తెలంగాణ

క‘ర్నాటకం’తో మాకు సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 8: కర్నాటక రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షోభానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, సంక్షోభానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలో పర్యటించారు. అనంతరం మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రంలో సంక్షీర్ణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్, జేడీఎస్‌ల తగవులాటలు బీజేపీకి అంటకట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ, వారిద్దరి మధ్య జరుగుతున్న రాజకీయ వ్యవహారం, పదవుల పంపకాల వ్యవహారం, పర్సంటేజీల వ్యవహారం కారణమని ఆరోపిం చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం కర్నాటక ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీయే కారణమని మాట్లాడుతున్నారని ఇది నిజం కాదన్నారు. సిద్ధరామయ్య ఓ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రులుగా ఉన్న రామలింగారెడ్డి లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడే పార్టీని వీడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందో ఆలోచించాలని హితవుపలికారు. ముఖ్యమైన విషయం మరొకటి గుర్తుంచుకోవాలని రాహుల్‌గాంధీయే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని దాంతో ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇక ప్రశ్నార్థకం అని గ్రహించిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు వివిధ రాష్ట్రాలో రాజీనామాలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే కర్నాటక ఎమ్మెల్యేలు చేసి ఉంటారని తాము భావిస్తున్నట్టు మురళీధర్‌రావు చమత్కరించారు. కాంగ్రెస్, జెడీఎస్‌ల కలయికనే ఆ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోయారని అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జెడీఎస్‌లను చిత్తుగా ఓడించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీకి ఓ సిద్ధాంతం అంటూ లేదని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలో తమకు పట్టుందని చెప్పుకుంటన్న కాంగ్రెస్ నాయకులు ఇక దక్షణాది రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ దీన పరిస్థితికి చేరుకుంటున్న విషయం మరువరాదని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర, కేరళ రాష్ట్రాలలో బీజేపీ పాగా వేయడం తథ్యమని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో సహా పార్టీ నాయకత్వం అంతా తెలంగాణ వైపు దృష్టి పెట్టామని తెలిపారు. తెలంగాణ మైదానంలో దిగామని ఇక సభ్యత్వాలతోనే ఆట మొదలుపెట్టామని మురళీధర్‌రావు వెల్లడించారు. మరో రెండేళ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ బీజేపీ చుట్ట్టూ తిరగబోతాయని, టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే శక్తులన్నీ బీజేపీ వైపు దృష్టి పెట్టి ఒక్కొక్కరుగా పార్టీలోకి వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలమైందని 2014 నుండి 18 వరకు విఫలం చెందిన ప్రజలు మాత్రం తిరిగి కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను ఇచ్చారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారికి అమ్ముడుపోతున్నారని ప్రజల్లో భావన వచ్చిందని అన్నారు.
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్మాయం బీజేపీయే అని ప్రజల్లో చర్చ వచ్చిందని ఆ దిశగా తాము అంతా పని చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ పార్టీకి కోవర్టులుగా ఉన్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా ఆరోపణలు గుప్పించుకుంటున్న విషయాలు కూడా చూస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే విధంగా పార్టీని బలీయమైన శక్తిగా తయారు చేయబోతున్నామని మురళీధర్‌రావు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు బాల్‌రాజ్, ఎగ్గని నర్సింలు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... మహబూబ్‌నగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత మురళీధర్‌రావు