క్రీడాభూమి

రాహుల్ ‘రికార్డు’ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 11: కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన లోకేష్ రాహుల్ ‘రికార్డు’ సెంచరీతో రాణించగా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు సాధించడంతో, జింబాబ్వేతో శనివారం జరిగిన మొదటి వనే్డలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. జింబాబ్వేను కేవలం 168 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా ఆతర్వాత లక్ష్యాన్ని మరో 45 బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. యజువేంద్ర చాహల్, కరుణ్ నాయర్, లోకేష్ రాహుల్ అరంగేట్రం చేసిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే కేవలం ఎనిమిది పరుగుల స్కోరు వద్ద పీటర్ మూర్ వికెట్‌ను కోల్పోయింది. మూడు పరుగులు చేసి బరీందర్ శరణ్ బౌలింగ్‌లో అతను ఎల్‌బిగా వెనుదిరగడంతో ఆరంభమైన వికెట్ల పతనం ఆతర్వాత కూడా కొనసాగింది. ఎల్టన్ చిగుంబురా 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, జింబాబ్వే బ్యాటింగ్ వైఫల్యం ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు. క్రెగ్ ఇర్విన్ 21, సికందర్ రజా 23 పరుగులు చేసి కొంత వరకూ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు. మిగతా వారంతా మూకుమ్మడిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ముగియడానికి మరో బంతి మిగిలి ఉండగా జింబాబ్వే 168 పరుగుల వద్ద ఆలౌటైంది. అప్పటికి తురయ్ ముజారబానీ ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 9.5 ఓవర్లు బౌల్ చేసి, 28 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ధవళ్ కులకర్ణి, బరీందర్ శరణ్ చెరి 42 పరుగులిచ్చి, ఒక్కొక్కరూ రెండేసి వికెట్లు పడగొట్టారు.
సిక్సర్‌తో శతకం
లోకేష్ రాహుల్ సిక్సర్‌తో సెంచరీని పూర్తి చేసి, కెరీర్‌లో తొలి వనే్డలోనే శతకాన్ని సాధించిన 11వ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర పుటల్లో చోటు సంపాదించాడు. భారత్ 11 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను కరుణ్ నాయర్ రూపంలో కోల్పోయింది. తొలి వనే్డ ఆడుతున్న అతను 20 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్ సాయంతో ఏడు పరుగులు చేసి, టెండై చతారా బౌలింగ్‌లో సికందర్ రజా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అంబటి రాయుడుతో కలిసి లోకేష్ రాహుల్ వ్యూహాత్మకంగా స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. రాయుడు చక్కటి సహకారాన్ని అందించగా, లక్ష్యాన్ని ఛేదించే బాధ్యతను లోకేష్ తీసుకున్నాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు 38 ఓవర్లలో అజేయంగా 162 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. భారత జట్టు విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలవగా, హామిల్టన్ మసకజా 43వ ఓవర్‌ను ఆరంభించే సమయానికి లోకేష్ రాహుల్ 92 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీనితో అతను సెంచరీ పూర్తి చేయడం కష్టంగా కనిపించింది. మొదటి బంతి డాట్‌బాల్ కాగా, రెండో బంతిలో లోకేష్ రెండు పరుగులు చేశాడు. అతని స్కోరు 94 పరుగులకు చేరింది. మరో రెండు పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది కాబట్టి లోకేష్ రాహుల్ సెంచరీ పూర్తికాదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. కానీ, అతను మూడో బంతిని భారీ సిక్స్‌గా కొట్టి సెంచరీ మైలురాయిని చేరాడు. తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌ను గెలిపించాడు. అతను 115 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అతను సరిగ్గా 100 పరుగులు చేయగా, రాయుడు 120 బంతుల్లో, ఐదు ఫోర్లతో 62 పరుగులతో అతనితోపాటు నాటౌట్‌గా ఉన్నాడు.
స్కోరుబోర్డు
జింబాబ్వే: పీటర్ మూర్ ఎల్‌బి బరీందర్ శరణ్ 3, చాము చిబాభా బి జస్‌ప్రీత్ బుమ్రా 13, హామిల్టన్ మసకజా సి ధోనీ బి ధవళ్ కులకర్ణి 14, క్రెగ్ ఇర్విన్ సి సబ్‌స్టిట్యూట్ (ఫైజ్ ఫజల్) బి అక్షర్ పటేల్ 21, ఉసి సిబాండా సి ధోనీ బి జస్‌ప్రీత్ బుమ్రా 5, సికందర్ రజా బి బరీందర్ శరణ్ 23, ఎల్టన్ చిగుంబురా బి జస్‌ప్రీత్ బుమ్రా 41, రిచ్‌మండ్ ముతుంబామీ సి లోకేష్ రాహుల్ బి యజువేంద్ర చాహల్ 15, గ్రేమ్ క్రెమెర్ బి ధవళ్ కులకర్ణి 8, టెండై చతారా సి అంబటి రాయుడు బి జస్‌ప్రీత్ బుమ్రా 4, తౌరయ్ ముజరంబానీ నాటౌట్ 1, ఎక్‌స్ట్రాలు 20, మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 168.
వికెట్ల పతనం: 1-8, 2-30, 3-47, 4-69, 5-77, 6-115, 7-140, 8-156, 9-167, 10-168.
బౌలింగ్: ధవళ్ కులకర్ణి 10-1-42-2, బరీందర్ శరణ్ 10-0-42-2, జస్‌ప్రీత్ బుమ్రా 9.5-2-28-4, అక్షర్ పటేల్ 10-1-26-1, యజువేంద్ర చాహల్ 10-1-27-1.
భారత్: లోకేష్ రాహుల్ నాటౌట్ 100, కరుణ్ నాయర్ సి సికందర్ రజా బి చతారా 7, అంబటి రాయుడు నాటౌట్ 62, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (42.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 173.
వికెట్ల పతనం: 1-11.
బౌలింగ్: చతారా 7-1-20-1, ముజరంబానీ 6-0-18-0, చిబాభా 8-1-14-0, క్రెమెర్ 10-0-47-0, చిగుంబురా 4-0-34-0, సికిందర్ రజా 5-0-20-0, మసకజా 2.3-0-19-0.
**
భారత్ తరఫున ఒకే వనే్డలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఆటగాళ్లు అరంగేట్రం చేసిన సంఘటన ఇది రెండోది. 1976లో న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చితో జరిగిన మ్యాచ్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్, పార్థసారధి శర్మ వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో యజువేంద్ర చాహల్, కరుణ్ నాయర్, లోకేష్ రాహుల్ తొలిసారి బరిలోకి దిగారు. ఒకే వనే్డలో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు స్థానం లభించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
**
జింబాబ్వే బ్యాట్స్‌మెన్ మొదటి పది ఓవర్లలో 42 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. పవర్ ప్లేలో కేవలం 32 పరుగులు సాధించారు. కాగా, ఈ మ్యాచ్‌కి ముందు హామిల్టన్ మసకజా మూడు ఇన్నింగ్స్‌లో, ఒక సెంచరీ, ఒక అర్ధ శతకం సాయంతో 219 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 14 పరుగులకే అవుటయ్యాడు.
టీమిండియా మొదటి 30 ఓవర్లలో 91 పరుగులు మాత్రమే ఇచ్చింది. గత పది సంవత్సరాల్లో భారత్ మొదటి 30 ఓవర్లలో ఇంత తక్కువ పరుగులిచ్చిన సందర్భం ఇదే.
అంబటి రాయుడు ఈ మ్యాచ్‌తో తన కెరీర్‌లో 1,000 వనే్డ పరుగుల మైలురాయని చేరాడు. 29వ ఇన్నింగ్స్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు.

