క్రీడాభూమి

బ్లాటర్, ప్లాటినీపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయమూర్తులు నాకు అన్యాయం చేశారు. నేను నిర్దోషిని. ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. ఫిఫా ట్రిబ్యునల్ నన్ను ఎనిమిది సంవత్సరాలు సస్పెండ్ చేయడం అన్యాయం. ఈ నిర్ణయంపై క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టులో ఫిటిషన్ వేస్తాను. అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది.
- సెప్ బ్లాటర్
------------------
ఫిఫా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నన్ను నిరాశ పరచింది. ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి, ఆతర్వాత విచారణ చేపట్టినట్టుగా అనుమానం కలుగుతున్నది. నేను ఎలాంటి పొరపాటు చేయలేదు. నేరాలకు పాల్పడలేదు. ఈ తీర్పుపై మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను.
- మైఖేల్ ప్లాటినీ
=========
జ్యూరిచ్, డిసెంబర్ 21: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపై వేటు పడింది. ప్లాటినీకి భారీ మొత్తాన్ని చెల్లించిన ఆరోపణను ఎదుర్కొంటున్న బ్లాటర్ ఫిఫా ట్రిబ్యునల్ ముందు హాజరై తాను నిర్దోషినని వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. నిర్ణయాన్ని ముందుగానే ఖరారు చేసుకొని విచారణ జరిపిస్తున్నారని ఆరోపిస్తూ ట్రిబ్యునల్ ముందు హాజరయ్యేందుకు నిరాకరించాడు. వివరణ ఇచ్చిన బ్లాటర్, అసలు విచారణకే హాజరుకాని ప్లాటినీపై ట్రిబ్యునల్ ఒకే రీతిలో స్పందించింది. పరస్పర ప్రయోజనాలున్న నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇద్దరినీ చెరి ఎనిమిదేళ్లు నిషేధించింది. 79 ఏళ్ల బ్లాటర్ ఈ సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకొని మళ్లీ ఫిఫాలో కీలక పాత్ర పోషించడం దాదాపు అసాధ్యం. 60 ఏళ్ల ప్లాటినీకి మాత్రం కొంతైనా అవకాశం ఉంది. ఇలావుంటే, వీరిద్దరు తమపై విధించిన సస్పెన్షన్‌ను క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టులో సవాలు చేయవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగనుండగా, రేసులో ఉన్న అభ్యర్థుల్లో హాట్ పేవరిట్‌గా ముద్ర వేయించుకున్న ప్లాటినీపై వేటు పడడం గమనార్హం. బ్లాటర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నదన్న విషయం చాలాకాలం క్రితమే స్పష్టమైంది. అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఫిఫా అధ్యక్షుడిగా అతను సరైన దిశగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. అతని ముడుపులు, ఇతర ఆరోపణలల్లో బ్లాటర్ ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి రుజువులు లేకపోయినా, అతను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వివాదం తెరపైకి రావడంతో చిక్కుల్లో పడ్డాడు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై అతనిని ఫిఫా తొలుత తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అతనితోపాటు సీనియర్ ఉపాధ్యక్షుడు, యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపైన కూడా తాత్కాలిక వేటు పడింది. అనంతరం వీరిపై ఫిఫా ఎథిక్స్ కమిటీ ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. 2011లో ప్లాటినీకి రెండు మిలియన్ డాలర్లను ఫిఫా ఖాతా నుంచి అక్రమంగా చెల్లింపులు జరిపాడన్న ఆరోపణలను బ్లాటర్ ఎదుర్కొంటున్నాడు. అయితే, తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నానని బ్లాటర్ వాదన. అంతకు ముందు దశాబ్దం క్రితం ఒక కాంట్రాక్టును ప్లాటినీ పూర్తి చేశాడని, దానికి సంబంధించిన చెల్లింపులే జరిగాయని అతను ట్రిబ్యునల్‌కు వివరించాడు. అయితే, అతను 2011లో ఫిఫా అధ్యక్ష పదవికి బ్లాటర్ పోటీ చేశాడు. అంతకు ముందు వరకూ అతని నమ్మిన బంటుగా ఉన్న ప్లాటినీ హఠాత్తుగా వేరు కుంపటి పెట్టడమేగాక, అధ్యక్షుడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. యూఫాలో తనకు ఉన్న పరపతిని ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహంతో మద్దతును కూడగట్టుకున్నాడు. ఈ పరిణామాలు బ్లాటర్‌ను ఆందోళనకు గురి చేశాయని, ప్లాటినీని రేసు నుంచి తప్పించడానికే అతను ఈ మొత్తాన్ని చెల్లించాడని ప్రాసిక్యూషన్ ఆరోపణ. బ్లాటర్ ట్రిబ్యునల్ ముందు స్వయంగా హాజరై, వాదన వినిపించాడు. అయితే, ఎథిక్స్ కమిటీ ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందని, నామమాత్రంగా విచారం జరుపుతున్నదని ఆరోపించిన ప్లాటినీ ట్రిబ్యునల్ ముందు హాజరుకాలేదు. లాయర్ ద్వారా తన వాదన వినిపించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత బ్లాటర్, ప్లాటినీపై సస్పెన్షన్ విధిస్తూ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది.
ఆధారాల్లేవు..
బ్లాటర్, ప్లాటినీ మధ్య ఒక పనికి సంబంధించిన కాంట్రాక్టు 1999 ఆగస్టులో కుదిరింది. ఆతర్వాత తనకు అప్పచెప్పిన పనిని ప్లాటినీ 2002లో పూర్తి చేశాడని బ్లాటర్ అంటున్నాడు. అయితే, తమ మధ్య కుదిరినట్టు చెప్తున్న ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్లను బ్లాటర్ సమర్పించలేదని ట్రిబ్యునల్ ప్రకటించింది. అంతేగాక, ఆధారాలను కూడా చూపలేకపోయాడని తన తీర్పులో పేర్కొంది. వీరిద్దరిపైనా ఇతరత్రా అవినీతి ఆరోపణలు ఏవీ లేవని స్పష్టం చేసింది. పరస్పర ప్రయోజనాలను కలిగించే రీతిలో భారీ మొత్తం ఫిఫా ఖాతా నుంచి ప్లాటినీ ఖాతాకు బ్లాటర్ మళ్లించాడని తెలిపింది. ఆ కేసులోనే వీరిపై సస్పెన్షన్ విధించామని చెప్పింది.
భారీ జరిమానా
నిధుల మళ్లింపు కేసులో బ్లాటర్, ప్లాటినీలపై ఫిఫా ఎథిక్స్ కమిటీ ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. బ్లాటర్‌కు 50,000 డాలర్లు, ప్లాటినీకి 80,000 డాలర్లు చొప్పున జరిమానా విధించింది.
కాగా, జరిమానాతోపాటు సస్పెన్షన్ వేటు కూడా పడడంతో ఫిఫాలో వీరిద్దరి ఆధిపత్యానికి దాదాపు తెరపడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ప్లాటినీకి దాదాపుగా చేజారిపోయింది. జనవరి 26వ తేదీలోగా నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఈలోగా క్రీడా వివాదాల మధ్యవర్తిత్వపుకోర్టు వీరి కేసును విచారణకు తీసుకొని, స్టే ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. (చిత్రం) ఒకటే కేసు.. ఒకే శిక్ష.. సెప్ బ్లాటర్, మైఖేల్ ప్లాటినీ