తెలంగాణ

సీజనల్ వ్యాధులతో ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా ప్రబలుతున్న సీజనల్ వ్యాధులతో ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. గాంధీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సెమినార్ హాల్, లైబ్రరీలను మంత్రులు శుక్రవారం ప్రారంభించారు. ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను కలిసి మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలపై మంత్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ జనరల్ మెడిసిన్ విభాగంలో సుమారు 32లక్షల వ్యయంతో సెమినార్ హాల్, లైబ్రరీలను నిర్మించినట్లు తెలిపారు. ఈ లైబ్రరీ విద్యార్థులకు ఉపయోగార్ధం 24 గంటలు అందుబాటులో ఉంటుందని వైద్య విభాగాలకు చెందిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎలాంటి జ్వరం వచ్చినా, అది డెంగ్యూ అన్న ఆందోళన నేడు ప్రజల్లో ఎక్కువగా ఉందని, పరీక్షలు చేయించుకుని రిపోర్టు వచ్చిన తర్వాతే డెంగ్యూగా నిర్థారించుకోవాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు గతంలో వచ్చిన డెంగ్యూ వ్యాధి లక్షణాలతో చాలా వ్యత్యాసం ఉందని, ఇది ప్రమాదకరం కాదని, సకాలంలో వైద్యం అందిస్తే త్వరగా నయమవుతోందని వివరించారు. ఫీవర్ ఆసుపత్రిలో గత ఆగస్టు మాసంలో 51 వేల మంది జ్వరంతో ఔట్ పేషెంట్లుగా వచ్చారని, వారిలో కేవలం 62 మందికి మాత్రమే డెంగ్యూ లక్షణాలున్నట్లు తెలిపారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో కూడా జ్వరంతో అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని, రద్దీని తట్టుకునేందుకు, సత్వరమే వైద్య అందించేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు, అదనంగా వైద్యులను నియమించటంతో పాటు సాయంత్రం కూడా ఔట్ పేషెంటు విభాగాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. రోగుల తాకిడికి అవసరమైన సెలెన్ బాటిళ్లు, మందులను అందుబాటులో ఉంచామని వివరించారు. నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని సూచించారు. దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రబలుతున్న వ్యాధులు, ప్రభుత్వాసుపత్రుల్లో కొరవడిన సౌకర్యాలు వంటి అంశాలపై విలేఖర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెటకారంగా ‘మనిషికి బిడ్డ పుట్టక ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారా’? అంటూ సమాధామిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్, ఎస్‌ఈ సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలపతిరావు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.