సబ్ ఫీచర్

రివ్యూలతో రిస్కెంత!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమర్శ -సినిమాను చంపేస్తోంది. ఒక వర్గం వాదన. విమర్శ -చెత్త సినిమాలకు దూరం పెడుతుంది. మరోవర్గం వాదన. ఏది నిజం? అన్న ప్రశ్నకు డిజిటల్ యుగంలో కచ్చితమైన సమాధానం దొరక్కపోవచ్చు. ఎవరి వాదన వారిదనుకోవాలి. కాకపోతే -ప్రస్తావనంటూ వచ్చిన తరువాత ప్రశ్నించుకోవడం, సమాధానపడటం ఎప్పుడూ జరిగేదే. ‘రివ్యూ’ అన్న రెండక్షరాలను చాలాకాలంగా సినీవర్గం బలంగానే వ్యతిరేకిస్తోంది. రివ్యూ పేరిట సినిమాను చంపేస్తున్నారంటూ గొంతెత్తి అరిచేవాళ్లున్నారు. పనీపాటా లేనివాళ్ల పనే రివ్యూలివ్వడం అంటూ చీదరించే వాళ్లున్నారు. దారినపోయే దానయ్యలుగా దెప్పిపొడిచేవాళ్లూ.. చూసింది, తోచింది ఏదో చెబుతున్నార్లేనని సర్దిచెప్పుకునేవాళ్లూ.. ఇలా అనేక వర్గాలు పరిశ్రమలో. ఏదోక సీజన్‌లో.. ఏదోక సందర్భంలో ‘సినిమా - రివ్యూ’ మధ్య తగాదా తలెత్తుతూనే ఉంది. అది -ఇటీవల ఒకింత ఎక్కువైంది. తాజాగా -తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల కౌన్సిల్, నడిగర్ సంఘం అధ్యక్షుడు, హీరో విశాల్ చేసిన విజ్ఞప్తితో మళ్లీ ‘సినిమా -సమీక్ష’పై చర్చకొచ్చింది. నిజానికి విశాల్ రెండోసారి చేసిన విజ్ఞప్తి డిజిటల్ మీడియాకు. ‘విమర్శకులకు ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవ్వరూ ప్రశ్నించలేరు. మేమూ గౌరవిస్తాం. కాకపోతే, సినిమా స్థితినీ దృష్టిలో పెట్టుకోండి. సమీక్షలను కనీసం మూడు రోజులపాటు వాయిదా వేయండి. దీనివల్ల నిర్మాతకు ఊపిరి తీసుకునే చాన్స్ ఉంటుంది’. ఇదీ విశాల్ విజ్ఞప్తి సారాంశం. సాంకేతికత సులువైపోయిన తరువాత వేగవంతమైన దాని వ్యాప్తిని నియంత్రించడం నిజానికి అసాధ్యమన్నది నిజం. మరోపక్క భావ వ్యక్తీకరణను అడ్డుకోవడం దుర్లభం కూడా. అయినా, విశాల్ విజ్ఞప్తిని చర్చిద్దాం.
సంప్రదాయ ప్రచార మాధ్యమాల ఒరవడి వీడి -సినిమా డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టిన తరువాత వ్యాపారం పదింతలైంది. రెండు కోట్లుపెట్టి తీసిన చిత్రానికి -మూడుకోట్ల వెచ్చించి ‘డిజిటల్ టచ్, డిజిటల్ కాంపెయిన్’తో ప్రేక్షకుడి ముందుకు తెస్తున్నారు. అంటే, అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో ప్రేక్షకుడిని ఊరించి ఆకర్షించడం సినిమా డిజిటల్ లక్షణమన్న మాట. ప్రింట్లు గొడవ వదిలి, చేతిలోకి ‘చిప్’లు వచ్చిన తరువాత సినిమాను ఎన్ని థియేటర్లలోనైనా క్షణాల్లో విడుదల చేయగల సాంకేతిక సౌలభ్యమూ వచ్చేసింది. సో, డిజిటల్ మాధ్యమంతో విపరీతమైన హైప్ క్రియేట్ చేయబడిన సినిమా ఒక్కసారిగా వేల థియేటర్లలో విడుదలైతే -మూడు రోజుల్లో పెట్టుబడులు వెనక్కి రావడం ఖాయం. విశాల్ విజ్ఞప్తి చేస్తున్నట్టు మూడు రోజులు రివ్యూల జోలికి పోకపోతే -వచ్చిన సినిమా గిట్టుబాటయ్యేదో, కాదో తెలీక ప్రేక్షకుడు చూస్తాడు. అదిచాలు -నిర్మాత గట్టెక్కడానికి. ఆలోచన బావుందిగానీ -చెత్త సినిమాను సైతం జేబుకు చిల్లుపెట్టుకుని చూసెయ్యాలన్న అంతరార్థమూ ఇందులో కనిపిస్తోంది. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చు తడిసి మోపెడైంది. టిక్కెట్ ధర పదులుదాటి (డిజిటల్ థియేటర్ల కారణంగానే) వందలకు చేరింది. ఓ కుటుంబం సాధారణ థియేటర్‌లో సినిమా చూడాలంటే ఖర్చును నాలుగంకెలు దాటించాలి. ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టార్‌లో వ్యాపార సేవ చేస్తోన్న నిర్మాతను బతికించడానికి -ఆడియన్స్ నష్టాలను భరించాలన్న పరమార్థం ఇందులో కనిపించడం లేదూ.
