క్రీడాభూమి

వాట్సన్ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: చివరి క్షణం వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం ఒక పరుగు తేడాతో ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగి, 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసిన ముంబయి, ఆతర్వాత అంత సాధారణమైన స్కోరును కూడా రక్షించుకోగలిగింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ దాదాపు చివరి వరకూ క్రీజ్‌లో నిలిచి 80 పరుగులు చేసి, ఒకానొక దశలో జట్టును విజయానికి చేరువలోకి తెచ్చాడు. కానీ, అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించిన అతను రనౌట్ కావడం చెన్నైని దారుణంగా దెబ్బతీసింది. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. క్వింటన్ డి కాక్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. 4.5 ఓవర్లలో 45 పరుగులు జత కలిసిన తర్వాత డి కాక్ ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని సరిగ్గా ఆడలేక, వికెట్‌కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 17 బంతులు ఎదుర్కొన్న అతను 4 ఫోర్ల సాయంతో 29 పరుగులు సాధించాడు. అదే స్కోరువద్ద రోహిత్ శర్మ రూపంలో ముంబయి రెండో వికెట్‌ను కూడా కోల్పోయింది. 14 బంతుల్లో 15 పరుగులు చేసిన అతనిని ధోనీ క్యాచ్ అందుకోగా, దీపక్ చాహర్ పెవిలియన్‌కు పంపాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 15 పరుగులు చేసి, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుండగా, ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్య (7)ను శార్దూల్ ఠాకూర్ రిటర్న్ క్యాచ్ అందుకొని ఔట్ చేశాడు. ఆచితూచి ఆడుతూ ఆడిన ఇషాన్ కిషన్ 26 బంతుల్లో, మూడు ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి, సురేష్ రైనా క్యాచ్ అందుకోగా ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతని సోదరుడు హార్దిక్ పాండ్య కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 10 బంతుల్లో 16 పరుగులు చేసిన అతను దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎల్‌బీగా ఔటయ్యాడు. ఒకవైపు కీరన్ పొలార్డ్ క్రీజ్‌లో నిలబడినప్పటికీ, చివరిలో వికెట్ల పతనం కొనసాగింది. రాహుల్ చాహర్ పరుగుల ఖాతా తెరవకుండానే దీపక్ చాహర్ బౌలలింగ్‌లో ఫఫ్ డు ప్లెసిస్‌కు క్యాచ్ అందించి పెవిలియన్‌కు మళ్లాడు. మిచెల్ మెక్‌క్లీన్‌గన్ రెండు బంతులు ఆడి, ఒక్క పరుగు కూడా చేయకుండానే రనౌటయ్యాడు. 20 ఓవర్లలో ముంబయి 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా, అప్పటికి కీరన్ పొలార్డ్ 41 పరుగులు (25 బంతులు/ మూడు ఫోర్లు/ మూడు సిక్సర్లు), జస్‌ప్రీత్ బుమ్రా (0) నాటౌట్‌గా ఉన్నారు. చెన్నై బౌలర్లలో దీపిక్ చాహర్ 26 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్ 37 పరుగులకు రెండు, ఇమ్రాన్ తాహిర్ 23 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు.
టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి 150 పరుగులు లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 33 పరుగుల స్కోరువద్ద ఓపెనర్ ఫఫ్ డు ప్లెసిస్ వికెట్‌ను కోల్పోయింది. కృణాల్ పాండ్య బౌలింగ్‌లో వరుసగా ఒక ఫోర్, ఒక సిక్సర్, మరో ఫోర్ కొట్టిన డు ప్లెసిస్ తర్వాతి బంతిలోనూ భారీ షాట్ కొట్టబోయి వికెట్‌కీపర్ క్వింటన్ డి కాక్ స్టంప్ చేయడంతో ఔట్ అయ్యాడు. అతను 13 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడిన సురేష్ రైనా చివరికి 14 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి, రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఎల్‌బీగా ఔటయ్యాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు కేవలం ఒక పరుగుచేసి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అప్పటికి చెన్నై స్కోరు 73 పరుగులు. మూడు పరుగుల తేడాలో రెండు వికెట్లు కోల్పోయిన చెన్నైని ఆదుకోవడానికి కెప్టెన్ ధోనీ రంగంలోకి దిగాడు. ఓపెనర్‌గా వచ్చిన వాట్సన్‌కు చక్కటి సహకారాన్ని అందించడంలో విఫలమయ్యాడు. తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు కనిపించిన అతను రెండు పరుగులు చేసి రనౌటయ్యాడు. జాగ్రత్తగా ఆడుతున్న వాట్సన్ 44 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అతను మలింగ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. డ్వెయిన్ బ్రేవో పరుగుల వేగాన్ని పెంచే ప్రయత్నంలో పడడంతో, మ్యాచ్‌లో ఉత్కంఠ చోటు చేసుకుంది. 17 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై విజయానికి 38 పరుగుల దూరంలో నిలిచింది. కృణాల్ పాండ్య బౌలింగ్‌లో వాట్నన్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి చెన్నైని విజయానికి చేరువలోకి తెచ్చాడు. చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 18 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ను వేసిన జస్‌ప్రీత్ బుమ్రా తన రెండో బంతిలోనే డ్వెయిన్ బ్రేవో వికెట్ తీశాడు. 15 బంతుల్లో 15 పరుగులు చేసిన బ్రేవో వికెట్‌కీపర్ క్వింటన్ డి కాక్‌కు దొరికిపోయాడు. ఫిఫ్త్ డౌన్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు దిగాడు.
కాగా, బుమ్రా తన చివరి బంతిలో నాలుగు పరుగులు బైస్ రూపంలో సమర్పించుకున్నాడు. దీనితో చివరి ఓవర్‌లో చెన్నై 9 పరుగుల దూరంలో నిలిచింది. మలింగ వేసిన చివరి ఓవర్ మొదటి మూడు బంతుల్లో నాలుగు పరుగులు లభించాయి. నాలుగో బంతికి వాట్సన్ రనౌటయ్యాడు. అతను 59 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులు సాధించాడు. చివరి రెండు బంతులకు నాలుగు పరుగులు అవసరంకాగా, శార్దూల్ ఠాకూర్ ఐదో బంతికి రెండు పరుగులు చేశాడు. ఫలితంగా చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతికి శార్దూల్ ఠాకూర్‌ను మలింగ ఎల్‌బీ చేయడంతో, చెన్నై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది.

పొలార్డ్ ఆగ్రహం
ఫైనల్ పోరు, చివరి క్షణాల్లో ముంబయి ఆటగాడు కీరన్ పొలార్డ్‌కు కోపం వచ్చింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను డ్వెయిన్ బ్రేవో బౌల్ చేశాడు. అతను వేసిన మూడో బంతి స్టంప్స్ నుంచి చాలా దూరంగా వెళ్లింది. వైడ్ బాల్ అనుకున్న పొలార్డ్ దానిని విడిచిపెట్టాడు. కానీ, అంపైర్ నితిన్ మీనన్ దానిని వైడ్‌గా ప్రకటించకపోవడంతో ఆగ్రహించిన పొలార్డ్ తన బ్యాట్‌ను గాల్లో గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, వికెట్లను వదలిపెట్టి, క్రీజ్‌కు చివరిగా నిలబడి, నిరసన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో, మరో అంపైర్ ఇయాన్ గౌల్డ్‌ను సంప్రదించిన నితిన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
స్కోరుబోర్డు
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డి కాక్ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ శార్దూల్ ఠాకూర్ 29, రోహిత్ శర్మ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ దీపక్ చాహర్ 15, సూర్యకుమార్ యాదవ్ బీ ఇమ్రాన్ తాహిర్ 15, ఇషాన్ కిషన్ సీ సురేష్ రైనా బీ ఇమ్రాన్ తాహిర్ 23, కృణాల్ పాండ్య సీ అండ్ బీ శార్దూల్ ఠాకూర్ 7, కీరన్ పొలార్డ్ 41 నాటౌట్, హార్దిక్ పాండ్య ఎల్‌బీ దీపక్ చాహర్ 16, రాహుల్ చాహర్ సీ ఫఫ్ డు ప్లెసిస్ బీ దీపక్ చాహర్ 0, మిచెల్ మెక్‌క్లీన్‌గన్ రనౌట్ 0, జస్‌ప్రీత్ బుమ్రా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1-45, 2-45, 3-82, 4-89, 5-101, 6-140, 7-140, 8-141.
బౌలింగ్: దీపక్ చాహర్ 4-1-26-3, శార్దూల్ ఠాకూర్ 4-0-37-2, హర్భజన్ సింగ్ 4-0-27-0, డ్వెయిన్ బ్రేవో 3-0-24-0, ఇమ్రాన్ తాహిర్ 3-0-23-2, రవీంద్ర జడేజా 2-0-12-0.
చెన్నై సూపర్ కింగ్స్: ఫఫ్ డు ప్లెసిస్ స్టంప్డ్ క్వింటన్ డి కాక్ బీ కృణాల్ పాండ్య 26, షేన్ వాట్సన్ రనౌట్ 80, సురేష్ రైనా ఎల్‌బీ రాహుల్ చాహర్ 8, అంబటి రాయుడు సీ క్వింటన్ డి కాక్ బీ జస్‌ప్రీత్ బుమ్రా 1, మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ 2, డ్వెయిన్ బ్రేవో సీ క్వింటన్ డి కాక్ బీ జస్‌ప్రీత్ బుమ్రా 15, రవీంద్ర జడేజా 5 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ ఎల్‌బీ లసిత్ మలింగ 2, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1-33, 2-70, 3-73, 4-82, 5-133, 6-146, 7-148.
బౌలింగ్: మిచెల్ మెక్‌క్లీనగన్ 4-0-24-0, కృణాల్ పాండ్య 3-0-39-1, లసిత్ మలింగ 4-0-49-1, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-14-2, రాహుల్ చాహర్ 4-0-14-1, హార్దిక్ పాండ్య 1-0-3-0.

చిత్రాలు.. *ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందాన్ని భార్య రితికతో పంచుకుంటున్న ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ
* షేన్ వాట్సన్ (80)