క్రీడాభూమి

డివిలియర్స్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 12: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ని 45 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఎబి డివిలియర్స్ కేవలం 42 బంతుల్లోనే 82 పరుగులు చేసి బెంగళూరు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 51 బంతులు ఎదుర్కొని 75 పరుగులు చేయడంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది. ఇది గౌరవ ప్రదమైన స్కోరేగానీ బెంగళూరు భారీ స్కోరు ముందు నిలవలేకపోయింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ భారీ మూల్యానే్న చెల్లించుకోవాల్సి వచ్చింది. కేవలం ఆరు పరుగుల వద్ద విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (1)ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన సన్‌రైజర్స్‌కు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్డ్ హిట్టర్ ఎబి డివిలియర్స్ చుక్కలు చూపించారు. వీరు ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా పరుగుల వరద పారించారు. 14.3 ఓవర్లలో రెండో వికెట్‌కు 157 పరుగులు జోడించి బెంగళూరును పటిష్టమైన స్థితిలో నిలిపారు. 51 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులు సాధించిన కోహ్లీని భువీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత డివిలియర్స్ వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నాన్ని కొనసాగించాడు. ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ క్యాచ్ పట్టగా అవుటైన అతను కేవలం 42 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. డివిలియర్స్‌ను అవుట్ చేసిన తర్వాతి బంతికే షేన్ వాట్సన్ (19)ను వికెట్‌కీపర్ ప్రజ్ఞాన్ ఓఝా క్యాచ్ అందుకోగా ముస్త్ఫాజుర్ పెవిలియన్‌కు పంపాడు. చివరిలో సర్ఫ్‌రాజ్ ఖాన్, కేదార్ జాధవ్ కూడా దూడుకుడుగా ఆడారు. 18 ఏళ్ల సర్ఫ్‌రాజ్ 10 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 35, జాధవ్ 6 బంతుల్లో 8 చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ముస్త్ఫాజుర్, భువనేశ్వర్ కుమార్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
బెంగళూరును ఓడించడానికి 228 పరుగులు సాధించాల్సిన సన్‌రైజర్స్ 35 పరుగుల స్కోరువద్ద శిఖర్ ధావన్ వికెట్‌ను కోల్పోయింది. అతను ఎనిమిది పరుగులు చేసి పర్వేజ్ రసూల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చెలరేగిపోయిన డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మోజెస్ హెన్రిక్స్‌తో కలిసి రెండో వికెట్‌కు అతను 5.3 ఓవర్లలో 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. కేవలం 25 బంతులు ఎదుర్కొన్న వార్నర్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 58 పరుగులు సాధించి, షేన్ వాట్సన్ బౌలింగ్‌లో ఆడం మిల్నే క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. మొదటి ఓవర్‌లో 19 పరుగుల సమర్పించుకున్న యజువేంద్ర చాహెల్‌కు మరో ఓవర్‌ను ఇచ్చి కెప్టెన్ కోహ్లీ చేసిన ప్రయోగం ఫలించింది. నమన్ ఓఝా (0)ను అతను డివిలియర్స్ క్యాచ్ పట్టగా అవుట్ చేశాడు. అంతకు ముందు ఓవర్‌లో ఒక వికెట్ కూల్చిన వాట్సన్‌ను తప్పించి ఆడం మిల్నేను బౌలింగ్‌కు దించి కోహ్లీ మరో ప్రయోగం చేశాడు. అది కూడా సఫలమైంది. క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న మోజెస్ హెన్రిక్స్ (19)ను పర్వేజ్ రసూల్ క్యాచ్ పట్టగా మిల్నే అవుట్ చేశాడు. దీపక్ హూడా, ఇయాన్ మోర్గాన్ క్రీజ్‌లో ఉండగా, 11.1 ఓవర్లలో సన్‌రైజర్స్ వంద పరుగుల మైలురాయిని చేరింది. మరో రెండు బంతులకే హూడా అవుటయ్యాడు. అతను ఆరు పరుగులు చేసి యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు దొరికిపోయాడు. 18 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసిన ఆశిష్ రెడ్డిని షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇయాన్ మోర్గాన్ (నాటౌట్ 22), కర్న్ శర్మ (నాటౌట్ 26) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడినప్పటికీ, జట్టును లక్ష్యానికి చేర్చలేకపోయారు.

ఐపిఎల్‌లో బెంగళూరుకు ఇది మూడో అత్యధిక స్కోరు. 2013 ఏప్రిల్ 23న పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు సాధించింది. ఐపిఎల్‌లో రికార్డు కూడా ఇదే. గత ఏడాది మే 10న ముంబయి ఇండియన్స్‌పై ఒక వికెట్ నష్టపోయి 235 పరుగులు సాధించిన బెంగళూరు మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లకు 227 పరుగులు సాధించింది. గతత ఏడాది మే 6న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై బెంగళూరు మూడు వికెట్లకు 226 పరుగులు చేసింది. ఇప్పుడు 227 పరుగులు చేయడంతో ఆ స్కోరు నాలుగో స్థానానికి పడిపోగా, తాజా స్కోరు మూడో స్థానాన్ని ఆక్రమించింది.

స్కోరుబోర్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: క్రిస్ గేల్ బి భువనేశ్వర్ కుమార్ 1, విరాట్ కోహ్లీ బి భువనేశ్వర్ కుమార్ 75, ఎబి డివిలియర్స్ సి ఇయాన్ మోర్గాన్ బి ముస్త్ఫాజుర్ రహ్మాన్ 82, షేన్ వాట్సన్ సి ప్రజ్ఞాన్ ఓఝా బి ముస్త్ఫాజర్ రహ్మాన్ 19, సర్ఫ్‌రాజ్ ఖాన్ 35 నాటౌట్, కేదార్ జాధవ్ 8 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 227.
వికెట్ల పతనం: 1-6, 2-163, 3-183, 4-183.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 2.1-0-21-0, భువనేశ్వర్ కుమార్ 4-0-55-2, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 4-0-26-2, మోజెస్ హెన్రిక్స్ 4-0-41-0, కర్న్ శర్మ 4-0-57-0, ఆశిష్ రెడ్డి 1.5-0-25-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ బి పర్వేజ్ రసూల్ 8, డేవిడ్ వార్నర్ సి మిల్నే బి షేన్ వాట్సన్ 58, మోజెస్ హెన్రిక్స్ సి పర్వేజ్ రసూల్ బి మిల్నే 19, నమన్ ఓఝా సి ఎబి డివిలియర్స్ బి యజువేంద్ర చాహల్ 0, దీపక్ హూడా సి డివిలియర్స్ బి యజువేంద్ర చాహల్ 6, ఆశిష్ రెడ్డి బి షేన్ వాట్సన్ 32, ఇయాన్ మోర్గాన్ 22 నాటౌట్, కర్న్ శర్మ 26 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1-35, 2-86, 3-88, 4-93, 5-101, 6-147.
బౌలింగ్: షేన్ వాట్సన్ 4-0-30-2, ఆడం మిల్నే 4-0-43-1, హర్షల్ పటేల్ 4-0-33-0, పర్వేజ్ రసూల్ 4-0-31-1, యజువేంద్ర చాహల్ 4-0-43-2.