క్రీడాభూమి

నాటి నుంచి నేటి వరకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** క్రీడాభిమానులను అలరించే వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఈనెల 14 నుంచి రష్యాలో మొదలుకానుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీక్షించే ఫిఫా వరల్డ్ కప్‌ను క్రీడా రంగంలోనే అతిపెద్ద టోర్నీల్లో ఒకటిగా పేర్కొంటారు. ఒలింపిక్స్‌తర్వాత అంతటి ఆదరణ ఉన్న ఏకైక క్రీడా ఈవెంట్‌గా కూడా వరల్డ్ కప్ సాకర్ గుర్తింపు సంపాదించింది. ఇంతటి ఆదరణ పొందిన ఈ మెగా టోర్నమెంట్ 1930లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 20 పర్యాయాలు వరల్డ్ కప్ పోటీలు జరిగాయ. 21వ సాకర్ ప్రపంచ కప్‌కు రష్యా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, వరల్డ్ కప్ ప్రస్థానం, విజేతల గురించి ఒకసారి తెలుసుకోవాలంటే, ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకోకతప్పదు.
--------------------------------

1930: ఉరుగ్వేలో ప్రారంభమైన ఫిఫా సాకర్ వరల్డ్‌కప్‌లో 13 జట్లు పాల్గొంటే, వాటికే కేవలం నాలుగే ఐరోపా జట్లు ఉన్నాయి. అప్పట్లో కొత్తగా నిర్మించిన ఎస్టాడియో సెంటెనారియో స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఉరుగ్వే తన పొరుగు దేశమైన అర్జెంటీనాను 4-2 గోల్స్ తేడాతో ఓడించి, తొలి విశ్వవిజేతగా అవతరించింది. అర్జెంటీనా ఆటగాడు గులెర్మొ స్టాబిల్ నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది గోల్స్ చేసి, సక్సెస్‌ఫుల్ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ‘గోల్డెన్ షూ’ సంపాదించుకున్నాడు.
1934: రెండో వరల్డ్‌కప్ పోటీలకు ఇటలీ ఆతిథ్యమిచ్చింది. తొలి ప్రపంచకప్‌లో మాదిరిగానే ఈసారి కూడా ఆతిథ్య దేశమే ఫైనల్ చేరింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో చెకొస్లొవేకియాను 2-1 గోల్స్ తేడాతో ఓడించిన ఇటలీ టైటిల్‌ను గెల్చుకుంది. ఆ జట్టుకే చెందిన ఏంజెలొ చియావియో, చెక్ ఆటగాడు ఓల్డ్‌రిచ్ నెజెడ్లీ, జర్మనీకి చెందిన ఎడ్మండ్ కొనెన్ తలా నాలుగు గోల్స్ సాధించారు. ‘గోల్డెన్ షూ’కు ఓల్డ్‌రిచ్ నెజడ్లీ ఎంపికయ్యాడు.
1938: ఆతిథ్య దేశమే ఫైనల్‌లో టైటిల్ అందుకుంటుందన్న సంప్రదాయానికి మూడో వరల్డ్‌కప్‌లో తెరపడింది. ఆ పోటీలకు ఫ్రాన్స్ ఆతిథ్యమిచ్చినా ఫైనల్ చేరలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ 4-2 ఆధిక్యంతో హంగరీపై గెలుపొంది, ట్రోఫీని నిలబెట్టుకుంది. నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది గోల్స్ చేసిన లియోనిడాస్ డ సిల్వకు ‘గోల్డెన్ షూ’ లభించింది.
1950: రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వరల్డ్ కప్ పోటీలు జరగలేదు. నాలుగో ప్రపంచకప్ పోటీలు బ్రెజిల్‌లో జరిగాయి. ఫైనల్‌లో ఉరుగ్వే 2-1 ఆధిక్యంతో గెలిచి, రెండోసారి ట్రోఫీని అందుకుంది. ఆరు మ్యాచ్‌లు ఆడి, 7 గోల్స్ చేసిన బ్రెజిల్ ఆటగాడు మాక్వెస్ అడెమిర్ ‘గోల్డెన్ షూ’ను చేజిక్కించుకున్నాడు.
