క్రీడాభూమి

6వికెట్ల దూరంలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించింది. మ్యాచ్ నాలుగో రోజున ఆసీస్‌పై ఆధిక్యాన్ని సంపాదించడంతోపాటు, ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టును నిలువరించి విజయావకాశాలను మెరుగుపరచుకుంది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా 15 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజైన ఆదివారం ఆటను కొనసాగించి 106.5 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా (71), అజింక్య రహానే (70) అర్ధ శతకాలను నమోదు చేయగా, చివరిలో రిషభ్ పంత్ (28) మాత్రమే కొంత వరకు ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగాడు. రోహిత్ శర్మ (1), రవిచంద్రన్ అశ్విన్ (5), ఇశాంత్ శర్మ (0), మహమ్మద్ షమీ (0), జస్‌ప్రీత్ బుమ్రా (0 నాటౌట్) సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. స్పిన్నర్ నాథన్ లియాన్ 42 ఓవర్లు బౌల్ చేసి, 122 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలున్న టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడంటే లియాన్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉండిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానే పోరాటం కారణంగా కోలుకున్న భారత్ తన ప్రత్యర్థి ముందు 323 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. భారత్ విసిరిన సవాలును స్వీకరించి, రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 28 పరుగుల స్కోరువద్ద ఆరోన్ ఫించ్ (11) వికెట్‌ను కోల్పోయింది. వికెట్‌కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ అందుకోగా, అశ్విన్ బౌలింగ్‌లో అతను పెవిలియన్ చేరాడు. మార్కస్ హారిస్ 49 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసిన తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు చిక్కాడు. ఉస్మాన్ ఖాజా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, కేవలం ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ చక్కటి క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. పీటర్ హ్యాండ్స్‌కోమ్ 14 పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో చటేశ్వర్ పుజారాకు దొరికిపోయాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 4 వికెట్లకు 104 పరుగులు చేసింది. అప్పటికి షాన్ మార్ష్ 31, ట్రావిస్ హెడ్ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. షమీ తొమ్మిది ఓవర్లలో 15 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 44 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా, ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఇంకా 219 పరుగులు చేయాలి. గెలవాలంటే కోహ్లీ సేన మరో ఆరు వికెట్లు కూల్చాలి. గెలవాలన్న తొందరలో ఆడితే వికెట్లు కోల్పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి. భారత్ మాత్రం ఆరు వికెట్లపై కనే్నసింది. దీనితో చివరి రోజు జరిగే ఆట ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

చిత్రం..తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి, రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా రాణించి అర్ధ శతకం సాధించిన భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా