క్రీడాభూమి

పసలేని విండీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పటి వెస్టిండీస్ క్రికెట్ జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి జట్టు పరిస్థితిని ఎంత చెప్పినా ఎక్కువే. బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించే సూపర్ ఫాస్ట్ బౌలర్లు, ఎలాంటి బౌలింగ్‌నైనా చితకబాది పరుగులు కొల్లగొట్టే మేటి హిట్టర్లు ప్రస్తు తం వెస్టిండీస్ జట్టులో లేరు. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన విండీస్ పరిస్థితి ఇప్పుడు పంజా విసరలేక దీనంగా చూస్తున్న మృగరాజును గుర్తుకు తెస్తున్నది. చార్లెస్ గ్రిఫిత్, ఆండీ రాబర్ట్స్, మైఖేల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్, జోల్ గార్నర్, కర్ట్‌లీ అంబ్రోస్, మాల్కం మార్షల్, వెస్లీ హాల్... ఇలా ఎంతో మంది విండీస్ ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. కంటికి కనిపించనంత వేగంతో వచ్చిన బంతులు ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థంగాక బ్యాట్స్‌మెన్ వికెట్లు పారేసుకునేవారు. ఎదురొడ్డి నిలవాలని ప్రయత్నించిన వాళ్లు తీవ్రంగా గాయపడేవారు. బౌలింగ్ బలానికి బ్యాటింగ్ అండ ఉండడం వల్లే కొన్ని దశాబ్దాలు ప్రపంచ క్రికెట్‌కు రారాజుగా వెలిగింది. జార్జి హెడ్లే, గారీ సోబర్స్, క్లెయివ్ లాయిడ్, డెస్మండ్ హేన్స్, గార్డెన్ గ్రీనిడ్జ్, వివియన్ రిచర్డ్స్, బ్రియాన్ లారా వంటి అసాధారణ బ్యాట్స్‌మెన్ ఆ జట్టుకు అత్యుత్తమ సేవలు అందించారు. విం డీస్‌తో సిరీస్‌లు ఆడేందుకు ఏ జట్టూ సాహసించేది కాదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన విండీస్ 1983 వరల్డ్ కప్ తర్వాత క్రమంగా పతనమవుతూ వచ్చింది. చివరికి పసికూన జట్ల చేతిలోనూ పరాజయాలను ఎదుర్కొనే స్థాయికి దిగజారింది. ఎవరూ ఊహించని రీతిలో టీ-20 వరల్డ్ కప్‌ను గెల్చుకోవడానికి మినహాయిస్తే, సుమారు రెండు దశాబ్దాల కాలంలో విండీస్ సాధించిన అద్భుతాలు ఏమీ లేవు. 1975, 1979 సంవత్సరాల్లో వరుసగా రెండు పర్యాయాలు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న విండీస్ 1983లో భారత్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. 1987, 1992 సంవత్సరాల్లో గ్రూప్ దశలోనే పోరాటాన్ని ముగించింది. 1996లో సెమీ ఫైనల్‌కు చేరినప్పటికీ, ఫైనల్లో స్థానం సంపాదించలేకపోయింది. 1999, 2003 సంవత్సరాల్లో మళ్లీ గ్రూప్ దశను అధిగమించలేకపోయింది. 2011, 2015 సంవత్సరాల్లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈసారి వరల్డ్ కప్‌లో గ్రూప్ దశను అధిగమించగలుగుతుందా అన్నది కూడా అనుమానంగానే కనిపిస్తున్నది. అయితే, అనూహ్యంగా ఎదురుదాడికి దిగడం ఈ జట్టు అలవాటు. తమదైన రోజున ఫలితాలను ఒంటి చేత్తో తారుమారు చేసే సత్తా ఉన్న క్రిస్ గేల్, డారెన్ బ్రేవో, కార్లొస్ బ్రాత్‌వెయిట్ వంటి స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. గేల్ గతంలో మాదిరి రాణించలేకపోతున్నా, అతనిని తక్కు వ అంచనా వేసే జట్టు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇవిల్ లూయిస్, షిర్మన్ హాత్‌మేయర్ వంటి బ్యాట్స్‌మెన్ అండ ఆ జట్టుకు ఉంది. కెమర్ రోచ్, షానన్ గాబ్రియల్ బౌలింగ్ విభాగాన్ని శాసిస్తారు. ఆష్లే నర్స్, ఆండ్రె రసెల్, కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆల్‌రౌండర్లుగా సేవలు అందిస్తున్నారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఫాబియన్ అలా ఉండగా, బౌలర్ ఆల్‌రౌండర్ కార్లొస్ బ్రాత్‌వెయిట్ సేవలు విండీస్ బలాన్ని పెం చుతున్నాయి. నిలకడగా రాణించలేకపోవడం, వ్యక్తిగత ఆట తప్ప, జట్టు ప్రయోజనాల కోసం ఆడకపోవడం వంటి సమస్యలను అధిగమిస్తే, ఈసారి వరల్డ్ కప్‌పై విండీస్ తనదైన ముద్ర వేసే అవకాశం లేకపోలేదు. ఈ జట్టు టైటిల్ గెలుస్తుందని చెప్పలేకపోయినా, మేటి జట్లకు కూడా కొన్ని సమయాల్లో గట్టిపోటీనిస్తుందనడంలో సందేహం లేదు. ఈ జట్టు ఎంత వరకూ రాణిస్తుందో, ఎవరిని ఓడిస్తుందో, ఎవరి చేతిలో ఓడుస్తుందో వేచిచూడాలి.
ఒలింపిక్స్ చిహ్నంగా ఐదు వృత్తాలు ఉంటాయి. ఇవి ఐదు ఖండాలకు ప్రాతినిథ్యం వహిస్తాయి. 2015 వరల్డ్ కప్‌తో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ ఒలింపిక్స్ స్ఫూర్తిని అందుకోగలిగింది. ఐదు ఖండాల్లోనూ ప్రపంచ కప్ టోర్నీలను నిర్వహించిన ఘనతను అందుకుంది. 1987లో భారత్, పాకిస్తాన్ (ఆసియా) దేశాలు వరల్డ్ కప్ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. 1999లో ఇంగ్లాండ్ (ఐరోపా)లో, 2003లో దక్షిణాఫ్రికా (ఆఫ్రికా)లో, 2007లో వెస్టిండీస్ (అమెరికా)లో, 2015 ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా)లో వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. దీనితో ఒలింపిక్స్ రింగ్స్‌లో ఐదు ఖండాలూ పూర్తయ్యాయి.

