సబ్ ఫీచర్

ఆ వెన్నెలకు అతనే చంద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిండు పున్నమి.. వెండి వెన్నెల
ఈ మాటలతో కలిగే అందమైన భావన -బహుశ విజయా చిత్రాల తరువాత మాసి’పోయినట్టనిపిస్తుంది. ఆ జాబిల్లి వేరు. అతనిచుట్టూ అల్లుకున్న సంగీత సాహిత్యాలు వేరు. మనసుకు హాయైన చల్లని చందమామను చూపించి.. తరువాత తనతోపాటే తీసుకెళ్లినట్టున్నాడు -సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే. ఆడిటోరియం మధ్యనున్నా, మూలన కూర్చున్నా.. అందరిపై అదే వెనె్నల కురిపించే చందమామను చూపించగల నైపుణ్యం ఆయనకే పరిమితమైందేమో -అంటున్నాడు రావి కొండలరావు.

నాలుగో వారానికి నడిపించిన వెనె్నల అతిథి -తన ముచ్చట్లను పిండివెనె్నల నుంచి మొదలెట్టాడు. థియేటర్‌లో ఏమూలనున్నా -చందమామ తనపైనే ‘తలపై’ ఉన్నాడన్న భావనను -ఆడియన్స్‌పై పల్లపర్చిన అత్యద్భుత సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే నుంచి మొదలుపెట్టారు.

జయావారి చిత్రాలే ఓ ప్రత్యేకత. అందులోని చందమామ మరో ప్రత్యేకత. ప్రతి సినిమాలో ఉండే ఓ వెనె్నలపాట.. ఆ పాటలో కనిపించే జాబిల్లి మరీ మరీ ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలకు కారణం -కెమెరామెన్ మార్కస్ బార్ట్‌లే. మిగిలిన చిత్రాల్లో కనిపించే చందమామకు విజయావారి చందమామ భిన్నమన్నది స్క్రీన్‌పై చూస్తే అర్థమవుతుంది. ఆ వైవిధ్యం ఏంటంటే - విజయావారి చంద్రుడు.. థియేటర్ నలుమూలలా.. రిజర్వుడ్ సీట్లనుంచి నేల టికెట్ ఆడియన్స్‌పైనా ఒకే తీరున వెనె్నల కురిపించటం. ఆ టెక్నిక్ ఇప్పుడు వెనె్నల సన్నివేశాలను చిత్రీకరించే వారికి ఉందని నేననుకోవడం లేదు. ఆ నైపుణ్యం కెమెరామెన్ మార్కస్ బార్ట్‌లేకు ఉండేది. ఆయనతోనే అందమైన చందమామ వెళ్లిపోయాడన్న భావన అప్పుడప్పుడూ సినిమాల్లో చందమామ సీన్స్ చూస్తున్నపుడు అనిపిస్తుంటుంది. అంత గొప్పగా ఉండేది -ఆయన కెమెరా కురిపించే వెనె్నల. విజయ అంటేనే వెనె్నల -అన్నంత ముద్ర అందుకే పడిందేమో కూడా. గమనించారో లేదో -పాతాళభైరవిలో కథానాయికపై చెలికత్తెలతో కలిపి ‘తియ్యని ఊహలు హాయిగా రేగెను’ అనే పాట ఉంటుంది. ఎక్కడో ఔట్‌డోర్‌లో చిత్రీకరించారు అన్నట్టుంటుంది ఆ పాట. కానీ అదంతా సెట్టే. నిజమైన మొక్కలుతెచ్చి సెట్టునిండా నింపారు. బ్లాక్ అండ్ వైట్ రీళ్లలోనూ -పచ్చదనానికి మించిన భావన కలిగించడం ఆయనకే సాధ్యమైనట్టుంది. సీన్ టేక్ తీసుకునేటప్పుడు మాత్రమే -చెట్లన్నీ సెట్లోకి వచ్చేవి. షాట్ గ్యాప్ పీరియడ్‌లో చెట్లను ఆరుబయటకు తరలించేవారు. అందుక్కారణం -సెట్లోని లైటింగ్ వేడికి మొక్కలు వసివాడిపోతాయని, ఆ కారణంగా నేచురాలిటీ దెబ్బతింటుందని చెప్పేవారు. కెమెరా కన్నుపై ఆయనకున్న కమాండే వేరు. షాట్ రెడీకాగానే ఆరుబయట పెట్టిన చెట్లు సెట్లోకి వచ్చేవి. దాంతో ఫ్రెష్‌నెస్ కనిపించేది సన్నివేశంలో.
