సబ్ ఫీచర్

అభ్యుదయ పాలకుడు పానగల్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా కీర్తించబడిన చెన్నైతో తెలుగువారిది విడదీయరాని బంధం. తెలుగువారి మనసులలో ఇప్పటికీ ‘మదరాసు’గానే ముద్రితమై ఉన్న చెన్నై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది సింహభాగం అంటే, ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. మొట్టమొదటిసారిగా చెన్నై నగరంలో అడుగుపెట్టిన తెలుగువారికి, నగరంలోని పలు వీధులు, ఉద్యానవనాలు తెలుగు ప్రముఖుల పేర్లతో విలసిల్లుతుండటాన్ని చూసినప్పుడు, తాము ఓ పొరుగు రాష్ట్రంలో ఉన్నామన్న భావన ఎట్టి పరిస్థితుల్లో కలుగదన్నది నిజం. ఇక, టి.నగర్‌లోని పానగల్ పార్కుతో మన తెలుగువారి అనుబంధాన్ని మాటలతో చెప్పనలవి కాదు. నాటి తెలుగు సినీ రంగానికి చెందిన లబ్ధప్రతిష్ఠులకు పానగల్ పార్కుతో విడదీయరాని బంధం ఉందన్నది ఆయా కళాకారుల జీవిత చరిత్రలను చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. తెలుగు చలనచిత్ర సీమకు చెందిన ఎందరో కళాకారులు పానగల్ పార్కులో తలదాచుకుని విజయపథాన్ని చేరుకున్నారు. రచయితలలో మల్లాది రామకృష్ణశాస్ర్తీ నుంచి ఆరుద్ర వరకు పానగల్ పార్కులో సేద తీర్చుకున్నవారే. చెప్పాలంటే, ఆ పార్కులో ఒక్కొక్క బెంచీకి ఒక్కొక్క పేరు ఉండేది. అందులో ‘మల్లాదివారి బెంచీ’ అత్యంత ప్రసిద్ధం. పానగల్ పార్కులో తరచుగా సాహిత్యగోష్ఠులు జరుగుతుండేవి. మల్లాది రామకృష్ణశాస్ర్తీ, శ్రీశ్రీ, గోవిందరాజుల సుబ్బారావు, వేదాంతం రాఘవయ్య, పాలగుమ్మి పద్మరాజు, ఆత్రేయ, ఆరుద్ర వంటి ఉద్దండ పండితులు సాయంకాల సమయాల్లో పానగల్ పార్కుకు వస్తూ ఉండేవారు. ఇంతటి ఘన చరిత్రగల పానగల్ పార్కు నిర్మాణానికి ఉదారంగా తన భూమిని ఇచ్చిన దాత, మన తెలుగుబిడ్డ అనే విషయం మనకెంతో గర్వకారణం. తమకు చెందిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని చక్కని ఉద్యానవనంగా తీర్చిదిద్ది, ప్రజలకోసం వితరణ చేసిన ఆ తెలుగు నేత... ‘పానగల్ రాజా’ సర్. రామరాయణింగర్.
