సబ్ ఫీచర్

విస్సు.. ఓ ప్రేరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదుగుతున్న మొక్కను చూసి -మట్టిలో పడున్న ఓ విత్తనానికి ఆశ పుట్టిందట. -నేనూ అలా ఎదగాలనుకుంది. అంతా నన్నూ చూడాలనుకుంది. ఈ విషయం తెలీని మొక్క మాత్రం మామూలుగానే ఎదుగుతోంది. విత్తనం అంకురించింది. తలపైకెత్తి మొక్కను చూస్తూ -ఎదగడం మొదలెట్టింది. ఎత్తిన తల దించకుండా ఎదిగి ఎదిగీ చెట్టైంది.
కొన్నాళ్లకు-
తలపైకెత్తి ఎదిగిపోయిన చెట్టుకు మొక్క కనిపించటం మానేసింది. మొక్కను మించి ఎదగానన్న ఆనందంలో థాంక్స్ చెప్పడానికి చెట్టు తలదించింది. అసలక్కడ మొక్కేలేదు. ‘అదేంటి? తనను చెట్టుని చేసిన మొక్క మానవ్వాలి కదా? ఏమైంది?’ అని ఆలోచిస్తూనే.. కొన్నాళ్లకు ఆ విషయం మర్చిపోయింది.
ఇంకొన్నాళ్లకు-
ఓ మంచి ముహూర్తంలో చెట్టుకు మళ్లీ మొక్క ఎదురైంది. గుర్తుపట్టిన చెట్టు -మొక్కతో ఏం మాట్లాడివుంటుంది. మొక్కను చూసి విత్తనం చెట్టైంది. మరి -చెట్టు ఆశించినట్టు మొక్క మానైందా? లేదా? మాస్టర్ విశే్వశ్వర రావు ముచ్చట వింటే తెలుస్తుంది. మరో వారానికి సరిపడా జ్ఞాపకాలు అందించిన విశే్వశ్వర రావే ఈ వారం వెనె్నల అతిథి.
*
ఒకప్పటి బాల నటుడు -ఇప్పడున్న చాలామంది హీరోలకు ప్రేరణ. ఆ బాలనటుడికి -జయసుధ నుంచి చిరంజీవి వరకూ అప్పట్లో ఫ్యాన్‌మెయిల్. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ మాట్లాడుతూ -విశే్వశ్వరరావును ఎన్నో సినిమాల్లో చూశా. తన నటనతో నన్ను కదిలించాడు. బాలనటుడిగా ఆయన ప్రతి కదలికలో ఓ కొత్తదనం కనిపించేది. ముఖ్యంగా ‘ఇంటి గౌరవం’ సినిమా చూశాక -నేనూ నటుడిని కావాలని నిర్ణయించుకున్నా’ అన్నారు. ఆ ఇంటర్వ్యూ చదివిన విశే్వశ్వరరావు ఆనందంగా చిరంజీవి ఇంటికెళ్తే -అద్దిరిపోయే ఆహ్వానం దక్కిందట.
మొక్కను చూసి ఉబ్బితబ్బిబ్బయిన మహావృక్షం -మొక్క దశలోనే మానంతటి ‘అభినయ’ సంకల్పాన్ని సిద్ధించుకున్న నువ్వు, చెట్టయ్యాక ‘ఆహ్లాదాన్ని’ ఇవ్వనంటే ఎలా? ఎవరి ప్రేరణతోనో ఇంతయ్యావు. కానీ, నీనుంచి ప్రేరణ పొందాల్సిన నాలాంటి విత్తనాలు చాలానే ఉంటాయి. ఆ విషయం మరువద్దు’ అన్నదట. అలాగన్న మహావృక్షం -చిరంజీవి. కళాకారుడినే కాదు, తానొక ప్రేరకుడినన్న విషయం గుర్తెరిగి మళ్లీ ముఖానికి రంగేసుకున్న మొక్క -విశే్వశ్వర రావు. ఆ తరువాత చిరంజీవితో కలిసి -ముఠామేస్ర్తీ, బిగ్‌బాస్, మెకానిక్ అల్లుడు చిత్రాల్లో నటించాడు విశే్వశ్వర రావు. అలాంటి మరిన్ని జ్ఞాపకాలను వెనె్నలకు ముచ్చట్లు చేశారు.
