క్రీడాభూమి

ధావన్ ధనాధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 8: శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రతిభ, ఆశిష్ నెహ్రా, ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్ నైపుణ్యం ముంబయిపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 85 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందించింది. ధావన్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ విజృంభణకు యువరాజ్ సింగ్ సమయోచిత బ్యాటింగ్ తోడు కావడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. ముంబయి బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఇదేమీ పెద్ద లక్ష్యం కాదనే అంతా అనుకున్నారు. కానీ, సన్‌రైజర్స్ బౌలర్లు నెహ్రా, ముస్త్ఫాజుర్ తిరుగులేని బంతులతో ముంబయి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారంటే, ముంబయి పతనం ఏ విధంగా కొనసాగిందో ఊహించుకోవచ్చు. ఒకరి తర్వాత మరొకరిగా ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 16.3 ఓవర్లలో 92 పరుగులకే ముంబయి కుప్పకూలింది. ఐపిఎల్‌లో ఆ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2011 మే 10న జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో తలపడి ముంబయి 87 పరుగులకు ఆలౌటైంది.
టాస్ గెలిచిన రోహిత్
ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో, చేజింగ్ సులభమన్న ఉద్దేశంతో ఫీల్డింగ్ తీసుకున్నాడు. అతని నిర్ణయం తప్పని నిరూపించే విధంగా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు శిఖర్ ధావన్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి ధాటిగా ఆరంభించారు. ముంబయి బౌలర్లను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా 9.5 ఓవర్లలో మొదటి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. వార్నర్ 33 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు సాధించి, దురదృష్టశాత్తు అర్ధ శతకం పూర్తి చేయకుండానే హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. కేన్ విలియమ్‌సన్ రెండు పరుగులు చేసి భజ్జీ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన యువరాజ్ సింగ్ 23 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి, మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో బంతిని ఆడబోయి, బ్యాట్ పొరపాటున స్టంప్స్‌కు తగలడంతో హిట్‌వికెట్‌గా అవుటయ్యాడు. మోజెస్ హెన్రిక్స్ రెండు బంతుల్లో ఒక పరుగు చేసి ధావన్‌తో కలిసి నాటౌట్‌గా నిలవగా, సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ధావన్ 57 బంతుల్లో 82 పరుగులు సాధించి, సన్‌రైజర్స్‌ను ఆదుకున్నాడు. అతని స్కోరులో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
దెబ్బతీసిన నెహ్రా
ముంబయి బ్యాట్స్‌మెన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన సన్‌రైజర్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా దారుణంగా దెబ్బతీశాడు. ఐదు పరుగుల స్కోరువద్ద పార్థీవ్ పటేల్ (0)ను భువనేశ్వర్ కుమార్ ఎల్‌బిగా అవుట్ చేయగా, మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మను నెహ్రా వెనక్కు పంపాడు. మూడు బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్‌తో ఐదు పరుగులు చేసిన రోహిత్‌ను నెహ్రా క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. తెలుగు వీరుడు అంబటి రాయుడును కూడా నెహ్రా అవుట్ చేసి, ముంబయిని కోలుకోలేని దెబ్బతీశాడు. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసిన అతను కేన్ విలియమ్‌సన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. మరో హార్డ్ హిట్టర్ జొస్ బట్లర్ వికెట్ కూడా నెహ్రాకే లభించింది. రెండు బంతుల్లో రెండు పరుగులు చేసిన బట్లర్ వికెట్‌కీపర్ నమన్ ఓఝా క్యాచ్ పట్టుకోగా నెహ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ముంబయి బ్యాటింగ్‌కు మూల స్తంభాలైన రోహిత్, రాయుడు, బట్లర్ వికెట్లను నెహ్రా కూల్చడంతో సన్‌రైజర్స్‌కు మ్యాచ్‌పై పట్టు లభించింది. క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసి, 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 17 పరుగులు చేసిన కృణాల్ పాండ్యను ధావన్ క్యాచ్ అందుకోగా బరీందర్ శరణ్ పెవిలియన్‌కు పంపాడు. ముంబయి జట్టులోని మరో హార్డ్ హిట్టర్ కీరన్ పోలార్డ్ (11)ను బరీందర్ శరణ్ క్యాచ్ అందుకోగా మోజెస్ హెన్రిక్స్ అవుట్ చేశాడు. హర్భజన్ సింగ్ జట్టును ఆదుకోవడానికి విఫలయత్నం చేసినప్పటికీ, హార్దిక్ పాండ్య (7), టిమ్ సౌథీ (3), మిచెల్ మెక్‌క్లీనగన్ (8), జస్‌ప్రీత్ బుమ్రా (6) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ముంబయి 19.3 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటయ్యే సమయానికి భజ్జీ 22 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే ముంబయిపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ జట్టు బౌలర్లలో నెహ్రా 15 పరుగులకు మూడు, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 16 పరుగులకు 3 చొప్పున వికెట్లు కూల్చారు. బరీందర్ శరణ్ 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ సి పోరాల్డ్ బి హర్భజన్ సింగ్ 48, శిఖర్ ధావన్ నాటౌట్ 82, కేన్ విలియమ్‌సన్ సి రోహిత్ శర్మ బి హర్భజన్ 2, యువరాజ్ సింగ్ హిట్ వికెట్ బి మిచెల్ మెక్‌క్లీనగన్ 39, మోజెస్ హెన్రిక్స్ నాటౌట్ 1, ఎక్‌స్ట్రాలు 5,
మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177.
బౌలింగ్: టిల్ సౌథీ 4-0-35-0, మిచెల్ మెక్‌క్లీనగన్ 4-0-38-1, హర్భజన్ సింగ్ 4-0-29-2, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-35-0, హార్దిక్ పాండ్య 1-0-10-0, కీరన్ పోలార్డ్ 2-0-23-0, కృణాల్ పాండ్య 1-0-5-0.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ బి నెహ్రా 5, పార్థీవ్ పటేల్ ఎల్‌బి భువనేశ్వర్ కుమార్ 0, అంబటి రాయుడు సి కేన్ విలియమ్‌సన్ బి నెహ్రా 6, కృణాల్ పాండ్య సి ధావన్ బి బరీందర్ శరణ్ 17, జొస్ బట్లర్ సి నమన్ ఓఝా బి నెహ్రా 2, కీరన్ పోలార్డ్ సి బరీందర్ శరణ్ బి మోజెన్ హెన్రిక్స్ 11, హార్దిక్ పాండ్య సి నమన్ ఓఝా బి ముస్త్ఫాజుర్ రహ్మాన్ 7, హర్భజన్ సింగ్ నాటౌట్ 21, టిమ్ సౌథీ సి నమన్ ఓఝా బి ముస్త్ఫాజుర్ రహ్మాన్ 3, మిచెల్ మెక్‌క్లీనగన్ సి మోజెస్ హెన్రిక్స్ బి ముస్త్ఫాజుర్ రహ్మాన్ 8, జస్‌ప్రీత్ బుమ్రా సి నమన్ ఓఝా బి బరీందర్ శరణ్ 6, ఎక్‌స్ట్రాలు 6,
మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 92.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 3-0-23-1, ఆశిష్ నెహ్రా 3-0-15-3, బరీందర్ శరణ్ 3.3-0-18-2, మోజెస్ హెన్రిక్స్ 4-0-18-1, ముస్త్ఫాజుర్ రెహ్మాన్ 3-0-16-3.

* మొదటి పది ఓవర్లలో ముంబయి ఏడు వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ చరిత్రలో, ఇన్నింగ్స్ అర్ధ భాగం ముగిసే సమయానికి ఎక్కువ వికెట్లు కోల్పోయిన జట్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 63 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది.
* ముంబయి టాప్ ఆర్డర్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ అవుటయ్యే సమయానికి ఆ జట్టు స్కోరు 30 పరుగులు. ఐపిఎల్‌లో ఆ జట్టుకు టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్ అవుటయ్యే సమయానికి ఇదే అత్యల్ప స్కోరు. ఐపిఎల్ టోర్నీ జాబితాలో ఆరోది.
* ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కి ముందు ఐదు ఇన్నింగ్స్‌లో 182 సగటుతో 364 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు.
ఈ సీజన్‌లో ఒక జట్టు అత్యల్ప స్కోరుగా ముంబయి చేసిన 92 పరుగుల స్కోరు నమోదైంది. వంద కంటే తక్కువ పరుగులకే అవుటైన మరో జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్. ఈ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులకు ఆలౌటైంది.

గత ఆరు టి-20 ఇన్నింగ్స్‌లో ధావన్ సగటున 147 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతను మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు. కేవలం రెండు పర్యాయాలు అవుటయ్యాడు. అంతకంటే ముందు 20 ఇన్నింగ్స్‌లో ధావన్ సగటు పరుగులు 18.44 మాత్రమే.

శిఖర్ ధావన్
(57 బంతుల్లో
82 నాటౌట్)

సన్ రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ కెరీర్‌లో వందో ఐపిఎల్ మ్యాచ్‌ని విశాఖపట్నంలో ఆదివారం ఆడాడు. మొట్టమొదటిసారి అతను హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ మెక్‌క్లీనగన్ వేసిన బంతిని ఫుట్‌వర్క్ లేకుండానే కొట్టే ప్రయత్నంలో స్టంప్స్‌కు అతని బ్యాట్ తగిలింది. బేల్స్ కిందపడ్డాయి. యువీ హిట్ వికెటయ్యాడు. ఐపిఎల్‌లో హిట్ వికెట్‌గా అవుటైన ఆరో బ్యాట్స్‌మన్‌గా యువీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.