ఆ తెలుగురత్నం గురించి మనలో ఎంతమందికి తెలుసు?! ‘‘తెలుగుజాతి మనది. నిండు వెలుగుజాతి మనది...’’ అని గుండెలు చరుచుకుంటూ పాడుకునే మనం, పాటలకే పరిమితమవుతుంటామన్నది నిష్ఠుర సత్యం. మన భాష, సంస్కృతి సంప్రదాయాల పట్ల మనకున్న నిర్లక్ష్యపు ధోరణిని చూసి ఇతర భాషలవారంతా ఆశ్చర్యంతో నోరెళ్ళబెడుతుంటారన్నది నిజం. ఇంతటి ఆశ్చర్యానే్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వ్యక్తపరిచారు. ఒకానొకసారి ఆయన సచివాలయంలో ఉన్నప్పుడు మన తెలుగు రత్నం ‘పానగల్ రాజా’ సర్.రామరాయణింగర్ ప్రస్తావన వచ్చిందట. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా ‘పానగల్ రాజా అంటే ఎవరండీ?’ అని అడగ్గానే, కరుణానిధి విస్మయానికి లోనయ్యారట. (అలా అడిగిన వారిలో తెలుగువారు కూడ ఉన్నారని వినికిడి). వారి ప్రశ్నను విని సుదీర్ఘ నిట్టూర్పును విడిచిన కరుణానిధి, తమ అనుభవాన్ని అక్కడున్నవారితో పంచుకున్నారు. ‘‘నేను తిరువారూర్ మహోన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నప్పుడు, పానగల్ రాజావారి జీవిత చరిత్ర అనుబంధ పాఠ్యపుస్తకంగా (నాండిటెయిల్) ఇవ్వబడింది. 54 పుటలతో కూడిన ఆ చిన్న పుస్తకాన్ని మణి శివజ్ఞాన సంబంధ ముదలియార్ అనే రచయిత వ్రాసారు. ఒట్రుమై ఆఫీసు (సంఘటిత కార్యాలయం), సైదాపేట, మదరాసు అనే చిరునామాతో ముద్రించబడిన ఆ పుస్తకపు ధర మూడు అణాలుగా నిర్ణయించబడింది. ఆ పుస్తకాన్ని అమూలాగ్రంగా కంఠోపాఠం చేసిన నేను, మా తరగతి ఉపాధ్యాయులు రామకృష్ణశెట్టియార్, ముత్తుకృష్ణ నాడార్‌గార్ల ప్రశంసలను పొందాను’’ అంటూ పానగల్ రాజా గొప్పతనాన్ని గురించి కరుణానిధి విడమరచి చెప్పారు.
మన తెలుగు రత్నమైన పానగల్ రాజాను తమిళులు తమవాడిగానే భావిస్తుంటారు. ఒకసారి ఉత్తర చెన్నైలో జరిగిన దళిత మహాసభలో ఓ వక్త చెప్పిన సంగతులు: ‘‘సోదరులారా! ఒకప్పటి సమాజంలో మనలను కడజాతివారు అంటూ ఈసడించుకోవడమే కాదు, నీచమైన పదాలే మన కుల సంబోధనలుగా ఉండేవి. అటువంటి దుర్భర పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన రాజారావు, మనకు అటువంటి పరిస్థితులు ఎదురవకూడదని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫలితంగా ‘కడజాతివారిని పరైయన్ అనే పేర్లతో పిలువకూడదు. ఎవరైనా అలా పిలిస్తే శిక్షార్హులవుతారు. ఇకపై కడజాతివారు అని పిలువబడుతున్న వారంతా ఆది ద్రావిడులుగా పిలువబడ’తారనే ఉత్తరువును జారీచేశారు. ఇటువంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని, వాటిని అమలుపరిచిన పానగల్ రాజా తెలుగుబిడ్డ అనే విషయం మనలో ఓ నూతనోత్సాహాన్ని కలిగిస్తుంటుంది.