1954: స్విట్జర్లాండ్‌లో జరిగిన ఐదో వరల్డ్‌కప్‌లో జర్మనీ తొలిసారి టైటిల్ అందుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు 3-2 ఆధిక్యంతో హంగరీని ఓడించింది. అయితే, హంగరీ ఆటగాడు సాండర్ కొసిస్ ఐదు మ్యాచ్‌లలో ఏకంగా 11 గోల్స్ సాధించి, ‘గోల్డెన్ షూ’ సంపాదించి అభిమానులను ఆనందపరిచాడు.
1958: స్వీడన్‌లో జరిగిన ఆరో ప్రపంచకప్ సాకర్‌ను బ్రెజిల్ కైవసం చేసుకుంది. ఆతిథ్య దేశం స్వీడన్‌ను ఫైనల్‌లో 5-2 గోల్స్ తేడాతో బ్రెజిల్ చిత్తుచేసింది. ఫ్రాన్స్ టైటిల్ సాధించలేకపోయినా, ఆ జట్టు ఆటగాడు జస్ట్ ఫాంటెన్ ఆరు మ్యాచ్‌లలో 13 గోల్స్ చేసి సంచలనం సృష్టించాడు. ఒక వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటికీ ఇదే అత్యధిక గోల్స్ రికార్డు. అసాధారణ ప్రతిభ కనబరచిన ఫాంటెన్ ‘గోల్డెన్ షూ’ స్వీకరించాడు.
1962: చిలీలో ఏడో వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్ జరగ్గా, ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ 3-1 తేడాతో చెకొస్లొవేకియాను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ కొల్లగొట్టింది. యుగస్లేవియా ఆటగాడు డ్రాజెన్ జెర్కొవిచ్ ఆరు మ్యాచ్‌లలో ఐదు గోల్స్ సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అతనితోపాటు ఉత్తమ ఆటతో రాణించిన ఫ్లొరియన్ అల్బెర్ట్ (హంగరీ), వాలెంటిన్ ఇవానొవ్ (సోవియట్ యూనియన్), లియోనెల్ సాంచెస్ (చిలీ), వావా (బ్రెజిల్), గారిన్చా (బ్రెజిల్)లకు సంయుక్తంగా ‘గోల్డెన్ షూ’ను ప్రకటించారు. ఉత్తమ యువ ఆటగాడి అవార్డు ఫ్లొరియన్ అల్బెర్ట్‌కు లభించింది.
1966: స్వదేశంలో జరిగిన ఎనిమిదో ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌ను ఇంగ్లాండ్ గెల్చుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు జర్మనీని 4-2 గోల్స్ తేడాతో ఓడించింది. టాప్ స్కోరర్‌గా నిలిచిన పోర్చుగల్ ఆటగాడు ఫెరీరా ఇసెబియో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్‌ను తన ఖాతాలో జమ చేసుకొని ‘గోల్డెన్ షూ’ను తీసుకెళ్లాడు. జర్మనీ ఆటగాడు ఫ్రెన్జ్ బెకన్‌బార్‌కు ఉత్తమ యువ ఆటగాడి అవార్డు దక్కింది.
1970: తొమ్మిదో వరల్డ్‌కప్ పోటీలు మెక్సికోలో జరిగాయి. ఫైనల్‌లో ఇటలీని 4-1 ఆధిక్యంతో చిత్తుచేసిన బ్రెజిల్ ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. జర్మనీ స్టార్ గెర్డ్ ముల్లర్ ఆరు మ్యాచ్‌లలో 10 గోల్స్ చేసి, ‘గోల్డెన్ షూ’ తన వెంట తీసుకెళ్లాడు. ఉత్తమ యువ ఆటగాడి అవార్డు తియోఫిలొ క్యూబిలార్ (పెరూ) స్వీకరించాడు.
