క్రీడాభూమి

రిటైర్ కావాలా? తమాషాగా ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 1: ప్రతి సారీ మీడియా వాళ్లు తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించడంతో విసిగిపోయిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం రాత్రి మీడియా సమావేశంలో అ ప్రశ్నకు విచిత్ర రీతిలో తనదైన శైలిలో స్పందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ దాడికి బలయింది ఒక ఆస్ట్రేలియా జర్నలిస్టు కావడం కాకతాళీయం. ప్రపంచ టి-20 టోర్నమెంట్‌లో గురువారం రాత్రి ముంబయిలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలయిన తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో ‘మీరు టి-20లు, వన్‌డే పార్మాట్‌లలో కొనసాగాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే టెస్టు క్రికెట్‌నుంచి రిటైరయిన ధోనీ ఈ ప్రశ్నతో కాస్త సహనం కోల్పోయినట్లు కనిపించాడు. అయితే అతను తనదైన ప్రత్యేక శైలిలో కాస్త వ్యంగ్యం, మరికాస్త తమాషా జోడించి సమాధానం చెప్పాడు. ‘క్రికెట్‌లో మీరు దాదాపు అన్నీ సాధించారు. మీరు ఇంకా కొనసాగాలనుంటున్నారా?’ అని క్రికెట్ ఆస్ట్రేలియా రిపోర్డర్ శామ్ ఫెర్రీస్ ధోనీని అడిగాడు. దీనిపై స్పందించిన ధోనీ ఆ జర్నలిస్టును వేదికపై తన పక్క సీటులో కూర్చోవాలంటూ ఆహ్వానించాడు. ఆశ్చర్య పోయిన ఆ రిపోర్టర్ సమావేశంలో ఉన్న వాళ్ల నవ్వుల మధ్య వేదికపైకి రాగానే ధోనీ అతని భుజం చుట్టూ చేయి వేసి తన పక్కన కూర్చోబెట్టుకుని అతడ్ని ఎదురు ప్రశ్నించడం ప్రారంభించాడు. ‘నేను రిటైర్ కావాలని నువ్వు సీరియస్‌గా అనుకుంటున్నావా?’ అని ధోనీ అతడ్ని ప్రశ్నించాడు. దానికి అతను ‘అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను’ అని అన్నాడు. భారతీయ మీడియా చెందిన వ్యక్తి ఈ ప్రశ్న అడుగుతాడని నేను ఊహిస్తూ వచ్చాను. ఎందుకంటే భారత్ తరఫున ఒక వికెట్ కీపర్‌గా ఆడే కుమారుడు కానీ తమ్ముడు కానీ నీకు ఉన్నాడా అని నేను అతడ్ని అడిగి ఉండేవాడిని’ అని ధోనీ అన్నాడు. ‘్ఫల్డ్‌లో నేను పరుగెత్తడం చూసాక నేను అన్‌ఫిట్ అని నీవు అనుకుంటున్నావా? అని ధోనీ ఆ రిపోర్టర్‌ను ఆ తర్వాత అడిగాడు. లేదని అతను అంటూ, నిజానికి ధోనీ చాలా వేగంగా పరుగెత్తుతాడని కూడా అన్నాడు. ‘అంటే నేను నిజంగా 2019 ప్రపంచ కప్‌దాకా కొనసాగుతానని నీవు అనుకుంటున్నావా?’ అని ధోనీ మళ్లీ ప్రశ్నించాడు. పాపం ఆ రిపోర్టర్ ఏం చెప్పాలో తోచక అవునని సమాధానం చెప్పాల్సి వచ్చింది. ‘అంటే నీ ప్రశ్నకు నీవే సమాధానం చెప్పావు’అని ధోనీ నవ్వుతొ ఆ రిపోర్టర్‌తో అన్నాడు. ఒక భారతీయ జర్నలిస్టు ఈ ప్రశ్న అడగాలని తాను కోరుకున్నానని ధోనీ అంటూ అప్పుడు తాను అతడ్ని భారత్ తరఫున వికెట్ కీపర్‌గా ఆడగల కుమారుడు కానీ తమ్ముడు కానీ నీకు ఉన్నాడా అని అతడ్ని అడిగి ఉండే వాడినని అన్నాడు. అక్కడితో ఆ ఉదంతం ముగిసినప్పటికీ ధోనీ ఆ ప్రశ్నకు స్పందించిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది.