**
‘ఎన్టీఆర్- వాణిశ్రీ నటించిన ‘నిండుహృదయాలు’ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుక విజయవాడలో జరుగుతోంది. బాణాసంచా కాలుస్తున్నారు. శబ్ద కాలుష్యాన్ని తట్టుకోలేక మేడెక్కేశాను. కానీ ఎన్టీఆర్ ఊరుకోలేదు. ‘అరె.. మన కోతేది?’ అంటూ మేడమీంచి బలవంతంగా దింపి వేడుకల్లో ముంచిలేపారు’. నాలైఫ్‌లో అది భలే తమాషా అంటూ ఎన్టీఆర్‌తోవున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు విశే్వశ్వర రావు. అదే సభలో నన్ను మాట్లాడాలంటూ ఎన్టీఆర్ పట్టుపట్టారు. ఏంమాట్లాడాలో అర్థంకాలేదు. మైకు తీసుకుని -నమో వెంకటేశ పాట గబగబా పాడేసి తుర్రుమన్నాను అంటారు విశే్వశ్వర రావు. మరోసారి -‘మా నాన్న నిర్దోషి షూటింగ్ జరుగుతోంది. సూర్యకాంతం నన్ను కొడుకులా చూసేది. ఆ సినిమాలో నేను కొడుకునే. ఓ సీన్‌లో మా అమ్మ నన్ను లాగిపెట్టి కొట్టాలి. కానీ అమ్మ కొట్టలేకపోతోంది. మా ఇద్దరిదీ ఎడమచేయి వాటం కావటంతో, నిజంగానే కొడుకునన్న భావనతో చూసేది అమ్మ. ‘కొట్టండమ్మా, పర్లేదు’ అంటున్నాడు దర్శకుడు వెనుకనుంది. అమ్మ మాత్రం కదిలిపోయింది. ‘నినె్నలా కొట్టాల్రా నాయినా. నా బంగారానివి కదూ. నేను చేత్తో ఇలా అంటాను. దెబ్బ తగిలినట్టు నువ్వు ఎక్స్‌ప్రెషన్ పెట్టరా, చాలు’ అంటూ షాట్ పూర్తి చేశారు. కడుపున పుట్టకపోయినా కొడుకులా చూసుకున్న అలాంటి దిగ్గజాలతో నటించే అవకాశమిచ్చిన భగవంతుడు గొప్పవాడు. అలాంటి మధురానుభూతులు నా మదిలో చెరిగిపోకుండా ఉన్నాయి -అంటూ భావోద్వేగానికి గురయ్యారు విశే్వశ్వర రావు.
మరోసారి అందాల రాముడు షూటింగ్ జరుగుతోంది. దేవిపట్నం గోదావరిలో సీను. నేను నీళ్లలో పడిపోతే, ఏయన్నార్ నన్ను రక్షిస్తారు, అదీ సీన్. దర్శకుడు బాపు డూప్‌ని పెడదామన్నారు. ఏయన్నార్ ‘నో’ అన్నారు. ‘వాణ్ణి నేనే వీపున పెట్టుకుని నీళ్లలోంచి రక్షించినట్టు నటిస్తా’నన్నారు. అన్నట్టే నన్ను వీపున మోస్తూ గోదావరిలో ఈత కొడుతూ వచ్చారు. గ్రేట్ డెడికేటెడ్ ఫెర్మార్మెన్స్. డూప్‌ని పెడదామని ఏయన్నార్ కూడా అనుంటే, ఎవ్వరూ కాదనేవారు కాదు. ఆ తరువాతే -ఆయనకు హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని తెలిసింది. నా మనసు విలవిల్లాడింది. ఆయన మాత్రం -‘మొత్తానికి నినె్నత్తుకున్నాకే నా లోపమేంటో తెలిసిందిరా’ అంటూ కనిపించినప్పుడల్లా అంటుండేవారు. నాకు మాత్రం గుండె పిండేసినట్టుండేది.