దక్షిణాఫ్రికా జాత్యాహంకార విధానాలకు పాల్పడడంతో అంతర్జాతీయ క్రీడా రంగానికి దూరమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఆ దేశంలో నిషేధం విధించింది. దీనితో 1992 వరకూ దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ కప్‌లో ఆడలేకపోయింది. అప్పటి నుంచి ప్రతి ప్రపంచ కప్ టోర్నీకి హాజరైన ఆ జట్టుపై శ్రీలంక, పాకిస్తాన్ ఇంత వరకూ విజయాన్ని సాధించలేకపోయాయి. గత వరల్డ్ కప్‌లో భారత్ తొలిసారి దక్షిణాఫ్రికాను ఓడించింది.

ప్రపంచ కప్ చరిత్రలో మరెవరికీ సాధ్యంకాని రీతిలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ అత్యధిక అర్ధ శతకాలు, శతకాలతోపాటు, అత్యధిక స్కోరును కూడా సాధించాడు. ఒక టోర్నీలో అత్యధికంగా 673 పరుగులు (2003లో) చేశాడు. 1996 నుంచి 2003 మధ్య అతను వరుసగా నాలుగు అర్ధ శతకాలు నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఎక్కువ సంఖ్యలో, ఆరుసార్లు వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొన్న క్రికెటర్‌గా, అత్యధిక పర్యాయాలు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైన ఆటగాడిగా కూడా సచిన్ పేరిట రికార్డులు పదిలంగా ఉన్నాయి.

వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ ఆడే మ్యాచ్‌లు
తేదీ ప్రత్యర్థి వేదిక
మే 31 పాకిస్తాన్ ట్రెంట్ బ్రిడ్జి, నాటింగ్‌హామ్
జూన్ 6 ఆస్ట్రేలియా ట్రెంట్ బ్రిడ్జి, నాటింగ్‌హామ్
జూన్ 10 దక్షిణాఫ్రికా హాంప్స్‌షైర్ బౌల్, సౌతాంప్టన్
జూన్ 14 ఇంగ్లాండ్ హాంప్స్‌షైర్ బౌల్, సౌతాంప్టన్
జూన్ 17 బంగ్లాదేశ్ కౌంటీ క్రికెట్ క్లబ్, టౌన్టన్
జూన్ 22 న్యూజిలాండ్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
జూన్ 27 భారత్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
జూలై 1 శ్రీలంక రివర్ సైడ్ దర్హం, చెస్టర్ లీ స్ట్రీట్
జూలై 4 అఫ్గానిస్తాన్ హెడింగ్లే, లీడ్స్