నోబాల్సే కొంపముంచాయి ..
ఓటమికి మంచు కూడా కారణమే..
ఇదిలావుంటే, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుబ్రా బౌల్ చేసిన రెండు నోబాల్స్, మంచు సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో తమ ఓటమికి ప్రధాన కారణాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయ పడ్డాడు. అజేయంగా 83 పరుగులు చేసి వెస్టిండీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన లెండిల్ సిమన్స్ రెండు సార్లు అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్నాడు. సిమన్స్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవిచంద్రన్ అశ్విన్ వేసిన నోబాల్ అతనికి లైఫ్ ఇస్తే 50 పరుగుల వద్ద బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టబోయిన పాండ్య బౌండర్ లైన్‌ను తాకడంతో మరోసారి అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. అరగంట ముందు మ్యాచ్ ప్రారంభం కావడం, టాస్ ఓడిపోవడం, ఆ తర్వాత వెస్టిండీస్ బ్యాట్ చేసేటప్పుడు విపరీతంగా మంచు కురవడంతో స్పిన్నర్లు ఆశించిన రీతిలో బౌలింగ్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా తమ ఓటమికి కారణాలని గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ధోనీ చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌కు, రెండో ఇన్నింగ్స్‌కు మధ్య పరిస్థితుల్లో చాలా తేడా ఉందని ధోనీ అన్నాడు. అందుకే ప్రధాన స్పిన్నర్ అశ్విన్ కేవలం రెండు ఓవర్లే బౌల్ చేయాల్సి వచ్చిందని, జడేజా తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు ఓవర్లు బౌల్ చేసినా పరుగులు ధారాళంగా ఇచ్చాడని ధోనీ చెప్పాడు. ముఖ్యంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లలో నోబాల్స్ బౌల్ చేయడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయ పడ్డాడు. కాగా, శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్‌గా అజిక్య రహానేను ఆడించాలన్న తన నిర్ణయాన్ని ధోనీ గట్టిగా సమర్థించుకుంటూ ధావన్ బాగానే బ్యాట్ చేసినప్పటికీ ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచుకోవడంలో విఫలమవుతూ వచ్చాడని, అందుకే రహానేని తీసుకోవలసి వచ్చిందన్నాడు. అన్ని సార్లూ అదృష్టమొక్కటే మ్యాచ్‌లు గెలవడానికి సరిపోదని, కెప్టెన్‌గా వ్యూహాన్ని చక్కగా అమలు చేసినప్పుడే మ్యాచ్‌లు గెలవగలుగుతామని ధోనీ అన్నాడు.
‘అవును.. అవే మ్యాచ్‌ని మార్చేసాయి’
కాగా, భారత బౌలర్లు బౌల్ చేసిన రెండు నోబాల్సే మ్యాచ్‌ని తమకు అనుకూలంగా మార్చి వేశాయని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎన్నికయిన లెండిల్ సిమన్స్ కూడా అభిప్రాయ పడ్డాడు. ‘నేను అవుటయి, కొత్త బ్యాట్‌మన్‌వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలుసు’ అని సిమన్స్ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. కాగా, కోల్‌కతాలో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్ విషయంలో మితిమీరిన విశ్వాసం పనికి రాదని సిమన్స్ అనిప్రాయ పడ్డాడు. కోల్‌కతాలో పరిస్థితులు ముంబయికన్నా భిన్నంగా ఉండవచ్చని, అంతేకాకుండా పిచ్ కూడా సెమీ ఫైనల్లో తాము ఆడిన పిచ్‌లాగా ఉండకపోవచ్చని అతను అభిప్రాయ పడ్డాడు.

చిత్రం ఆస్ట్రేలియా విలేఖరిని పోడియం పైకి పిలిచి మరీ క్లాస్ తీసుకుంటున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