జాతీయ వార్తలు

జయ కోలుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 8: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకుని త్వరగా తిరిగి వస్తారని విపక్ష నేతలు స్టాలిన్, వైకోలు ఆకాంక్షించారు. ఇద్దరు నేతలు శనివారం ముఖ్యమంత్రి చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. డిఎంకె కోశాధికారి, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎంకె స్టాలిన్ శనివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రికి వచ్చారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు తమకు చెప్పారని, ఆమె త్వరగా కోలుకుని, తిరిగి విధులకు హాజరు కావాలని డిఎంకె తరపున, పార్టీ అధ్యక్షుడు కరుణానిధి తరపున తాము ఆకాంక్షిస్తున్నామని విలేఖరులతో స్టాలిన్ చెప్పారు. స్టాలిన్ వెంట అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నేత దురై మురుగన్, రాష్ట్ర మాజీ మంత్రి కె పొన్ముడి కూడా ఉన్నారు.
తాత్కాలిక ఏర్పాట్లు అక్కర్లేదు: వైకో
జయలలిత మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారన్న ధీమాను ఎండిఎంకె నేత వైకో వ్యక్తం చేశారు. అనారోగ్యానికి గురయిన జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిని శనివారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన తమిళనాడు గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జయలలిత ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చేంతవరకు పాలనా వ్యవహారాలను చూసేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసిన డిఎంకెపై వైకో నిప్పులు చెరిగారు. ‘ముఖ్యమంత్రి బాగున్నారు. ఆమె అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవడానికి అవసరమైన అన్ని వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారు. లక్షలాది ఎఐఎడిఎంకె కార్యకర్తల బాధ త్వరలోనే తీరిపోతుంది’ అని వైకో అన్నారు. కావేరి జలాల వివాదంలో తమిళనాడు ప్రయోజనాలను పరిరక్షించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించిన జయలలితను ఆయన ప్రశంసించారు. జయలలిత గత నెలలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, తీవ్ర విచారానికి లోనయ్యానని ఆయన చెప్పారు. తాను ఆసుపత్రిలో జయలలితకు చికిత్స చేస్తున్న వైద్యులతో చర్చించానని, బ్రిటన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు రిచర్డ్ జాన్ బీలేతో కూడా మాట్లాడానని ఆయన వెల్లడించారు. గవర్నర్‌ను తాను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని ఆయన చెప్పారు.
కొనసాగుతున్న ఫిజియోథెరపీ
ముఖ్యమంత్రి జయలలితకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమెకు చికిత్స చేస్తున్న అపోలో ఆస్పత్రి శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. జయలలిత ఊపిరితిత్తుల్లో నెమ్ము తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని, ఫిజియోథెరపీ కొనసాగిస్తున్నామని, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఇస్తున్నట్లు ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలియ జేశారు. జయలలితకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసను అందించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు.

చిత్రం.. జయను పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న ఎంకె స్టాలిన్