* కెరీర్‌లో తొలి వనే్డలోనే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా, మొత్తం మీద 11వ ఆటగాడిగా లోకేష్ రాహుల్ చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదించాడు. 2006లో ఇంగ్లాండ్‌పై రాబిన్ ఉతప్ప 86 పరుగులు చేసి, తొలి వనే్డలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును లోకేష్ బద్దలు చేశాడు.
ఆడిన తొలి వనే్డలోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్..
1. డెనిస్ అమిస్ (ఇంగ్లాండ్/ ఆస్ట్రేలియాపై 103 పరుగులు), 2. డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్/ ఆస్ట్రేలియాపై 148 పరుగులు), 3. ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే/ శ్రీలంకపై అజేయంగా 115 పరుగులు), 4. సలీం ఇలాహీ (పాకిస్తాన్/ శ్రీలంకపై అజేయంగా 102 పరుగులు), 5. మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ వెస్టిండీస్‌పై అజేయంగా 122 పరుగులు), 6. కొలిన్ ఇన్‌గ్రామ్ (దక్షిణాఫ్రికా/ జింబాబ్వేపై 124 పరుగులు), 7. రాబ్ నికోల్ (న్యూజిలాండ్/ జింబాబ్వేపై అజేయంగా 108 పరుగులు), 8. ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా/ శ్రీలంకపై 112 పరుగులు), 9. మైఖేల్ లంబ్ (ఇంగ్లాండ్/ వెస్టిండీస్‌పై 106 పరుగులు), 10. మార్క్ చాప్‌మన్ (హాంకాంగ్/ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై అజేయంగా 124 పరుగులు), 11. లోకేష్ రాహుల్ (్భరత్/ జింబాబ్వేపై అజేయంగా 100 పరుగులు).

chitram నాలుగు వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా,
తొలి వనే్డలోనే సెంచరీ చేసిన మొదటి భారత బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్