ఉత్తరాయణం

హద్దుమీరిన ఉపాధ్యాయ సత్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అంటే ఎవరు? ‘ఉత్తమ’ అనే పదానికి మంచి లేక శ్రేష్ఠమని అర్థం. ఈ పురస్కారం సాధించలేని ఉపాధ్యాయులు అసమర్థులా? ఏటా ఈ పురస్కారానికి అధికారులు తమకు తోచిన వారిని ఎంపిక చేస్తారు. అనేక మంది అసమర్థులకు సైతం ఉత్తమ ఉపాధ్యాయ బిరుదులు ఇచ్చినట్లు నిత్యం విమర్శలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలోను, రాష్టస్థ్రాయిలోను, జిల్లా స్థాయిలోను ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సత్కరించడం ఓ ప్రహసనంగా మారుతోంది. ఇవికాక కొన్ని ప్రైవేటు సంస్థల వారు కూడా ఉత్తమ ఉపాధ్యాయుల పేరిట కొందరిని ఎంపిక చేసి వారికి ‘గురుబ్రహ్మ’ అని బిరుదులు ఇస్తున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో నూరుశాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఈ అవార్డులతో సత్కరిస్తున్నారు. ఇలాంటి ప్రతిభావంతులైన వారిని ‘సున్నా శాతం’ ఫలితాలు సాధించిన పాఠశాలలకు బదిలీ చేసి, అక్కడ కూడా నూరు శాతం ఫలితాలు సాధించేలా అధికారులు చొరవ చూపొచ్చుగా!
ఉత్తమ ఉపాధ్యాయ బిరుదుల ప్రదానోత్సవంలో నగదు బహుమతులను కూడా అందజేస్తున్నారు. గతంలో మూడువేల రూపాయలున్న ఈ బహుమానాన్ని ఇప్పుడు ఇరవై వేలకు పెంచేశారట! ఇదేం పద్ధతి? సమాజాన్ని తీర్చిదిద్దే శక్తిగలవారే ఆదర్శ ఉపాధ్యాయులు. శిష్యులను శీలవంతులుగా చేయగలిగిన వారే ఉత్తమ ఉపాధ్యాయులు. నేటి సమాజంలో విస్తరిస్తున్న అనేక చెడు పోకడలు విద్యారంగాన్ని కూడా కమ్ముకున్నాయి. సినిమాలు, టీవీలు విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నాయి. విశ్వవిద్యాలయ ఆవరణలో సినీ పాటల కార్యక్రమాలు ఏమిటి? అక్కడి గురువులు ఇలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కళాశాలల ఉత్సవాలలో జుట్టు విరబోసుకుని, కురచ దుస్తులు తొడుక్కుని విద్యార్థినులు పిచ్చిగంతులు వేస్తున్నారు. ఏమిటి ఈ వైపరీత్యం? ఉత్తమ ఉపాధ్యాయ బిరుదులు పొందిన అధ్యాపకులు ఇలాటి వాటిని ఎందుకు ఖండించడం లేదు?
పదవ తరగతి పరీక్షలలో నూరు శాతం ఫలితాలు సాధించడం ప్రధానం కాదు. తమవద్ద చదువుకుంటున్న పిల్లలను నూరు శాతం శీలవంతులుగా చేయాల్సిన బాధ్యత టీచర్లదే. ఇలా జరగాలంటే ముందుగా ఉపాధ్యాయులు ఆదర్శవంతంగా ఉండాలి. నేటితరం ఉపాధ్యాయులలో ట్రేడ్ యూనియన్ మనస్తత్వం బాగా ప్రబలిపోయింది. పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునేవారికి, చదువు చెప్పే వారికి సంఘాలు ఏమిటి?
A POOR TEACHER TELLS..
AN AVERAGE TEACHER EXPLAINS..
A GOOD TEACHER ILLUSTRATES..
THE BEST TEACHER INSPIRES..
... ఈ మాటలు నిజం కావాలంటే శిక్షణ అనంతరం ప్రతి ఉపాధ్యాయుడు తన వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి. క్రమంగా బెస్ట్ టీచర్ స్థాయికి ఎదగాలి. అందుకు స్వయంకృషి చాలు. ఇలాంటి వారు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తారు. అందుకు- 1970వ దశకంలో పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఎ.కామేశ్వరం వంటి అధికారులు నిదర్శనంగా నిలుస్తారు. బోధనలో ఎంతో నైపుణ్యం కలిగిన ఆయన పదవీ విరమణ చేసిన సందర్భంగా పెనుగొండ జడ్.ఎన్.వి.ఆర్. ఉన్నత పాఠశాలలో ఒక సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన తన ప్రసంగంలో వివిధ సంస్కృత కావ్యాలలోని విశిష్ట వాక్యాలు చదివి ఉపాధ్యాయులకు అవసరమైన విషయాలు వివరించారు. ‘వృత్త్ధిర్మానికి ఉపాధ్యాయుడు కట్టుబడినపుడు ప్రజలు, విద్యార్థులు అతనిని గౌరవిస్తారు. అదే గొప్ప బిరుదు’- అని సోదాహరణంగా ఆయన వివరించారు. స్వయం కృషి వల్లనే ఉపాధ్యాయులకు మంచి బోధనా పద్ధతులు అలవడతాయని అన్నారు. ఉపాధ్యాయులు జ్ఞాన సముపార్జన చేయడం, శిష్యులను శీలవంతులుగా దిద్దడం వారి కర్తవ్యమని నొక్కివక్కాణించారు. ఇలా ఉపాధ్యాయులను చైతన్యవంతం చేసి, వారిలో స్ఫూర్తిని రగిలించే విద్యాశాఖాధికారులు నేడు ఎక్కడున్నారు? ఉపాధ్యాయులు తమ వృత్త్ధిర్మాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే బిరుదులు, సత్కారాలు వాటంతట అవే వరిస్తాయి.
మారుతున్న కాలానికి తగ్గట్టుగా నేడు విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నాయి. టీచర్లు, పెద్దల యెడల విద్యార్ధుల్లో గౌరవభావం తగ్గిపోతోంది. పిల్లల తల్లిదండ్రులు ఎంతసేపూ ర్యాంకులు, మార్కులకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప విద్యకి, శీలానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ అభిప్రాయం పూర్తిగా తొలగిపోవాలి. పతనమైపోతున్న సామాజిక వ్యవస్థను సంస్కరించడానికి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల మొదలు విశ్వవిద్యాలయ అధ్యాపకులు కృషిచేయాలి. సంఘంలో పూర్వం గురువుకు ఉన్న విశిష్ఠ స్థానాన్ని వారు పొందాలి.

- వేదుల సత్యనారాయణ