క్రీడాభూమి

బౌలింగ్‌లో డ్వెయన్ స్మిత్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, మే 19: కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య గురువారం ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో స్కోరింగ్ కారణంగా అభిమానులను నిరాశకు గురి చేసింది. గుజరాత్ ఎలాంటి సమస్య లేకుండా, మరో 39 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, అభిమానులకు ఊరటనిచ్చింది. నైట్‌రైడర్స్ ఎనిమిది వికెట్లకు 124 పరుగులు చేయగా, గుజరాత్ 13.3 ఓవర్లలోనే, నాలుగు వికెట్లకు 125 పరుగులు సాధించింది. డ్వెయిన్ స్మిత్ 8 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, నైట్‌రైడర్స్‌ను దెబ్బతీయడంతో ఆతర్వాత స్వల్పమైన లక్ష్యాన్ని ఛేదించడం గుజరాత్‌కు కష్టం కాలేదు.
టాస్ గెలిచిన గుజరాత్ ఆహ్వానం మేరకు నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగింది. రాబిన్ ఉతప్పతో కలిసి తొలి వికెట్‌కు 23 పరుగులు జోడించిన తర్వాత అనవసరంగా పరుగుకు ప్రయత్నించిన కెప్టెన్ గౌతం గంభీర్ రనౌట్ కావడంతో నైట్‌రైడర్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. షాదబ్ జకాతీ చక్కటి త్రోతో స్టంప్స్‌ను కూల్చడంతో అవుటైన గంభీర్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. మనీష్ పాండే మూడు బంతులు ఎదుర్కొని, కేవలం ఒక పరుగు చేసి డ్వెయిన్ స్మిత్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు దొరికిపోయాడు. క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ, 19 బంతుల్లో, మూడు ఫోర్లతో 25 పరుగులు చేసిన ఉతప్పను వికెట్‌కీపర్ దినేష్ కార్తీక్ క్యాచ్ అందుకోగా డ్వెయిన్ స్మిత్ పెవిలియన్‌కు పంపాడు. హార్డ్ హిట్టర్ ముద్రతో బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన పీయూష్ చావ్లా 11 పరుగులు చేసి డ్వెయిన్ స్మిత్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యూసుఫ్ పఠాన్ బాధ్యతాయుతంగా ఆడినప్పటికీ, మిగతా వారి నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. చావ్లా వికెట్ కూలిన కొద్ది సేపటికే బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా అవుటయ్యాడు. మూడు పరుగులు చేసిన అతను డ్వెయిన్ స్మిత్ బౌలింగ్‌లో ఏకలవ్య ద్వివేదీకి సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్ యాదవ్, యూసుఫ్ పఠాన్ భాగస్వామ్యంలో నైట్‌రైడర్స్ 100 పరుగుల మైలురాయిని దాటింది. జట్టు స్కోరు 102 పరుగుల వద్ద షాదబ్ జకాతీ బౌలింగ్‌లో దవళ్ కులకర్ణికి చిక్కి సూర్యకుమార్ యాదవ్ వెనుదిరగడంతో రన్‌రేట్ మళ్లీ మందగించింది. 36 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 36 పరుగులు చేసిన పఠాన్‌ను సురేష్ రైనా క్యాచ్ పట్టగా ధవళ్ కులకర్ణి అవుట్ చేశాడు. జాసన్ హోల్డర్ 8 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి డ్వెయిన్ బ్రేవో బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్‌కి చిక్కాడు. నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేయగా, అప్పటికి సునీల్ నారైన్ (2), మోర్న్ మోర్కెల్ (1) నాటౌట్‌గా నిలిచారు. డ్వెయిన్ స్మిత్‌కు నాలుగు వికెట్లు లభించాయి.
మొదటి బంతికే వికెట్
ట్‌రైడర్స్‌ను ఓడించడానికి 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సిన గుజరాత్ ఇన్నింగ్స్ మొదటి బంతికే తొలి వికెట్‌ను కోల్పోయింది. అంకిత్ రాజ్‌పుత్ తొలి బంతిలోనే డ్వెయిన్ స్మిత్‌ను వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప క్యాచ్ పట్టగా అవుట్ చేశాడు. వేగంగా పరుగులు చేయగల సత్తావున్న బ్రెండన్ మెక్‌కలమ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. అతను ఆరు పరుగులు చేసి సునీల్ నారైన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ 12 పరుగులు చేసి మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో గుజరాత్ 38 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. కెప్టెన్ సురేష్ రైనా, ఆరోన్ ఫించ్ జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించి, ఆరు ఓవర్లలో 59 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. 23 బంతుల్లో 26 పరుగులు చేసి, గుజరాత్‌ను గెలిపిస్తాడనుకున్న ఫించ్ రనౌట్ కావడంతో ఆ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. అయితే, రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో విజయం సులభసాధ్యమైంది. సురేష్ రైనా 36 బంతుల్లో 53, రవీంద్ర జడేజా 10 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 13.3 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్లకు 125 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 (రాబిన్ ఉతప్ప 25, యూసుఫ్ పఠాన్ 36, సూర్య కుమార్ యాదవ్ 17, జాసన్ హోల్డర్ 13, డ్వెయిన్ స్మిత్ 4/8).
గుజరాత్ లయన్స్: 13.3 ఓవర్లలో 4 వికెట్లకు 125 (ఆరోన్ ఫించ్ 29, సురేష్ రైనా 53).
**

