క్రీడాభూమి

ధోనీ సేనకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 18: భారత్ చేతిలో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కోల్పోయిన జింబాబ్వే ఎదురుదాడి చేసి, టి-20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ధోనీ సేనకు షాకిచ్చింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడిన ఎల్టన్ చిగుంబురాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 33 పరుగుల స్కోరువద్ద హామిల్టన్ మసకజా వికెట్‌ను కోల్పోయింది. అతను 25 పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వుటయ్యాడు. చాము చిబాభా 20 పరుగులు చేసి, రిషీ ధావన్ బౌలింగ్‌లో ఎల్‌బికాగా, రిచర్డ్ ముతుంబామీ నాలుగు బంతులు ఎదుర్కొన్న తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. సికందర్ రజా (20), మాల్కం వాలర్ (30) కొంత సేపు భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే, చిగుంబురా ఇన్నింగ్స్‌ను ప్రధానంగా పేర్కోవాలి. అతను 26 బంతుల్లోనే ఒక ఫోర్, ఏడు సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు సాధించడంతో జింబాబ్వే స్కోరు బోర్డు వేగంగా ముందుకు దూసుకెళ్లింది. టినొటెండా ముతుంబొజీ (3), కెప్టెన్ గ్రేమ్ క్రెమెర్ (4) తక్కువ పరుగులకు అవుటయ్యారు. జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు సాధించగా, అప్పటికి చిగుంబురాతోపాటు నెవిల్లె మజీవా 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
తొలి బంతికే వికెట్
జింబాబ్వేను ఓడించడానికి 169 పరుగులు సాధించాల్సిన భారత్ తొలి బంతికే లోకేష్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. డొనాల్డ్ టిరిపానో బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్‌డౌలో బ్యాటింగ్‌కు దిగిన అంబటి రాయుడు రెండో వికెట్‌కు మన్దీప్ సింగ్‌తో కలిసి 44 పరుగులు జోడించాడు. 16 బంతుల్లో 19 పరుగులు చేసిన అతనిని చాము చిబాభా బౌల్డ్ చేశాడు. మన్దీప్ సింగ్ 27 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేసి చిబాభా బౌలింగ్‌లోనే టినొటెండా ముతుంబొడీ క్యాచ్ అందుకోవడంతో అవుటయ్యాడు. మనీష్ పాండే బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరును పెంచాడు. కేదార్ జాదవ్ 19 పరుగులకు అవుట్‌కాగా, మనీష్ పాండే 35 బంతుల్లో 48 పరుగులు చేసి తౌరయ్ ముజరంబానీ బౌలింగ్‌లో డొనాల్డ్ టిరిపానోకు దొరికిపోయాడు. ధోనీ, అక్షర్ పటేల్ (18) భాగస్వామ్యం కొనసాగింనంత వరకూ భారత్ విజయం దాదాపుగా ఖాయంగానే కనిపించింది. 20 ఓవర్ మొదలయ్యే సమయానికి భారత్ విజయానికి కేవలం ఎనిమిది పరుగుల దూరంలో నిలిచింది. నెవిల్లే మజీవా చివరి ఓవర్‌లో ఐదు పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీనితో భారత్ విజయానికి మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది. 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 168 పరుగులు సాధించగా, అప్పటికి ధోనీ 17 బంతుల్లో 19, రిషీ ధావన్ రెండు బంతుల్లో ఒక పరుగు చొప్పున చేసి క్రీజ్‌లో ఉన్నారు.

ఉత్కంఠ రేపిన
చివరి ఓవర్
చివరి ఓవర్ ఉత్కంఠ రేపింది. విజయానికి ఎనిమిది పరుగులు అవసరంకాగా, అక్షర్ పటేల్ 8 బంతుల్లో 16, ధోనీ 14 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టి-20 ఫార్మెట్‌లో ఒక ఓవర్‌లో ఎనిమిది పరుగులు అత్యంత సాధారణమైన లక్ష్యం. కానీ, ఆ ఓవర్‌ను నెవిల్లే మజీవా చాలా జాగ్రత్తగా వేశాడు. మొదటి బంతికి ధోనీ ఒక పరుగు చేయగా, రెండో బంతికి సబ్‌స్టిట్యూట్ ఆటగాడు వెల్లింగ్టన్ మసకజా క్యాచ్ పట్టడంతో పటేల్ అవుటయ్యాడు. మూడో బంతిలో ధోనీ ఒక పరు చేశాడు. నాలుగో బంతిని రిషీ ధావన్ రక్షణాత్మకంగా ఆడాడు. ఐదో బంతి వైడ్‌కాగా, మరోసారి మజీవా ఐదో బంతే వేయాల్సి వచ్చింది. ఆ బంతిలో రిషీ ధావన్ ఒక పరుగు చేశాడు. భారత జట్టు గెలవడానికి చివరి బంతిలో నాలుగు పరుగులు అవసరమయ్యాయి. ధోనీ క్రీజ్‌లో ఉన్నాడు. కానీ ఆ బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ధోనీకి ఒక పరుగు మాత్రమే లభించింది. జింబాబ్వే రెండు పరుగుల తేడాతో గెలిచింది.

మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు ఈనెల 20, 22 తేదీల్లో హరారేలో జరుగుతాయ.

సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 (చాము చాబాభా 20, హామిల్టన్ మసకజా 25, సికందర్ రజా 20, మాల్కం వాలర్ 30, ఎల్టన్ చిగుంబురా 54 నాటౌట్, జస్‌ప్రీత్ బుమ్రా 2/24, రిషీ ధావన్ 1/42, అక్షర్ పటేల్ 1/18, యుజువేంద్ర చాహల్ 1/38).
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 (మన్దీప్ సింగ్ 31, అంబటి రాయుడు 19, మనీష్ పాండే 48, కేదార్ జాదవ్ 19, మహేంద్ర సింగ్ ధోనీ 19 నాటౌట్, అక్షర్ పటేల్ 18, ముజరంబానీ 2/31, చాము చిబాభా 2/13).

చిత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎల్టన్ చిగుంబురా