, జనవరి 26: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 131 పరుగుల తేడాతో చిత్తుచేసి, పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ పోరును ఖాయం చేసుకుంది. శుభం గిల్ సెంచరీని కొద్దిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ప్రతిభతో ప్రత్యర్థి ముందు భారత్ 266 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. దీనిని ఛేదించడంలో విఫలమైన బంగ్లాదేశ్ 134 పరుగులకే కుప్పకూలింది. మరో 47 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 16 పరుగులకే మొదటి వికెట్‌ను మనోజ్ కర్లా (9) రూపంలో కోల్పోయింది. రబియుల్ హక్ బౌలింగ్‌లో అతను తౌహిద్ హ్రిదయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ పృథ్వీ షాతో కలిసిన ఫస్ట్‌డౌన్ ఆటగాడు శుభం గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ కోలుకుంది. 54 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసిన పృథ్వీ షాను ఖాజీ ఓనిక్ బౌల్డ్ చేశాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ హార్విక్ దేశాయ్ 34 పరుగులు సాధించగా, క్రీజ్‌లో నిలదొక్కుకొని 94 బంతులు ఎదుర్కొన్న శుభం గిల్ 86 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద నరుూమ్ హక్ బౌలింగ్‌లో మహిదుల్ ఇస్లాం అన్కోన్‌కు దొరికిపోయాడు. 14 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్న అతని స్కోరులో 9 ఫోర్లు ఉన్నాయి. రియాన్ పరాగ్ 15 పరుగులకే ఔట్‌కాగా, అభిషేక్ శర్మ 49 బంతుల్లో, ఆరు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించి హసన్ మహమూద్ బౌలింగ్‌లో మహిదుల్ ఇస్లాం అన్కోన్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. చివరిలో కమలేష్ నగర్‌కోటి (5), అనుకూల్ సుధాకర్ రాయ్ (2), శివం మావీ (5), శిశా సింగ్ (3) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా, ఒక్క బంతిని ఎదుర్కొన్న ఇషాన్ పొరెల్ పరుగుల ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ఖాజీ ఓనిక్ 48 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. నరుూమ్ హసన్, కెప్టెన్ సైఫ్ హసన్ చెరి రెండు వికెట్లు సాధించారు. హసన్ మహమూద్, రబియుల్ హక్ చెరొక వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.
లక్ష్య సాధనలో తడబాటు..
భారత్‌ను ఓడించి, సెమీ ఫైనల్ చేరేందుకు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్ లక్ష్య సాధనలో తడబడింది. ఓపెనర్ పినాక్ ఘోష్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలచాడు. అతనిని మినహాయిస్తే, మిగతా వారిలో ఎవరూ భారత బౌలింగ్‌ను, ప్రత్యేకించి కమలేష్ నగర్‌కోటి సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. మిడిల్ ఆర్డర్‌లో అఫిఫ్ హొస్సేన్ చేసిన 18 పరుగులు బంగ్లాదేశ్ తరఫున రెండో అత్యుత్తమ స్కోరుగా నమోదు కావడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాలకు అద్దం పడుతుంది. అతి కష్టం మీద 42.1 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఈ జట్టు ఇక ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ అండర్-19 ఇన్నింగ్స్: 49.2 ఓవర్లలో 265 ఆలౌట్ (పృథ్వీ షా 40, శుభం గిల్ 86, హార్విక్ దేశాయ్ 34, అభిషేక్ శర్మ 50, ఖాజీ ఓనిక్ 3/48, నరుూమ్ హసన్ 2/35, సైఫ్ హసన్ 2/41, హసన్ మహమూద్ 1/55, రబియుల్ హక్ 1/34).
బంగ్లాదేశ్ అండర్-19 ఇన్నింగ్స్: 42.1 ఓవర్లలో 134 ఆలౌట్ (పినాక్ ఘోష్ 43, అఫిఫ్ హొస్సేన్ 18, కమలేష్ నగర్‌కోటి 3/18, శివమ్ మావి 2/27, అభిషేక్ శర్మ 2/11, అనుకూల్ సుధాకర్ రాయ్ 1/14).

చిత్రం..శుభం గిల్