సాంకేతికత విస్తరణతో సినిమా మొదటి ఆట పూర్తయిన క్షణాల్లో క్రిటిక్స్ రేటింగ్స్ నెట్‌లో దర్శనమిస్తున్నాయి. రకరకాల కామెంట్స్‌తో నెటిజన్లూ చెలరేగిపోతున్నారు. వీటిని ఆపాలంటే, విడుదలకు ముందు ఇదో గొప్ప సినిమా అని చెప్పుకోవడం ఆపడం ఒక్కటే మార్గం.
పత్రికల్లో ఫిల్మ్ క్రిటిక్స్ కథనాలకు ఓ ప్రమాణ ఉంటుందన్నది విశాల్ లాంటివాళ్లు సైతం అంగీకరిస్తున్నారు. నిజమైన విమర్శకులు ఫేవరిజానికి దూరంగా ఉంటారన్నదీ వాళ్లు చెప్తోన్న మాటే. అంతర్జాలంలో నెటిజన్లు తమ అభిప్రాయాలను పోస్ట్ చేసి, రేటింగ్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్లందరికీ క్రిటిక్స్ టాగ్ తగిలించలేం. కానీ, అంతిమంగా ప్రేక్షకుడే పవర్‌ఫుల్ క్రిటిక్. ఒకప్పుడు వౌత్ టాక్‌తో హిట్టంటూ మురిసిపోయన పరిశ్రమవాసులే.. ఇప్పుడు టెక్నికల్ టాక్‌తో సినిమా చచ్చిపోతుందంటూ గగ్గోలు పెట్టడాన్ని ఏమనాలి?
ఇటీవల సినిమా ఫంక్షన్లలో అక్కసు వెళ్ళగ్రక్కడాన్నీ చూస్తున్నాం. ‘డిజె’ ఫంక్షన్లో అల్లు అర్జున్ కలెక్షనే్ల సినిమాకు గీటురాయంటూ క్రిటిక్స్‌పై స్మూత్‌గా విరుచుకుపడితే ‘జైలవకుశ’ ఫంక్షన్లో జూ.ఎన్టీఆర్ ఏకంగా క్రిటిక్స్‌ని దారిపోయే దానయ్యలన్నాడు. మహేష్‌బాబు ‘స్పైడర్’ ప్రెస్‌మీట్‌లో- క్రిటిక్స్ ఉన్నదున్నట్టుగా వ్రాస్తారు... దాంట్లో తప్పేముందని ప్రశ్నించాడు. ఇదంతా చూస్తుంటే కలెక్షన్లు సరిగా లేకపోవడం సినిమా తప్పుకాదు, క్రిటిక్సే కారణమన్నట్టుగా వుంది.
సినిమా కళాత్మక వ్యాపారం. వందల కోట్లు పెట్టి తీసే సినిమా ఫలితం మొదటి ఆటతో తేలిపోతే గతంలో కంటే నేడు అత్యధికంగా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. దీనికి క్రిటిక్సే తొలి కారణమని చెప్పడం వారి దృష్టిలో సబబు. అయితే నేడు సినిమా టిక్కెట్ల రేట్లు స్థిరంగా లేకపోవడం... కాంబో ప్యాకేజ్‌లతో వుండడంవల్ల ప్రేక్షకుడు దారుణంగా దోపిడీకి గురవుతున్నాడు. అధమంగా ‘సి’ సెంటర్‌లలో సైతం టికెట్ ధర వందకు పైమాటే! అందుకే సినిమా విడుదల రోజు క్రిటిక్ కామెంట్స్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు. సినిమా హిట్ అంటే ఎంతైనా పెట్టి సినిమా చూస్తున్నాడు. సినిమాకు కొబ్బరికాయ కొట్టింది మొదలు గుమ్మడికాయ కొట్టేంతవరకు ప్రేక్షకులకు విషయాలను చేరవేస్తోన్న మీడియా, అదే సినిమా విడుదల తర్వాత భావ వ్యక్తీకరణ స్వేచ్చతో తీర్పునిస్తే తప్పేముంది.
క్రిటిక్స్ దారినపోయే దానయ్యలైతే ‘శతమానంభవతి’ వంటి చిన్న సినిమా అంతటి కలెక్షన్లను ఎలా రాబట్టేది? ఇక్కడ అసలు బాధ ఏంటంటే -కోట్లు పెట్టి తీసిన సినిమాకు కనీసం ఓపెనింగ్స్ అయినా రాకుండా క్రిటిక్స్ అడ్డుపడుతున్నారన్న ఆక్రోశం కనిపిస్తోంది. నిజానికి ఇది నిజం కాదు. పెద్ద హీరోల సినిమా వేలాది థియేటర్లలో విడుదలవుతుంది. పైగా నెట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ పేరిట పెట్టుబడులను ముందే లాగేస్తున్నారు. అగ్రహీరోలకు ప్రీ రిలీజ్ బిజినెస్సూ జరిగిపోతుంది.
ఎటొచ్చీ నష్టాలను మూటకట్టుకునేది బయ్యర్లే. వాళ్లను రక్షించుకోవాలంటే -క్రిటిక్స్ సినిమా వెళ్లిపోయన తరువాత సమీక్ష చేయాలన్నది వారి ఆకాంక్ష. తీసిన సినిమా ఆడియన్స్‌కి ఎక్కలేదన్న వాస్తవాలను విశే్లషించుకోకుండా, రివ్యూలతో రిస్క్ ఎక్కువైందని గగ్గోలు పెట్టడం ఎంతవరకూ సబబు. ‘ప్లస్’ని తీసుకున్నప్పుడు ‘మైనస్’నీ ఆహ్వానించగలగాలి. ఈ విషయమే సినిమా వాళ్లకు అర్థంకావడం లేదు.

విజయప్రసాద్, బాసు