* గుజరాత్ ఈ విజయంతో, 16 పాయంట్లతో సన్‌రైజర్స్‌తో కలిసి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ జట్టు తర్వాతి మ్యాచ్‌ని ముంబయ ఇండియన్స్‌తో శనివారం ఆడుతుంది. నైట్‌రైడర్స్ 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది.
* ఈ ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన నైట్‌రైడర్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప టి-20 ఫార్మెట్‌లో 5,000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, గౌతం గంభీర్ ఈ ఫీట్‌ను సాధించారు.
* కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో మొట్టమొదటిసారి డే/నైట్ మ్యాచ్ జరిగింది. ఏ ఫార్మెట్‌లోనూ ఇంత వరకూ వరకూ ఈ స్టేడియంలో డే/నైట్ లేదా నైట్ మ్యాచ్ జరగలేదు.
* మొదటి పది ఓవర్లలో నైట్‌రైడర్స్ 60 కంటే తక్కువ పరుగులు చేయడం ఇది రెండోసారి. ఈ రెండూ గుజరాత్ లయన్స్‌పైనే కావడం గమనార్హం. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు చేస్తే, తాజాగా కాన్పూర్‌లో 55 పరుగులు మాత్రమే సాధించింది.
* నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ రనౌట్లలో రికార్డు సృష్టించాడు. తాజా సంఘటనతో కలిపితే, టి-20 ఫార్మెట్‌లో అతను రనౌట్ కావడం 21వ సారి. ఈ ఐపిఎల్‌లో అతనికి ఇది నాలుగో రనౌట్. టి-20 ఫార్మెట్‌లో అత్యధిక పర్యాయాలు రనౌట్‌గా వెనుదిరిగిన బ్యాట్స్‌మన్‌గా జయవర్ధనే పేరిట ఉన్న రికార్డును గంభీర్ అధిగమించాడు. జయవర్ధనే 20సార్లు రనౌటయ్యాడు.

***
* డ్వెయిన్ స్మిత్ టి-20 ఫార్మెట్‌లో మూడు లేదా అంకంటే ఎక్కువ వికెట్లను ఈ మ్యాచ్‌కి ముందు చివరిసారి 2013లో పడగొట్టాడు. గురువారం నాటి మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ రెండు ఇన్నింగ్స్ మధ్య అతను 33 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాడుగానీ, అలాంటి ఫీట్‌ను సాధించలేదు.
* గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ స్మిత్ ఈ ఇన్నింగ్స్‌లో కేవలం ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి, నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఒక ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకు మించి వికెట్లకు అతి తక్కువ పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది. 2009 ఏప్రిల్ 18న కేప్ టౌన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన అనీల్ కుంబ్లే కేవలం ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ గతంలో డక్కన్ చార్జర్స్ తరఫున ఆడాడు. ముంబయి ఇండియన్స్‌తో 2009 మే 6న జరిగిన మ్యాచ్‌లో అతను రెండు ఓవర్లు బౌల్ చేసి, ఆరు పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. అతని ప్రతిభ డక్కన్ చార్జర్స్‌కు 19 పరుగుల తేడాతో విజయాన్ని అందించింది.

చిత్రం 4 వికెట్లు పడగొట్టిన డ్వెయిన్ స్మిత్