క్రీడాభూమి

రోహిత్, రాయుడు శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 29: ముంబయి బ్రబోర్న్ స్టేడియం సోమవారం నాటి భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన నాలుగో వనే్డలో పరుగుల వానతో తడిసి ముద్దయింది. టీమిండియా 224 పరుగుల భారీ ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 377 పరుగులు చేయగా, వెస్టిండీస్ 36.2 ఓవర్లలో కేవలం 153 పరుగులు చేసింది. గౌహతిలో జరిగిన తొలి వనే్డలో భారత్‌కు తొలి విజయం దక్కగా, విశాఖపట్టణంలో జరిగిన రెండో వనే్డ టైగా ముగిసింది. పుణేలో జరిగిన మూడో వనే్డలో కరేబియన్లు పైచేయి సాధించగా, ముంబయిలో జరిగిన నాలుగో వనే్డలో గెలుపుతో కోహ్లీ సేన ప్రత్యర్థిపై 2-1 తేడాతో నిలిచింది.
ఇదిలావుండగా, తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ విఫలమైనా రోహిత్ శర్మ, అంబటి రాయుడు అద్భుత ఆటతీరుతో జట్టును విజయపథాన నిలిపారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ సిక్సర్లు, బౌండరీల వరద పారించారు. శిఖర్ ధావన్ 40 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లు, మరో 2 బౌండరీలతో 38 పరుగులు చేసి కీమ్ ఓ పాల్ బౌలింగ్‌లో కె.పవెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 17 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ 2 బౌండరీలతో 16 పరుగులు చేసి రోచ్ బౌలింగ్‌లో షాల్ హోప్‌కు క్యాచ్ ఇచ్చాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత రోహిత్ శర్మ అంబటి రాయుడు క్రీజులో నిలదొక్కుకుని పరుగుల వరద పారించారు. 137 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 4 సిక్సర్లు, 20 బౌండరీలతో 162 పరుగులు చేసి, ఆష్లే నర్స్ బౌలింగ్‌లో చంద్రపాల్ హెమ్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అంబటి రాయుడు 81 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లు, 8 బౌండరీలతో సెంచరీ కొట్టాడు. అయితే, ఇంకా దూకుడుగా ఆడుతున్న సమయంలో రాయుడు రనౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ 15 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 23 పరుగులు చేసి రోచ్ బౌలింగ్‌లో చంద్రపాల్ హెమ్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 7 బంతులు ఎదుర్కొన్న కేదార్ జాదవ్ 3 ఫోర్లతో 16, రవీంద్ర జడేజా 4 బంతులు ఎదుర్కొని 1 ఫోర్‌తో 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. వెస్టిండీస్ బౌలర్లలో కెమర్ రోచ్ 10 ఓవర్లలో 74 పరుగులిచ్చి 2 వికెట్లు, ఆష్లే నర్స్ 8 ఓవర్లలో 57 పరుగులు, కీమో పాల్ 10 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చి తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందుంచిన భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన వెస్టిండీస్ పరుగుల వేటలో తడబడింది. పుణేలో జరిగిన మూడో వనే్డలో విజృంభించిన విండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ మినహా ఎవరూ కనీస స్కోరు సాధించలేకపోయారు. 16 బంతులు ఎదుర్కొన్న చంద్రపాల్ హెమ్‌రాజ్ 1 సిక్సర్, మరో ఫోర్‌తో 14 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అంబటి రాయుడుకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ షాల్ హోప్ రెండు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే కుల్దీప్ యాదవ్ చేతిలో రనౌట్ అయ్యాడు. కీరన్ పవెల్ 12 బంతులు ఎదుర్కొని 1 ఫోర్‌తో 4 పరుగులు చేసి కోహ్లీ చేతిలో రనౌట్‌గా వెనుతిరిగాడు. షిమ్రాన్ హెట్‌మెయిర్ 11 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 13 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. రోవ్‌మన్ పవెల్ 9 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు చేసి ఖలీల్ అహమ్మద్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మార్లన్ శామ్యూల్స్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతో 18 పరుగులు చేసి ఖలీల్ అహమ్మద్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఫబియాన్ అలెన్ 1 ఫోర్‌తో 10 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 13 బంతులు ఎదుర్కొన్న ఆష్లీ నర్స్ 1 ఫోర్‌తో 8 పరుగులు చేసి కుల్దీ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కీమో పాల్ 18 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 19 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధోనీ చేతిలో స్టంపవుట్ అయ్యాడు. 27 బంతులు ఎదుర్కొన్న కెమర్ రోచ్ 6 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్ 70 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆఖరిదైన ఐదో వనే్డ తిరువనంతపురంలో గురువారం జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు
టీమిండియా: 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 (రోహిత్ శర్మ 162, అంబటి రాయుడు 100)
వెస్టిండీస్: 36.2 ఓవర్లలో 153 ఆలౌట్ (జాసన్ హోల్డర్ 54 నాటౌట్, ఖలీల్ అహ్మద్ 3/13, కుల్దీప్ యాదవ్ 3/42).
చిత్రం.. నాలుగో వనే్డలో సెంచరీ వీరులు అంబటి రాయుడు, రోహిత్ శర్మ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్