క్రీడాభూమి

చివరి బంతిలో సన్‌రైజర్స్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి ఫలితం తేలిందంటే, ఈ మ్యాచ్ ఏ స్థాయిలో హోరాహోరీగా సాగిందో ఊహించుకోవచ్చు. 148 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ చివరి బంతిలో ఛేదించడం విశేషం. చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌ని దీపక్ హూడా నిలబెట్టాడు.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి పరుగులు సాధించేందుకు నానా ఇబ్బందులు పడింది. స్లో వికెట్‌పై వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. ఎవిన్ లూయిస్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా ఆటగాళ్లు ఏ స్థాయిలో విఫలమయ్యారో ఊహించుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ చెరి 28 పరుగులు చేశారు. పకడ్బందిగా బంతులు వేసిన సన్‌రైజర్స్ తరఫున సందీప్ శర్మ, బిల్లీ స్టాన్‌లేక్, సిద్ధార్థ్ కౌల్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. 20 ఓవర్లలో 147 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్ ఆలౌట్ కాకుండా తప్పించున్నప్పటికీ, భారీ స్కోరు చేయడంలో మాత్రం విఫలమైంది.
హోం గ్రౌండ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడానికి 148 పరుగులు సాధించాల్సిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శిఖర్ ధావర్ మెరుగైన ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించిన తర్వాత సాహా వెనుదిరిగాడు. 20 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 22 పరుగులు చేసిన అతనిని మాయాంక్ మర్కాండే క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో 11 పరుగుల తర్వాత ధావన్ వికెట్ కూడా కూలింది. 28 బంతుల్లో, ఎనిమిది పోర్ల సాయంతో 45 పరుగులు చేసిన అతను కూడా మర్కాండే బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. అతని క్యాచ్‌ని జస్‌ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, ఆరు పరుగులకే, ముస్త్ఫాజుర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్‌కు చిక్కాడు. కాగా, హార్డ్ హిట్టర్ మనీష్ పాండే వికెట్‌ను మర్కాండే సాధించాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అతను రోహిత్ శర్మ చక్కటి క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ జట్టుకు అండగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్న తరుణంలోనే, మర్కాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్ 107 పరుగుల వద్ద ఐదో వికెట్ చేజార్చుకొని, కష్టాల్లో పడింది. జట్టును గెలిపించే సత్తావున్న యూసుఫ్ పఠాన్‌తో కలిసి దీపక్ హూడా స్కోరును ముందుకు దూకించాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో సన్‌రైజర్స్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్న తరుణంలోనే యూసుఫ్ పఠాన్ ఔటయ్యాడు. 14 పరుగులు చేసిన అతనిని కీలన్ పొలార్డ్ క్యాచ్ పట్టగా జస్‌ప్రీత్ బుమ్రా వెనక్కు పంపాడు. తర్వాతి బంతికే రషీద్ ఖాన్ కూడా పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ చక్కటి క్యాచ్ అందుకొని ఈ వికెట్‌లో తన పాత్ర పోషించాడు. మొత్తానికి చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచింది. ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ వేసిన ముస్త్ఫాజుర్ రహ్మాన్ తన నాలుగో బంతిలో సిద్ధార్థ్ కౌల్ (0) వికెట్ పడగొట్టాడు. చివరి బంతిలో సందీప్ శర్మ వికెట్ పడింది. చివరి ఓవర్ ప్రారంభమయ్యే సమయానికి సన్‌రైజర్స్ విజయానికి 11 పరుగుల దూరంలో నిలవగా, ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉంది. గెలిపించే బాధ్యత క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్న దీపక్ హూడాపైనే పడింది. అతను ఆ బాధ్యతను సమర్థంగా పూర్తి చేశాడు. చివరి బంతి వరకూ పోరాడిన అతను సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపించాడు. అప్పటికి అతను 32 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. బిల్లీ స్టాన్‌లేక్ ఐదు పరుగులతో అతనికి చక్కటి సహకారాన్నిచ్చి, సన్‌రైజర్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి ఇండియన్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 (ఎవిన్ లూయిస్ 29, సూర్యకుమార్ యాదవ్ 28, కీరన్ పొలార్డ్ 28, సందీప్ శర్మ 2/25, బిల్లీ స్టాన్‌లేక్ 2/42, సిద్ధార్థ్ కౌల్ 2/29).
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 (వృద్ధిమాన్ సాహా 22, శిఖర్ ధావన్ 45, షకీబ్ అల్ హసన్ 12, దీపక్ హూడా 32 నాటౌట్, యూసుఫ్ పఠాన్ 14, మాయాంక్ మర్కాండే 4/23, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 3/24, జస్‌ప్రీత్ బుమ్రా 2/32).