1974: పదో వరల్డ్‌కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన జర్మనీకే టైటిల్ లభించింది. ఫైనల్‌లో ఈ జట్టు 2-1 ఆధిక్యంతో హాలెండ్‌పై గెలిచింది. పోలాండ్ ఆటగాడు జెగొర్జ్ లాటో ఏడు మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్ చేసి, ‘గోల్డెన్ షూ’ సంపాదించుకున్నాడు. అదే దేశానికి చెందిన వ్లాడిస్లా జుడాకు ఉత్తమ యువ ఆటగాడి అవార్డు లభించింది.
1978: పదకొండవ వరల్డ్ కప్‌లో చరిత్ర పునరావృతమైంది. ఈ పోటీలను నిర్వహించిన అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఫైనల్‌లో హాలెండ్‌ను 3-1 గోల్స్ తేడాతో ఓడించిన అర్జెంటీనా తరఫున మరియో కెంప్స్ ఏడు మ్యాచ్‌లలో ఆరు గోల్స్ చేసి ‘గోల్డెన్ షూ’ దక్కించుకున్నాడు. ఉత్తమ యువ ఆటగాడిగా ఆంటానియో కాబ్రినీ (ఇటలీ) ఎంపికయ్యాడు.
1982: పనె్నండవ వరల్డ్‌కప్ పోటీలకు స్పెయిన్ కేంద్రమైంది. ఇటలీ 3-1 గోల్స్ ఆధిక్యంతో జర్మనీని ఓడించి మూడోసారి టైటిల్ అందుకొని బ్రెజిల్‌కు సమవుజ్జీగా నిలిచింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో పెనాల్షీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ధారించాల్సి వచ్చింది. ఇటలీ ఆటగాడు పాలొ రోసీ ఏడు మ్యాచ్‌లలో ఆరు గోల్స్ చేసి ‘గోల్డెన్ షూ’ దక్కించుకున్నాడు. అదే ఏడాది ప్రవేశపెట్టిన అడిడాస్ గోల్డెన్ బాల్ కూడా అతనికే లభించింది. ఉత్తమ యువ ఆటగాడిగా మాన్యుయెల్ అమోరొస్ (ఫ్రాన్స్) ఎంపికయ్యాడు. కాగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డును బ్రెజిల్ స్వీకరించింది.
1986: సాకర్ చరిత్రలోనే 13వ ప్రపంచకప్ చాంపియన్‌షిప్ పోటీలకు ఒక విశిష్ట స్థానం ఉంది. మెక్సికో ఆతిథ్య దేశంగా వ్యవహరించిన ఈ టోర్నీలో అర్జెంటీనా ‘సాకర్ మాంత్రికుడు’ డిగో మారడోనా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతని కారణంగానే అర్జెంటీనా ఫైనల్ చేరింది. అయితే, ఫైనల్ కంటే, ఇంగ్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది. ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా అభివర్ణించే గోల్ మారడోనా చేశాడు. అతని చేతికి తగిలిన బంతి గోల్ పోస్టులోకి దూసుకెళ్లి, ఇంగ్లాండ్ ఓటమికి కారణమైంది. అదే విధంగా సాకర్ చరిత్రలో ‘డ్రిబిల్ ఆఫ్ జీనియస్’గా ప్రసిద్ధి పొందిన ఆట కూడా మారడోనాదే కావడం విశేషం. అంతా తానై అర్జెంటీనాను అతను ఫైనల్ చేర్చాడు. ఫైనల్‌లో 3-2 తేడాతో జర్మనీపై నెగ్గిన అర్జెంటీనా టైటిల్‌ను అందుకుంది. ఇంగ్లాండ్ ‘లెజెండరీ’ ఆటగాడు గారీ లీనేకర్ ఐదు మ్యాచ్‌లలో ఆరు గోల్స్ చేసి ‘గోల్డెన్ షూ’ సాధించాడు. గోల్డెన్ బాల్ మారడోనాకు లభించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఎన్జొ సిఫొ (బెల్జియం) ఎంపికయ్యాడు. ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు మరోసారి బ్రెజిల్‌కు దక్కింది.