అల్లు రామలింగయ్యతో కలిసి నటించడం సామాన్య విషయం కాదు. రిహార్సల్స్‌లో ఒకలా ప్రాక్టీస్ చేస్తే, కెమెరా ముందుకెళ్లగానే ఆయన నుంచి ఇంప్రొవైజేషన్ టైమింగ్ బయటికొస్తుంది. కో ఆర్టిస్టులు పట్టుకోవడం అంత సులువు కాదు. నేను మాత్రం ఆయన రిహార్సల్స్‌లో ఎలా నటిస్తారో చూసి, కెమెరాముందు ఆ టైమింగ్‌ను ఎలా ఇంప్రొవైజ్ చేస్తారో ముందే ఊహించి పట్టుకునే ప్రయత్నం చేసేవాణ్ని. అలా ఇంప్రెస్ అయిన అల్లు ‘ఒరేయ్.. నా టైమింగ్‌ని నువ్వొక్కడివే పట్టావ్‌రా’ అంటుంటే మనసు గంతులేసినట్టుండేది -అంటూ హాస్యనట చక్రవర్తితో తను అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు విశే్వశ్వర రావు.
ఎన్టీఆర్ -బి సరోజాదేవి జంటగా రాజ్యం పిక్చర్స్ పతాకంపై నటి లక్ష్మీరాజ్యం రూపొందించిన ‘శకుంతల’ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ జరుగుతోంది. దుష్యంతుడికి ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతుంటే, అదే సీన్‌లోని భరతుడికి విశే్వశ్వరరావు డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్‌తో సమానంగా ఆరోజు డబ్బింగ్ చెప్పేసరికి ‘నువ్వు పులివిరా. భరతుడు పులితో ఆడితే, నువ్వు నాతో ఆడుతున్నావ్’ అంటూ ఎన్టీఆర్ వెన్నుతట్టారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, గ్లామర్ హీరో ఎంజీఆర్‌కు చదువుకునేవాళ్లంటే ఇష్టం. ఎస్‌ఎస్‌ఎల్‌సి పాసయ్యాక ఆయన ఆశీర్వాదం కోసం వెళ్లా. తనతో నటించిన బాలనటుడు ఒక్కో మెట్టెక్కుతున్నాడన్న సంతోషంతో స్వయంగా ఎంజీఆర్ స్వీట్స్ తెప్పించి అందరికీ పంచారు. అది గుర్తుకొస్తేనే ఆనందంతో పిచ్చిగంతులు వేయాలనిపిస్తుంది అంటారు విశే్వశ్వర రావు. ఎంజీఆర్‌తో ‘పులమై పిత్తన్’ చిత్రంలో నటించారు. ‘ఆ చిత్రంలో ఎంజీఆర్‌ను మామా మామా అంటూ పిలుస్తా. అది అలవాటైపోయి, చివరివరకూ ఆయన ఎక్కడ కనిపించినా మామా అనే పిలిచేవాడిని. ‘నీదిక్ తలైవణ్ణంగ్’ (నేరము-శిక్ష) చిత్రంలో ఎంజీఆర్‌తో సమానంగా నటిస్తే ఆయన ఎంతో మెచ్చుకున్నారట. ఎంగమామ చిత్రంలో శివాజీ గణేశన్‌తో కాంబినేషన్. ‘ఆ చిత్రంలో శివాజీని విపరీతంగా ఏడిపిస్తా. అదొక బ్యూటిఫుల్ రోల్’ అని గుర్తు చేసుకున్నారాయన. మెకానిక్ అల్లుడు చిత్రం షూటింగ్ జరుగుతోంది. అందులో విశే్వశ్వరరావు నటిస్తున్నారని ఏయన్నార్‌కు తెలీదు. బాలనటుడిగా వున్నపుడు కలిసి నటించారు. ఆ తరువాత కలవలేదు. కానీ మెకానిక్ అల్లుడు షూటింగ్‌లో విశే్వశ్వరరావును చూసి ఏయన్నార్ గుర్తుపట్టి.. ‘ఒరే.. దుర్యోధనా’ అంటూ సంబోధించి మరీ అక్కున చేర్చుకున్నారట. దుర్యోధనా అనేది విశే్వశ్వరరావుకు ఏయన్నార్ పెట్టిన ముద్దుపేరు. ఇక నటశేఖర్ కృష్ణతో చేయడమంటే సంతోషంగా ఉండేది. ‘ఓరకంగా ఆయన