క్రీడాభూమి

వరల్డ్ కప్‌లో తొలిసారి ‘వార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజాన్: ఫిఫా సాకర్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (వార్) విధానం మొదటిసారిగా అమలు చేశారు. శనివారం ఫ్రాన్స్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీని నిర్ధారించేందుకు ఆటగాళ్లు చేసిన అప్పీల్‌ను రిఫరీ స్వీకరించడంతో, ‘వార్’ తొలిసారి వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేసింది. గ్రూప్ ‘సీ’లో జరిగిన ఈ మ్యాచ్ ద్వితీయార్ధంలో ఫ్రెంచ్ ఆటగాడు ఆంటోనీ గ్రీజ్మన్ పెనాల్టీ బాక్స్ వరకూ బంతిని తీసుకెళ్లాడు. అక్కడ ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడి అతనిని కిందపడేశారు. అయితే, ఫ్రాన్స్‌కు స్పాట్ కిక్‌ను ఇవ్వడానికి రిఫరీ అంగీకరించలేదు. దీనితో ఫ్రెంచ్ ఆటగాళ్ల డిమాండ్ మేరకు ‘వార్’ విధానంలో అధికారులు రివ్యూ చేశారు. గ్రీజ్మన్‌కు పెనాల్టీని ఇవ్వడంతో, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. కాగా, తొలిసారి వరల్డ్ కప్‌లో ‘వార్’ అడుగుపెట్టిన నేపథ్యంలో, సహజంగా దీనిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నది. క్రికెట్‌లో అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్‌ఎస్) మాదిరిగానే ఫుట్‌బాల్‌లో ‘వార్’ రిఫరీల నిర్ణయాలను పునఃసమీక్షనుంది. నిజానికి ఇది హఠాత్తుగా తెరపైకి వచ్చిన విధానం కాదు. ఫిఫా చాలాకాలంగా కసరత్తు చేస్తునే ఉంది. 2016 నుంచే 20 సమాఖ్యలు ఈ విధానాన్ని ఆమోదించి, అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఫిఫా కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘమైన చర్చల అనంతరం వరల్డ్ కప్‌లో ‘వార్’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జర్మనీ, బుండెస్లిగా, ఇటలీసహా వివిధ దేశాలకు చెందిన ఫుట్‌బాల్ సమాఖ్యలు రెండేళ్ల నుంచే వివిధ స్థాయి టోర్నీలో ‘వార్’ను అమలు చేస్తున్నారు. సుమారు 1,000 మ్యాచ్‌ల్లో ఈ విధానంలోనే జరిగాయి. కాగా, వరల్డ్ కప్‌లో జరిగే అన్ని మ్యాచ్‌ల్లోనూ ‘వార్’ అమల్లో ఉంటుంది. యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య ‘యూఫా’ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఫిఫా వరల్డ్ కప్‌లో ఒకసారి ‘వార్’ను అమలు చేస్తే, ఆతర్వాత అన్ని స్థాయిల్లోనూ వర్తింప చేస్తారన్నది నిజం. మొత్తం మీద ఎంతో ఆసక్తిని రేపుతున్న ‘వార్’ వరల్డ్ కప్‌లో అడుగుపెట్టడంతో, ఈ టోర్నీలో భారీ మార్పుకు శ్రీకారం చుట్టినట్టయింది.
వాస్తవానికి, ‘వార్’ అనేది మ్యాచ్ రిఫరీ మాదిరిగా ఒకరి పర్యవేక్షణ కింద ఉండదు. ముగ్గురు వీడియో అసిస్టెంట్ రిఫరీలతో కూడిన ‘వార్’ బృందం వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఆడే అన్ని జట్లకూ సహకరిస్తుంది. ఈ ముగ్గురూ ఫిఫా మ్యాచ్ అధికారుల జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నవారే అయివుంటారు. మొత్తం 13 మంది పేరుప్రఖ్యాతులు ఆర్జించిన రిఫరీలను వరల్డ్ కప్ కోసం ఫిఫా ప్రత్యేకంగా ఎంపిక చేసి, వీడియో అసిస్టెంట్ రిఫరీలుగా నియమించింది. ‘వార్’ బృందానికి ఈ టోర్నమెంట్ ప్రసారానికి ఉపయోగించే మొత్తం 33 కెమేరాలతోనూ తమ మానీటర్‌కు అనుసంధానం చేసుకునే వీలుంది. వీటిలో ఎనిమిది అత్యంత నిదానమైన, సూపర్ స్లో మోషన్ కెమెరాలుకాగా, నాలుగు అల్ట్రా స్లో మోషన్ కెమెరాలు. వీటితోపాటు రెండు వెలుపలి కెమెరాల ద్వారా రీప్లేలను చూసే అవకాశం ‘వార్’ బృందానికి ఉంటుంది. టోర్నమెంట్ గ్రూప్ దశ ముగించుకొని, నాకౌట్ దశకు చేరుకున్న వెంటనే అధికారులు మరో రెండు అల్ట్రా స్లో కెమెరాలను మైదానంలోని రెండు గోల్ పోస్టుల వెనుక అమరుస్తారు.
నిర్ణయాలు తీసుకోదు..
మైదానంలో రిఫరీ తీసుకునే నిర్ణయాలను ఇరు జట్లలో ఏదైనా జట్టు సవాలు చేసినప్పుడు మాత్రమే ‘వార్’ అన్ని కోణాల్లోనూ రీప్లేలను పరిశీలిస్తుంది. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. క్షణాల్లో జరిగిపోయే సంఘటనలు లేదా గోల్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్కోసారి రిఫరీలు పొరపాటు చేయవచ్చనే వాదన చాలాకాలంగా ఉంది. అందుకే ‘వార్’ బృందం వివిధ కోణాల్లో, అత్యంత నిదానంగా కదిలే దృశ్యాలను పరిశీలిస్తుంది. అయితే, నేరుగా నిర్ణయాలను తీసుకోదు. ప్రకటించదు. ఈ బృందం తన అభిప్రాయాన్ని రిఫరీకి తెలియచేస్తుంది. తుది నిర్ణయం మాత్రం ఫీల్డ్ రిఫరీదే. అత్యంత కీలక సమయాల్లోనూ ‘వార్’ బృందం రిఫరీకి అందుబాటులో ఉండి, అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఫ్రెంచ్ ఆటగాళ్ల అప్పీల్‌లోనూ ఇదే విధానాన్ని అమలు చేశారు. ‘వార్’ సూచన మేరకే గ్రీజ్మన్‌కు రిఫరీ పెనాల్టీని ప్రకటించాడు. మొత్తం మీద, గోల్స్‌పై అనుమానాలు లేదా గోల్స్ చేసే నమోదు కావడానికి ముందు చోటు చేసుకున్న వివాదాలను ‘వార్’ పరిశీలిస్తుంది. అదే విధంగా పెనాల్టీ నిర్ణయాలు, లేదా పెనాల్టీ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు మైదానంలో జరిగిన సంఘటనలను అల్ట్రా స్లో మోషన్‌లో వీక్షిస్తుంది. ఎవరైనా ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డు చూపినప్పుడు తలెత్తే వివాదాలకు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేస్తుంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ రిఫరీకి మార్గదర్శకం చేస్తుంది. రిఫరీ రివ్యూ ఏరియా (ఆర్‌ఆర్‌ఏ) ద్వారా రిఫరీ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. మాస్కోలోని అంతర్జాతీయ ప్రసార కేంద్రం (ఐబీసీ)లోని కేంద్రంలో ‘వార్’ బృందం తన విధులను నిర్వర్తిస్తుంది. అంతేగాక, ప్రసార మాధ్యమాలు, కామెంటేటర్లకు అవసరమైన సమాచారాన్ని కూడా ‘వార్’ అందిస్తుంది. రివ్యూ విధానంపై అవగాహన కల్పిస్తుంది. ఒక వివాదంపై ప్రేక్షకులకు కూడా పూర్తిస్థాయి వివరణ ఇవ్వడానికి అవసరమైన సమాచారాన్ని కామెంటేటర్లకు ఇస్తుంది. మొదటిసారి వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన ‘వార్’ విధానం సఫలమైతే, ఫుట్‌బాల్ క్రీడలో ఇది ఒక భాగమైపోతుంది.