1990: ఇటలీలో 14వ వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్ జరిగింది. పేలవంగా ముగిసిన ఫైనల్‌లో జర్మనీ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలుపొంది టైటిల్ సాధించింది. ఇటలీ ఆటగాడు సాల్వటోర్ స్కిలాచీ ఏడు మ్యాచ్‌లలో ఆరు గోల్స్‌తో ‘గోల్డెన్ షూ’ అందుకున్నాడు. అసాధారణ ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన అతనికే అడిడాస్ గోల్డెన్ బాల్ కూడా లభించింది. ఉత్తమ యువ ఆటగాడిగా రాబర్ట్ ప్రొసినెస్కీ (క్రొయేషియా) ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌కు ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు లభించింది.
1994: అమెరికా 15వ ప్రపంచకప్ పోటీలకు వేదికైంది. 1970 తర్వాత బ్రెజిల్ మళ్లీ విశ్వవిజేతగా ఎదిగింది. ఫైనల్‌లో ఈ జట్టు 3-2 తేడాతో ఇటలీని ఓడించింది. రష్యా ఆటగాడు ఒలెగ్ సాలెన్కొ మూడు మ్యాచ్‌లలో ఆరు, బల్గేరియాకు చెందిన రిస్టో స్టొచ్‌కొవ్ ఏడు మ్యాచ్‌లలో ఆరు చొప్పున గోల్స్ చేశారు. వీరిద్దరికీ సంయుక్తంగా ‘గోల్డెన్ షూ’ను బహూకరించారు. అడిడాస్ గోల్డెన్ బాల్‌కు రొమారియోగా ప్రసిద్ధుడైన బ్రెజిల్ ఆటగాడు రొమారియో డి సౌజా ఫరీయా ఎంపికయ్యాడు. ఉత్తమ యువ ఆటగాడి అవార్డు మార్క్ ఓవర్‌మార్స్ (నెదర్లాండ్స్)కు లభించింది. ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డుతోపాటు, కొత్తగా ప్రవేశపెట్టిన మోస్ట్ ఎంటర్‌టైనింగ్ టీంగా కూడా బ్రెజిల్ సత్తా చాటింది. అదే విధంగా ఈ పోటీల్లో ప్రవేశపెట్టిన ఉత్తమ గోల్‌కీపర్ అవార్డును మైకెల్ ప్రెడొమ్ (బెల్జియం) గెల్చుకున్నాడు.
1998: సొంతగడ్డపై జరిగిన 16వ వరల్డ్‌కప్ ట్రోఫీని ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌ను 3-0 తేడాతో ఓడించింది. క్రొయేషియా ఆటగాడు డెవర్ సకెర్ ఏడు మ్యాచ్‌లలో ఆరు గోల్స్ చేసి ‘గోల్డెన్ షూ’ను సంపాదించాడు. అడిడాస్ గోల్డెన్ బాల్ బ్రెజిల్ ఆటగాడు రొనాల్డొకు లభించింది. ఉత్తమ గోల్‌కీపర్‌గా ఫాబియన్ బార్టెజ్ (ఫ్రాన్స్), ఉత్తమ యువ ఆటగాడిగా మైకెల్ ఒవెన్ (ఇంగ్లాండ్) ఎంపికయ్యారు. ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డుతోపాటు, మోస్ట్ ఎంటర్‌టైనింగ్ టీంగా కూడా ఫ్రాన్స్ అవార్డును అందుకుంది.
2002: ఆసియా ఖండంలోకి ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌షిప్ మొదటిసారిగా అడుగుపెట్టింది. జపాన్, కొరియా దేశాలు సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్ 17వ పోటీలకు ఆతిథ్యమిచ్చాయి. బ్రెజిల్ ఐదోసారి టైటిల్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో జర్మినీతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ చేసిన రెండు గోల్స్ రొనాల్డో సాధించినవే కావడం విశేషం. 2-0 తేడాతో విజయం సాధించిన బ్రెజిల్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన రొనాల్డ్ ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గోల్స్ చేశాడు. ‘గోల్డెన్ షూ’ అందుకున్నాడు. గోల్డెన్ బాల్ జర్మనీకి చెందిన ఆలివర్ కాన్‌ను లభించింది. ఉత్తమ గోల్‌కీపర్‌గా కూడా అతనే అవార్డు స్వీకరించాడు. ఫెయిర్ ప్లే అవార్డు బెల్జియం సొంతం చేసుకోగా, మోస్ట్ ఎంటెర్‌టైనింగ్ టీంగా దక్షిణ కొరియా ఎంపికైంది.
2006: జర్మనీలో జరిగిన 18వ ప్రపంచకప్ టైటిల్ ఇటలీ దక్కించుకుంది. నిర్ణీత సమయంలో ఫ్రాన్స్, ఇటలీ జట్లు చెరి ఒక గోల్ మాత్రమే చేయలిగాయి. మ్యాచ్‌లో ఫలితం తేల్చడానికి ‘పెనాల్టీ’ తప్పలేదు. ఇందులో ఇటలీ ఐదు గోల్స్ చేయగా, ఫ్రాన్స్ మూడు గోల్స్‌కే పరిమితమైంది. జర్మనీ ఆటగాడు మిరొస్లావ్ కోస్ ఏడు మ్యాచ్‌లలో ఐదు గోల్స్ చేసి ‘గోల్డెన్ షూ’ సాధించాడు. జినెదిన్ జిదానె (ఫ్రాన్స్)కు గోల్డెన్ బాల్ లభించింది. బెస్ట్ గోల్‌కీపర్‌గా గియానుగి బఫాన్ (ఇటలీ) ఎంపికయ్యాడు. ఫెయిర్ ప్లే అవార్డు బ్రెజిల్‌కు లభించగా, మోస్ట్ ఎంటర్‌టైనింగ్ టీంగా పోర్చుగల్ అవార్డును స్వీకరించింది.
2010: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 19వ వరల్డ్ కప్ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి స్పెయన్ విజేతగా నిలిచింది. ఇరు జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో మ్యాచ్ నిరాసక్తంగా మారింది. దాడులు, ప్రతిదాడులు లేకుండా చప్పగా సాగడంతో ప్రేక్షకులు విసుగుచెందారు. ఈ జట్లు అనుసరించిన డిఫెన్స్ కారణంగా, మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీనితో ఎక్‌స్ట్రాటైమ్ అనివార్యమైంది. ఈ అవకాశాన్ని ఇనిస్టా సద్వినియోగం చేసుకొని, స్పెయన్‌కు గోల్ అందించాడు. నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఎక్‌స్ట్రాటైమ్ లోనూ గోల్ సాధించలేకోవడంతో, ఆ జట్టు రన్నరప్ ట్రోఫీకి పరి మితమైంది.
2014: నాలుగేళ్ల క్రితం, జర్మనీ టైటిల్ సాధించిన వరల్డ్ కప్‌కు బ్రెజిల్ ఆతిథ్యమిచ్చింది. 2010లో మాదిరిగానే, 20వ ప్రపంచ కప్ ఫైనల్ కూడా నీరసంగా కొనసాగింది. జర్మనీ, అర్జెంటీనా జట్లు డిఫెన్స్‌కు పరిమితమై, ఒక్క గోల్‌ను కూడా చేయలేకపోయాయ. నిర్ణీత సమయం తర్వాత, ఇంజురీ టైమ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది. దీనితో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి ఎక్‌స్ట్రాటైమ్‌ను ప్రకటించారు. జర్మనీ ఆటగాడు మారియో గొజే చేసిన గోల్‌తో జర్మనీ గట్టెక్కగా, అర్జెంటీనా ద్వితీయ స్థానంతో సంతృప్తి చెందింది. టైటిల్ పేవరిట్‌గా బరిలోకి దిగినప్పటికీ, ఆశించిన స్థాయలో రాణించలేకపోయన బ్రెజిల్ మూడో స్థానం కోసం నెద్లాండ్స్‌ను ఢీ కొంది. కానీ, ఆ మ్యాచ్‌ని 0-3 తేడాతో చేజార్చుకొని, నాలుగో స్థానంలో నిలిచింది.