క్రీడాభూమి

యువకుడు.. నేర్చుకుంటాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 11: ‘రిషభ్ పంత్ యువకుడు.. అంతర్జాతీయ వేదికలపై ఆడిన అనుభవం ఎక్కువ లేదు.. పాఠాలు నేర్చుకుంటాడు..’ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన పంత్ అందుకు భిన్నంగా నిర్లక్ష్యంగా షాట్‌ను కొట్టి ఔటైన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ వేసిన ఓవర్‌లో మొదటి నాలుగు బంతులను రక్షణాత్మకంగా ఆడిన పంత్ ఆతర్వాత సహనం కోల్పోయాడు. ఐదో బంతిని స్వీప్ షాట్ రూపంలో బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. మిడ్‌వికెట్‌లో కాపుకాసిన కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్ ఇచ్చి, 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అతని షాట్ ఎంపికపై వెల్లువెత్తిన విమర్శలపై కోహ్లీ స్పందిస్తూ, పంత్ ఇంకా చిన్నవాడేనని, పాఠాలు నేర్చుకుంటాడని అన్నాడు. తానుకూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి పొరపాట్లు ఎన్నో చేశానని అన్నాడు. పంత్ నిదానంగా కూర్చొని ఆలోచించుకుంటే, తాను చేసిన పొరపాటు ఏమిటో స్పష్టమవుతుందని అన్నాడు. స్వతఃసిద్ధమైన స్ట్రోక్ బ్యాట్స్‌మన్ కాబట్టి, షాట్లకు ప్రయత్నించడం పంత్‌కు సహజమని అన్నాడు. నిజానికి పంత్ ఎంతో జాగ్రత్తగానే ఆడాడని, కానీ, సాంట్నర్ బౌలింగ్‌లో ఎంచుకున్న షాట్ ఒక్కటే పొరపాటని కోహ్లీ చెప్పాడు. ఈ పొరపాటు నుంచి పాఠాలు నేర్చుకొని, మరింత మెరుగైన క్రికెటర్‌గా అతను రూపుదిద్దుకుంటాడని జోస్యం చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య గొప్ప పోరాట పటిమను కనబరిచారని కోహ్లీ అన్నాడు. జడేజాకు అతని బాధ్యతలను గురించి చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. పోటీకి దిగిన తర్వాత జయాపజయాలు సహజమని, వాటిని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నాడు.
ఐపీఎల్ నాకౌట్ విధానం భేష్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అనుసరిస్తున్న నాకౌట్ దశ విధానం ఉత్తమమైనదని కోహ్లీ అన్నాడు. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలు ఆక్రమించిన జట్లకు, ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉండడమే ఐపీఎల్ నాకౌట్ ప్రత్యేకత. ఈ రెండు జట్లు మొదటి క్వాలిఫయర్‌లో తలపడతాయి. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. గెలిచిన జట్టుతో, మొదటి క్వాలిఫర్‌లో ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారే ఫైనల్‌కు అర్హత సంపాదిస్తారు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లోనూ ఇలాంటి విధానాన్ని అమలు చేయడం ఉత్తమంగా ఉంటుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.