హైదరాబాద్

కార్మికుల కన్నీళ్లు తుడిచే పార్టీ తెదేపానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 17: కార్మికులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి వారి కన్నీళ్లు తుడుస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నామని రాజేంద్రనగర్ సర్కిల్ తెదేపా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ అన్నారు. గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తాలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆసియా ఖండంలోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలలో అతి పెద్ద పారిశ్రామికవాడ కాటేదాన్ అన్నారు. ఇందులో దేశంలోనే నలుమూలల నుంచి కార్మికులు వచ్చి ఈపరిశ్రమల్లో పని చేస్తుంటారన్నారు. అయితే ప్రమాదవశాత్తు ఎంతోమంది కార్మికులు మృతి చెందడం, గాయపడడం జరుగుతోందన్నారు. వారి పక్షాన ఎళ్లవేళలా పోరాటం చేస్తూ వారికి అందాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించేంత వరకు పోరాడుతున్నామన్నారు. పరిశ్రమ యజమానులు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ 12 గంటలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, యేడాది క్రితం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కార్మికుల పక్షాన పోరాడి పని గంటలు తగ్గించి 9 గంటలకు తగ్గించామని ఆయన గుర్తు చేశారు. కొంత మంది అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగిన సబితా ఇంద్రారెడ్డి కార్మికుల పని గంటలు తగ్గించలేకపోయారని, స్థానిక ఎమ్మెల్యే తగ్గించి చూపించారని గుర్తు చేశారు. నిత్యం పరిశ్రమల్లో తిరుగుతూ కార్మికుల పొట్టకొడుతూ కాసులు ఏరుకునే వారికి కార్మికుల కష్టాలు ఏం తెలుసని ఆయన చురకలంటించారు. నోరు పారేసుకుంటూ తన ఇమేజ్ పెంచుకోవడానికి వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇదే విధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు. స్థానికంగా ఉంటూ కార్మికులకు అండగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ను విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఏ విధంగా కేటాయించినా తిరుగులేని మెజారిటీతో రాజేంద్రనగర్ సర్కిల్లో తెదేపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సైనికునివలే పని చేసి తెదేపా చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేష్ కురుమ, మాధవరెడ్డి, సుధాకర్‌గౌడ్, కాశిగారి యాదగిరి, అడికె అర్జున్, భీమేష్‌రెడ్డి, ఉస్కెమూరి విజయ్, జగదీష్, కొండల్ ముదిరాజ్, అడికె శేఖర్, నర్సింహ్మారెడ్డి, స్వామిగౌడ్, బాలకిష్టి తదితరులు పాల్గొన్నారు.