‘వగలోయ్ వగలు’ పాట తరువాత తోటరాముడు మాంత్రికుడి చేతిలోని మ్యాజిక్ డబ్బా తీసుకొని పారిపోతాడు. వెనుక నేపాళ మాంత్రికుడు వస్తాడు. సరిగ్గా గమనిస్తే -ఆ సన్నివేశంలో ఇండోర్, ఔట్‌డోర్ రెండూ ఉంటాయి. సీన్‌లో ఆ వేరియేషన్ ఆడియన్స్‌కి అందకుండా చేయడంలోనే మార్కస్‌కున్న పట్టు కనిపిస్తుంది. ఆ సీన్‌లో ఔట్‌డోర్‌లో నటించింది ఒక్క ఎస్వీఆర్ మాత్రమే. తోటరాముణ్ణి తరుముకుంటూ నేపాళ మాంత్రికుడు చెట్ల మధ్యనుంచి నవ్వుకుంటూ వస్తున్నట్టు చేసిన ఒక్క సీన్ మాత్రమే ఔట్‌డోర్ షూటింగ్. మిగతాదంతా ఇండోర్ షూటింగ్. ఔట్‌డోర్, ఇండోర్ షూటింగ్ సీన్‌ని లైటింగ్‌తోనే మ్యాచ్ చేసిన మాంత్రికుడాయన. ఔట్‌డోర్ షూట్‌లో ఉన్నపుడు చెట్లు ఎలా ఉన్నాయో, ఇండోర్ సెట్‌లో చెట్లను సెట్‌చేసి మరీ షూట్ చేశారు. కెమెరాపై ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్లకు తప్ప, ఒకే సన్నివేశంలో ఇండోర్, ఔట్‌డోర్ భేదాన్ని పట్టుకోవడం సాధ్యం కాదేమో. అదీ మార్కస్ బార్ట్‌లే టాలెంట్.
**
విజయచిత్రకు ఇంటర్వ్యూ కావాలని ఓసారి -మార్కస్ బార్ట్‌లేను అడిగాను. సాధారణంగా ఆయనెవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడు. నేనడిగినప్పుడు -శ్రీకృష్ణసత్య షూటింగ్ జరుగుతోంది. టిఫిన్ బ్రేక్‌లో ఇంటర్వ్యూ తీసుకోండి అన్నారు. కానీ ఇవ్వలేకపోయారు. నేను కనిపించటంతోనే -నేను మిమ్మల్ని ఉపయోగించుకోలేకపోయాను. మీ ఆఫీసు ఎక్కడుందో చెప్పండి, నేనే వస్తా’ అన్నారాయన. ‘అదేటండి.. మీరు రావడమేంటి?’ అన్నానే్నను. ‘లేదు లేదు వస్తాను’ అన్నాడాయన. అన్నట్టుగానే విజయచిత్ర ఆఫీసు ఎక్కడుందో కనుక్కుని మరీ వచ్చారు. థ్రిల్ ఫీలయ్యాను. ‘మార్కస్ బార్ట్‌లే ఏంటి.. ఇంటర్వ్యూ ఇస్తానని నా దగ్గరకు రావడమేంటి?’ వొళ్లు పొంగిపోయి ఆనందం పట్టలేకపోయాను. అప్పుడు నేను అడిగిన ప్రశ్న అదే. ‘వెనె్నలను ఎలా చిత్రీకరిస్తారు’ అని? మిగతా వాళ్ల చిత్రాల్లో మీ వెనె్నలంత డెప్త్ ఉన్నట్టనిపించదని అడిగా. అందుకాయన ‘లైటింగ్‌తోనే ఆ మూడ్ వస్తుంది’ అన్నాడు సింపుల్‌గా. కెమెరామెన్లు వారి వారి సామర్థ్యాన్ని బట్టి లైటింగ్ సెట్‌చేస్తారు అన్నారు.
పున్నమి చంద్రుడ్ని చూసి -విజయావారి చంద్రుడిలా ఉన్నాడు అనుకునేవాళ్లం చిన్నప్పుడు. చందమామను చూపించాలంటే -ఏ లెవెల్లో లైటింగ్ వేయాలి, ఎంత వేయాలనేది ఆయనకే తెలుసు. ‘ఎంత ఘాటు ప్రేమయో’ అన్న పాటలో ఫౌంటెన్ ఆనందం ఎగజిమ్మినట్టు సినిమాలో కనిపిస్తే వెర్రెత్తిపోయేవాళ్లం. చిన్నతనంలో ఎన్ని క్లాసులెగ్గొట్టి ఆ సినిమా చూశామో లెక్కేలేదు. ఆ సినిమాకు డబ్బులు కూడా అలాగే వచ్చాయి. అన్నిరకాల పన్నులూ పోయి దాదాపు 70 లక్షలు వచ్చాయని నాగిరెడ్డి రెండో కొడుకు వేణుగోపాల్‌రెడ్డి చెప్పేవారు.
జానపదాలు రూపొందించడం అందరికీ అబ్బే విద్య కాదు. అలాగే జానపదాల్లో నటించడానికి అందరు నటీనటులూ పనికిరారు. అగ్గిమీద గుగ్గిలం, మహాబలుడు, ఇద్దరు మొనగాళ్లు, శ్రీకృష్ణవిజయం, వీరాభిమన్యు, త్రిలోకసుందరి, శ్రీకృష్ణార్జున విజయం లాంటి చిత్రాల్లో నేను నటించాను. జానపదాల్లో రాణించిన వాళ్లు సాంఘికాలు సులువుగా చేసేస్తారు. కానీ సాంఘికంలో ఎంత రాణించినా -జానపదం చేయడం అంత సులువు కాదన్నది నా భావన. ఈ మాట ఎందుకు అంటున్నానంటే -ఉదాహరణకు శోభన్‌బాబును తీసుకోండి. రావుగోపాలరావునీ తీసుకోండి. శోభాన్‌బాబు కాంభోజరాజకథ అన్న ఒక్క జానపదమే చేశారు.
వంగర వెంకట సుబ్బయ్య అనే అద్భుతమైన నటుడుండేవారు. మాయాబజార్‌లో అల్లు రామలింగయ్యతోపాటు అద్భుతమైన కామెడీని చేసిన ఘనాపాటి ఆయన. ఆయనకు పురాణాలన్నీ పుక్కిటే ఉండేవి. వేదాలన్నీ చదువుకున్నారు. వేదాన్ని రివర్స్ క్రమంలోనూ అప్పజెప్పగలిగిన దిట్ట. అంత క్షుణ్ణం ఆయనకు. 1930లో వచ్చిన పల్నాటియుద్ధం చిత్రంలోనూ నటించారాయన. మేమిద్దరం కలిసి రెండు మూడు చిత్రాల్లో నటించాం. ఆయన భాష చాలా స్వచ్ఛంగా ఉండేది. మాయాబజార్‌లో ‘కూలంకష ప్రజ్ఞావంతులు’ అన్న ఒక్క మాట విరుపులోనే ఆయన టైమింగ్, నటన చూడొచ్చు. వ్యక్తిగతంగా హాస్యప్రియుడు. ‘మా ఆవిడ రోగిష్టి. నా కొడుకు కోపిష్టి. నేను పాపిష్టి’ అని తనపైతానే ఛలోక్తులు విసురుకునే గొప్ప సంస్కారమున్న వ్యక్తి ఆయన. ఓసారి ఎండలో నడుచుకుంటూ వస్తున్నారాయన. ఎక్కడినుంచండి? అని అడిగాను. ‘మన సినిమా వాళ్లకి తిరుగుళ్ళుంటాయి కదండీ’ అన్నారాయన చమత్కారంగా. తిరగాలి తిరగాలి తిరగాలి.. స్టూడియోల చుట్టూ తిరగాలి. ఆ తిరుగుళ్లలో భరణి స్టూడియో నుంచి వస్తున్నా అన్నారాయన. బ్రాహ్మణ వేషాలు ఏమీ లేవు, పొమ్మన్నారు. అయినా నేను అలాంటి పాత్రలకే పనికివస్తానాండి? అని ప్రశ్నించారాయన. పోనీ ఏవియం స్టూడియోకు వెళ్లకపోయారా? అన్నానే్నను. వెళ్లాను.. ఏవియం అంటే ‘ఏవీ ఇయ్యం’ అని పేరులోనే వుంది కదా! ఇంకేమిస్తారు? అని చమత్కరించారు. వేషాల వేటలో భాగంగా ఓసారి చక్రపాణి దగ్గరకెళ్లి వేషం అడిగారాయన. నువ్వు వేయదగ్గ వేషాలు నీ దగ్గరకే వస్తాయి. నువ్వు ఎవ్వరి దగ్గరకి రావాల్సిన అవసరం లేదు అన్నారట. అలా ఒకసారి ఏదో ఊరికి నాటకం వేయడానికి వెళ్లారాయన. తెల్లారేసరికి నాటకం అయిపోయింది. నిద్రపోయాడు. 11 గంటలకు లేచాడు. బాగా ఎండగావుంది. సరే.. స్నానం చేసి వద్దామని ఓ చెరువు వద్దకెళ్లి ఆ చల్లని నీళ్లలో మునిగాడు. బయట వేడి, చెరువులో చల్లదనం ఆయన ఒంటికి పడక వెంటనే నోరు తొస్సిపోయింది. పక్షవాతం వచ్చింది. నేను అలా ఎండలో ఆ చల్ల నీళ్లలో మునగకుండా ఉంటే బాగుండేది అని ఆయనే చెప్పేవారు. పోనీలే.. నా నోటికి ఇంక ఎవరూ భయపడక్కరలేదు అని తనమీద తానే జోక్ వేసుకునేంత గొప్ప సంస్కారి వంగర.
నల్ల రామ్మూర్తి అని ఓ అద్భుతమైన నటుడుండేవాడు. మాయాబజార్‌లో చదలవాడ కుటుంబరావుతో కలిసి హాస్యం పండించారాయన. ఆయన వాయిస్సే హాస్యంగా ఉండేది. ఓసారి ఇద్దరం షూటింగ్‌లో ఉన్నాం. నాకు షాట్ లేకపోవడంతో ఓ పక్కన కూర్చున్నా. నా దగ్గరికొచ్చాడు. ‘ఆ తీసేవాడిది తప్పు, చేసేవాడిది తప్పు’ అన్నాడు. ‘మరి చెప్పకపోయావా’ అన్నానే్నను. ‘వద్దు వద్దు మనం చెప్పకూడదు అలాంటివి. ఇక్కడ నెగ్గుకురావాలంటే లౌక్యం తెలియాలి. మనకేం తెలియనట్లుండాలి. మనం అలా చెప్పామా.. వీడెవడో అన్నీ తెలిసినవాడు. కనుక వీడుంటే మనకు ఇబ్బంది. పంపేయాలని ఆలోచిస్తారు. వేషం లేదు పొమ్మంటారు. కనుక ఎక్కడ ఎలావుండాలో అలా ఉండాలి మనం’ అని చెప్పిన మహానుభావుడు నల్ల రామ్మూర్తి.
జూనియర్ ఆర్టిస్టుల విషయంలో కొంతమంది సీనియర్లు ఎలా ఉండేవారో చెప్పే సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు రావి కొండలరావు.
డాక్టర్ రమేష్ అని ఓ నటుడుండేవాడు. జానపద సినిమా షూటింగ్ జరుగుతోంది. గిడుతూరి సూర్యం డైరెక్టర్. ఆ షాట్‌లో రాజనాల కూడా భాగం. డాక్టర్ రమేష్ ఆ సన్నివేశాన్ని సరిగా చేయలేకపోతున్నాడు. ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. అది చూస్తూ మనసులో నేనేం అనుకున్నానో, అదే జరిగింది. నేను భయపడినట్టే.. సీన్‌లోవున్న రాజనాల సర్రున లేచాడు. ‘ఇతగాడు నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను బయటికి వెళ్లిపోతా’ అనేసి వెళ్లిపోయాడు. జూనియర్ ఆర్టిస్టులు సరిగా చేయకపోతే అలాంటి ఇబ్బందులే ఉండేవి అప్పట్లో -అంటూ మధురానుభూతుల్ని నెమరేసుకున్నాడు రావి కొండలరావు.

-సరయు శేఖర్, 9676247000