భోళాశంకరుడు. నేరము- శిక్ష చిత్రంలో రాముని బంటుని అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆ పాటలో నేనుండాలి. కానీ విస్సు చాలా బిజీ. ఓరకంగా ఆ పాటలో కనిపించే కృష్ణకుమారి, కృష్ణ, బాలయ్య లాంటివాళ్లంతా నా కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఓ షూటింగ్‌లో పాల్గొని వచ్చిన నన్ను చూసి కృష్ణ -‘నాకన్నా వీడికే ఫ్యాన్స్ ఎక్కువున్నారు’ అని కితాబిచ్చారట. ఓసారి ఎస్వీఆర్‌తో నటిస్తున్నారు. ఆయన విశే్వశ్వరరావును చూసి ‘నా చిటికెన వ్రేలంత కూడా లేవుగదరా’ అంటూ అక్కున చేర్చుకున్నారట. యస్వీఆర్ మాట విన్న దర్శకుడు మాత్రం -నటనలో మిమ్మల్ని మించినోడండి’ అనేసరికి ‘ఊ’ అంటూ యస్వీఆర్ తనదైన స్టైల్లో హూంకరించి సరదాగా నవ్వేశారు.
ఓసారి శారదా స్టూడియోలో శ్రీకృష్ణలీల తమిళ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శివకుమార్ శ్రీకృష్ణుడు. నాగేష్ వసంతకుడు. చిన్నప్పటి వసంతకుడు విస్సు. మనోరమను విస్సు ఆట పట్టించే సీను. అక్కడే వేరే ఫ్లోర్‌లోవున్న శివాజీగణేశన్ వచ్చి నన్ను చూశారు. ‘ఏంట్రా పాత్ర?’ అని అడిగారు. ‘వసంతకుడిగా మనోరమను ఏడిపించాలి’ అన్నాను. అలాకాదురా, సీన్ బాగా పండాలంటే ‘ఇలా వుండాలి’ అంటూ శివాజీనే నాకు మేకప్ చేశారు. కళ్లకింద నల్లటి చారికలుదిద్ది నటించమన్నారు. మనోరమ మీదకు దూకిన నేను, ఆమెను ఆటపట్టించే క్రమంలో కళ్లకింద వున్న నల్లటి మేకప్ అంతా ఆమెకు పూసేశాను. స్క్రీన్‌పై సీన్ అద్భుతంగా పండింది. నవ్వులు విరిశాయి. ఇదంతా శివాజీ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాపైవున్న ఇష్టంతోనే ఆయన వచ్చి అలా చేయించారు. అప్పటి నటులే కారణజన్ములు అన్పిస్తుంది -అన్నారు విశే్వశ్వర రావు.
తమిళంనుండి తెలుగులోకి అనువాదమైన అన్ని చిత్రాల్లో దాదాపుగా హాస్యనటులందరికీ విస్సునే డబ్బింగ్ చెప్పాడు. ఏడేళ్ల వయసునుంచే నాటకాలు వేసిన అనుభవం. పాట పాడగలడు కనుకే అనేక స్టేజీ ప్రోగ్రామ్స్ తమిళంలో చేశాడు. పేరడీ పాటలు ఆలపించగలడు. ఇంగ్లీష్ తెలుగు మాటలు కలిపేసి అప్పటికప్పుడు నవ్వించే పాటలను పుట్టించి పాడి నవ్వించగలడు. అలా ఏ ప్రక్రియ తీసుకున్నా ఆ ప్రక్రియలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని విశే్వశ్వరరావు అనే పేరును చిరంజీవిగా చేసుకున్నాడు. ఇదంతా పైవాడి దయ. తల్లిదండ్రుల దీవెన. ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు. నాదంటూ ఏంలేదు. భార్య, ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశా. ఓపిక ఉన్నన్నాళ్లు నటిస్తూనే వుంటా. దర్శక నిర్మాతలకు అందుబాటులోనే ఉంటున్నా’ అంటూ ముచ్చట్లు ముగించారు విశే్వశ్వర రావు. *

-సరయు శేఖర్, 9676247000