క్రీడాభూమి

దినేష్ ఆటతీరే వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: బంగ్లాదేశ్‌తో ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన నిదహాస్ టీ-20 ముక్కోణపు సిరీస్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా రాణించి టీమిండియా ఘనవిజయానికి బాటలు వేసిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో తమ జట్టులోని సభ్యులంతా ఆడిన ఆట ఒకటికాగా, ఒంటి చేతితో జట్టును గెలిపించే గొప్ప బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని ఆటతీరును కనబరచిన కార్తీక్ ఆట తీరే వేరని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే 28 పరుగులు చేసి చక్కని ఇన్నింగ్స్ ఆడినా, చివరి ఓవర్లలో పరుగులు అవసరమనుకున్న సమయంలో ఔట్ కావడంతో రంగంలోకి దిగిన కార్తీక్ తానున్నానంటూ భారాన్ని మోసి అప్పటివరకు ఉన్న ఉత్కంఠకు తెరలేపాడని అన్నాడు.
ఒక సీనియర్ క్రికెటర్‌గా జట్టు ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా తానునున్నానంటూ తన అనుభవాన్నంతా రంగరించి ఆదుకుంటున్న అతనిని అభినందనీయుడని రోహిత్ అన్నాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఎనిమిది బంతులు ఎదుర్కొని 29 పరుగులు (మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు) చేయడమే కాకుండా ఆఖరి ఓవర్‌లో దినేష్ చేసిన పరుగులు అద్భుతమని అన్నాడు.
ఆఖరి ఓవర్‌లో ఒక బంతి, ఐదు పరుగులు చేయాల్సి ఉండగా, అద్భుతమైన సిక్సర్‌తో మొత్తం ఆటనే మలుపుతిప్పాడని అన్నాడు. మ్యాచ్ చివర్లో ఎదురయ్యే ఉత్కంఠ నుండి ఉపశమనం కలిగించేందుకు అప్పుడప్పుడూ ఇలాంటి అంతర్జాతీయ క్రీడా వేదికలపై దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపిస్తూ జట్టును ఆదుకుంటున్నాడని ఆయన అన్నాడు. ‘దక్షిణాఫ్రికా తాము పర్యటించిన సమయంలో దినేష్‌కు ఆడేందుకు అనుకున్నంత సమయం దొరకలేదు. కానీ ఇప్పుడు శ్రీలంక టూర్‌లో అతనిపై తాము ఉంచిన అపార నమ్మకాన్ని నిలిపాడు’ అని కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ‘దినేష్ కార్తీక్‌కు తన ఆటతీరుపై నమ్మకం ఎక్కువ. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌లో ఏ స్థానంలో దిగినా అందుకు తగిన న్యాయం చేయగల దమ్మున్నవాడు’ అని ఆయన అన్నాడు. ఇలాంటి ఆటతీరును ప్రదర్శించే యువకులే తమ జట్టుకు కావాలని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దినేష్ కార్తీక్‌కు ముందుగానే పంపించకుండా ఏడో స్థానంలో బరిలోకి పంపడాన్ని ఆయన సమర్థించుకున్నాడు.
క్రికెట్‌లో దినేష్‌కు ఉన్న అపార అనుభవం, క్రీడా నైపుణ్యం సంపూర్ణంగా తెలిసినందునే అతనిని ఏడో స్థానంలో పంపడం ద్వారా ఫైనల్ ఓవర్లో అద్భుత ఫలితం అందుకున్నామని రోహిత్ అన్నాడు. ‘ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నావ్...ఇంకా మూడు ఓవర్లు ఉన్నాయి...ఈ ఆఖరి ఓవర్లలోనే ఆటకు ముగింపు పలుకు’ అని దినేష్ కార్తీక్‌కు నచ్చచెప్పడంతో అందుకు అంగీకరించిన అతను తమ నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టి నిదహాస్ కప్‌ను చేజిక్కించుకునేందుకు కారకుడయ్యాడని రోహిత్ అన్నాడు.
‘ ఆఖరి బంతిని చూడలేకపోయా’
బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన టీ-20 ఫైనల్స్‌లో ఒకే ఒక బంతి మిగిలివుండగా ఆ బంతినే సిక్సర్‌గా మలిచి, మ్యాచ్‌ను ఒక మలుపు తిప్పిన దినేష్ ఘనతను తాను స్వయంగా చూడలేకపోయానని కెప్టెన్ రోహిత శర్మ అన్నాడు. టీమిండియాకు ఓటమి ఖాయమని అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోతుండగా ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి సూపర్ ఓవర్‌ను అద్భుతంగా చేతుల్లోకి తీసుకున్న దినేష్ అద్భుత విజయాన్ని అందించాడన్నాడు. ఇంతవరకు ఇలాంటి మంచి గేమ్‌ను అతను ఆడి ఉండకపోవచ్చునని, కానీ తన పవర్ ఏమిటో నిరూపించి స్టేడియంకు వచ్చిన అశేష జనసమూహాన్ని అలరించాడని ప్రశంసల జల్లు కురిపించాడు. ఇదిలావుండగా, బంగ్లాదేశ్‌తో జరిగిన తుది పోరులో తమ జట్టులోని బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతంగా రాణించి ఎక్కువ వికెట్లు చేజిక్కించుకున్నారని అన్నాడు. నిదహాస్ టీ-20 సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ మాయచేసి తమ జట్టుకు ఎంతో దోహదపడ్డాడని ఆయన పేర్కొన్నాడు.
కొత్త బంతితో రాణించడం ఏ బౌలర్‌కైనా చాలా కష్టమని, కానీ సుందర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడని, ఇలాంటివారు తమ ప్రతిభతో చాలాకాలం పాటు జాతీయ జట్టులో నిలదొక్కుకోవాలని తాను అభిలషిస్తున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంక టూర్‌లో తాము ఆడిన టోర్నమెంట్ ఆద్యంతం తమకు కలసి వచ్చిందని, జట్టులోని దాదాపు ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమ్ గెలుపునకు శతవిధాల కృషి చేశారని పేర్కొన్నాడు. ఇదిలావుండగా, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న ఫాస్ట్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ పవర్ ప్లేలో బౌలింగ్ చేయడమంటే చాలెంజ్‌గా తీసుకోవాల్సి ఉంటుందని, కానీ దేశం కోసం ఆడుతున్న తనకు చాలెంజ్‌లను సవాల్‌గా తీసుకోవడం అలవాటేనని అన్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ వంటి అవార్డులో తనలాంటి యువతకు ఎంతో ఉత్సాహం, ప్రోత్సాహాన్ని ఇస్తాయని, భవిష్యత్తులో కూడా ఇదే ఆటతీరును కనబరచి జట్టుకు పేరుప్రఖ్యాతులు తీసుకువస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
రోహిత్ ఖాతాలో మరో రికార్డు
ఢిల్లీ: భారత్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ-20 క్రికెట్లో 7 వేలకు పైగా పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.
ఇప్పటివరకు సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ మాత్రమే టీ-20 క్రికెట్లో భారత్ తరపున ఏడు వేలకు పైగా పరుగులు సాధించారు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 42 బంతుల్లో 56 పరగులు చేశాడు. దీంతో అతడు ఏడు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల సరసన చేరాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 270 టీ-20 మ్యాచ్‌ల ద్వారా 7,030 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 275 మ్యాచ్‌ల ద్వారా 7,378 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 228 మ్యాచ్‌ల్లో 7,095 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ-రోహిత్ మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 65 పరుగులు మాత్రమే. ఓవరాల్‌గా చూస్తే ఏడు వేలకు పైగా పరుగులు చేసిన సాధించిన పదవ ఆటగాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ మొదటి మూడు సీజన్‌లలో రోహిత్ శర్మ దక్కన్ చార్జర్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2011 నుంచి ముంబయి ఇండియన్స్ తరపునే ఆడుతున్నాడు. 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

చిత్రం..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