పానుగంటి రామరాయణింగర్ 1886 జూన్ 9న కాళహస్తి జమీందారు కుటుంబంలో జన్మించారు. ట్రిప్లికేన్ హిందూ మహోన్నత పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించిన ఆయన చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత విద్యను ముగించారు. అనంతరం న్యాయశాస్త్రంలో పట్టాని పొందిన పానుగంటి రామరాయణింగర్ యం.ఏ. అందుకున్నారు. తెలుగు, తమిళం, ఆంగ్లం, సంస్కృత భాషలలో మంచి పాండితీప్రకర్షగల పానగల్ రాజా ‘ఫెలో ఆఫ్ ది ప్రెసిడెన్సీ కాలేజ్’గా నియమితులయ్యారు. 1912లో ఆయన భారత రాజవంశ విధాన మండలి సభ్యునిగా నియమించబడ్డారు. అప్పట్నుంచి రామరాయణింగర్‌కు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. కొంతకాలానికి నాలుగు బ్రాహ్మణేతర సంఘాలు కలసి జస్టిస్ పార్టీగా అవతరించాయి. జస్టిస్ పార్టీలో చేరిన పానగల్‌రాజా రామరాయణింగర్ బ్రిటీష్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకై లండన్‌కు వెళ్ళొచ్చారు. 1920లో మద్రాసు ప్రెసిడెన్సీకి జరిగిన తొలి ఎన్నికలలో జస్టిస్ పార్టీ పోటీచేసి అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రిగా ఎ.సుబ్బరాయలురెడ్డియార్ పదవీ బాధ్యతలు స్వీకరించగా, పానగల్ రాజారామరాయణింగర్ మంత్రిగా నియమింపబడ్డారు. కాలగమనంలో ఎ.సుబ్బరాయలురెడ్డి అనారోగ్యంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో 1921 జూలై 11న పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీకి రెండవ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. మరలా 1923లో జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీ విజయభేరి మ్రోగించడంతో మళ్లీ ఆయనే మూడవసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.
ఆయన పరిపాలనలోనే మద్రాసు విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయాలలో కొన్ని మార్పులుచేశారు. అన్నామలై విశ్వవిద్యాలయం కూడ పానగల్ రాజావారు ప్రారంభించినవే. మద్రాసు నగరాభివృద్ధికై పానుగంటి రాజావారు చేసిన సేవలు అపారమైనవి. ఉదాహరణకు ఆ రోజుల్లో మాంబళం ఓ చిన్న గ్రామం. మద్రాసు నగరాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించుకున్న పానగల్ రాజావారు, మాంబళం గ్రామానికి ప్రక్కనే నుంగంబాక్కం, సైదాపేటలకు మధ్య సర్.పిట్టి త్యాగరాయశెట్టిగారి పేరిట త్యాగరాయనగర్ అనే కాలనీని అభివృద్ధిపరిచారు. ఆ కాలనీయే ప్రస్తుతం చెన్నై నగరం నడిబొడ్డున టి.నగర్‌గా శోభిల్లుతోంది. డా. గౌర్ బిల్లు ద్వారా కులాంతర వివాహాలకు చట్టబద్ధత కల్పించిన పానగల్ రాజావారు, కులపరంగా, మతపరంగా రిజర్వేషన్లు కల్పించాలని ఓ గవర్నమెంటు ఆర్డర్‌ను ప్రవేశపెట్టారు. కానీ, తమ జస్టిస్ పార్టీనుంచే ఆశించినంత స్పందన రాకపోవడంతో నిరాశ చెందారు. దాంతో పానగల్ రాజావారికి రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లడం మొదలైంది. వీటన్నింటినీ మించి బి అండ్ సి కర్మాగార కార్మికుల సమ్మెలో ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు ఆయన రాజకీయ రంగంనుంచి నిష్క్రమించేట్లుగా చేసాయి.
ఉన్నత విద్యాపారంగతులు, మేధావియైన పానగల్ రాజావారి సుపరిపాలనా విధానం, పీడిత వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకు గల నిబద్ధత, కులమతాలకు అతీతంగా అందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఆయన తపనను గుర్తించిన బ్రిటీషు ప్రభుత్వం, వారిని ‘నైట్ కమాండర్’ బిరుదుతో సత్కరించింది. పానగల్ రాజావారు క్రీ.శ.1928 డిసెంబరు 16వ తేదీన పరమపదించారు. నిజం చెప్పాలంటే, తమిళులు పానగల్ రాజాని తమ వాడిగానే తలుచుకుంటూ ఆయన జయంతులు, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తుండటాన్ని చూస్తుంటాము. అంతేకాదు, చెన్నై సైదాపేటలోని జిల్లా రెవెన్యూ కార్యాలయానికి ‘పానగల్ మాళిగై’ అనే పేరుపెట్టి ఆయన పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు.

(డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన ‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి కొంత భాగం)

- ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు