క్రీడాభూమి

14న కోహ్లీ సేన రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 12: భారత క్రికెట్ జట్టు ఈనెల 14వ తేదీ, ఆదివారం స్వదేశానికి బయలుదేరుతుంది. గ్రూప్ దశలో చక్కటి ఆటతో రాణించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన టీమిండియా సెమీ ఫైనల్లో అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగినప్పటికీ, ఫైనల్‌కు చేరుకోక ముందే నిష్క్రమించిన విరాట్ కోహ్లీ సేన ఆదివారం లండన్ నుంచి ముంబయికి బయలుదేరుతుంది. ఇలావుంటే, టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్వదేశానికి చేరుకున్న తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్‌లో అతను బ్యాటింగ్ చేసిన విధానం అభిమానులను సైతం ఆగ్రహానికి గురి చేసింది. ప్రత్యేకించి ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో టెస్టు మ్యాచ్‌ని మరపించే రీతిలో ఆడిన ధోనీ ఒక రకంగా టీమిండియా పరాజయానికి కారణమయ్యాడన్న విమర్శలు వెల్లువెత్తాయి.
గతంలో మాదిరి మ్యాచ్ ఫినిషర్‌గా అతను మెరుపులు మెరిపించలేకపోతున్నాడని, ఫామ్‌తోపాటు ఫిట్నెస్ ప్రమాణాలు కూడా దారుణంగా పడిపోయాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ముంబయి చేరుకున్న వెంటనే ధోనీ తన స్వస్థలమైన రాంచీకి వెళ్లిపోతాడు. కెప్టెన్‌గా భారత్‌కు 2007లో టీ-20 వరల్డ్ కప్, 2011లో ప్రపంచ కప్ ట్రోఫీని సాధించి పెట్టిన ధోనీని ఎంతగా పొగిడారో ఇప్పుడు అతని బ్యాటింగ్ తీరును చూసి అంతగా విమర్శిస్తున్నారు. ఇంకా ఎక్కువకాలం జట్టులో కొనసాగి, మరింతగా పరువు పోగొట్టుకునే కంటే స్వచ్ఛందంగా వైదొలగడం మంచిదని అతను భావిస్తుండవచ్చు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవి శాస్ర్తీ తదితరుల మద్దతు అతనికి ఉంది. అంతేగాక, ధోనీ పుట్టిన రోజున అతని బ్యాటింగ్ నైపుణ్యాన్ని, ఫామ్‌ను ప్రశంసిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. మరికొంతకాలం క్రికెట్ ఆడే శక్తిసామర్థ్యాలు తనలో ఉన్నాయని ధోనీ ఈ వరల్డ్ కప్‌లో నిరూపించుకున్నాడని వాఖ్యానించింది. దీనిని బట్టిచూస్తే, అతని రిటైర్మెంట్‌పై బీసీసీఐ కూడా పట్టుబట్టకపోవచ్చన్నది స్పష్టమవుతున్నది. కానీ, క్రికెట్ పండితులు మాత్రం వరల్డ్ కప్ అతని చివరి టోర్నీ అనీ, అతను త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. ఏది నిజమనేది త్వరలోనే స్పష్టమవుతుంది.

వరల్డ్ కప్‌లో సహచరులతో ధోనీ (ఫైల్ ఫొటో)