ఉత్తరాయణం

రోత పుట్టిస్తున్న రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాడిందే పాడరా.. పాచిపళ్ల పాటగాడా!’ అన్నట్టుంది కాంగ్రెస్ యువరాజా రాహుల్ గాంధీ వైఖరి. రోజుకు రెండుమూడు సార్లయినా- ‘మణిపూర్, గోవాల్లో భాజపా అధికారం కాజేసింది..’ అని ఆయన చెప్పిందే చెబుతున్నాడు. ‘మీకు మెజారిటీ వుంటే ముందుగా గవర్నర్‌ని ఎందుకు కలవలేదు?’ అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు రాహుల్ ఎలాంటి జవాబు చెప్పడు. దిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో గతంలో భాజపా పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, దిల్లీలో ‘ఆప్’ సంకీర్ణానికి, ఝార్ఖండ్‌లో జెఎమ్‌ఎమ్ సంకీర్ణానికి గవర్నర్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విస్మరిస్తాడు. భలే రాహుల్.. భలే!
-డి.యోగానంద్, కొవ్వాడ
కుల రిజర్వేషన్ లోపభూయిష్టం
రాజకీయ ప్రయోజనాలకే మన దేశంలో కులపరమైన రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. కులవ్యవస్థ ఇప్పుడు కొత్తరూపు సంతరించుకుంది. ఒకప్పుడు కొన్ని కులాలే సమాజాన్ని శాసించేవి. ఇటీవలి కాలంలో రాజకీయ పరిస్థితులు, ఆర్థిక స్థోమతల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ ప్రయోజనాలు చాలామందికి దక్కాయి. ప్రతి కులంలోనూ ధనికులు, బీదలు ఉన్నారు. ఆనాటి ఒ.సి కులాలన్నీ ఈరోజు బి.సి కులాలైనాయి. రాష్ట్ర బి.సి కమిషన్ వాస్తవాలను ప్రక్కనబెట్టి, ప్రభుత్వం ఏ కులాలను బి.సి జాబితాలో చేర్చాలని ఆదేశిస్తే, ఆ విధంగానే సిఫారసు చేస్తుంది. ఇలాంటి కమిషన్లు ప్రభుత్వాల రాజకీయ ప్రయోజనాలను కాపాడవలసిందే తప్ప, వాస్తవాలను బహిర్గతం చేయవు. కులరిజర్వేషన్లు లోపభూయిష్టం. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఒ.సి కులాలను విడదీసి, కొన్నింటికి ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వేషన్ సౌకర్యం ఉన్నప్పటికీ కొన్ని కులాల్లో బీదలు అలాగే ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రతి కుటుంబానికి రిజర్వేషన్ కల్పించి ఆదుకోవాలి. ఓటు బ్యాంకు రాజకీయం తొలగిపోవాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురము
‘ఆన్‌లైన్’లో విరాళాలా?
తిరుమలేశుని దర్శనానికి, పలు సేవలకు ‘ఆన్‌లైన్’లో ముందుగా ఏర్పాట్లు చేసుకోగలగడం మంచి సౌకర్యమే. వివిధ సేవలు, అన్నదానాది సేవలకు విరాళాలను ‘ఆన్‌లైన్’లో సమర్పించడమూ ప్రతిఫలాపేక్ష లేని సేవకు దర్పణవౌతుంది. కోనేటి రాయుని కళ్ళారా గాంచి హృదయమంతా నింపుకుని, గుడి వద్ద ప్రదక్షిణ చేసి విమాన దృశ్యం గాంచి లక్ష్మీదేవిగల స్థూపానికి మొక్కి, హుండీకి ప్రదక్షిణ చేసి చేతితో తాకి, మొక్కుకున్న సొమ్ము స్వయంగా సమర్పించుకుంటే కలిగే తృప్తికి ఏదీ సాటి రాదు. ఆన్‌లైన్‌లో హుండీకి విరాళాలు సమర్పించే విధానం వల్ల నిజమైన తృప్తి కలగదు.
-వి.ఆర్.ఆర్.రాజు, హైదరాబాద్
వాస్తవాలు తెలుసుకుందాం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేషం రగిలించడం వల్లనే అక్కడ భారతీయులపై దాడులు జరుగుతున్నాయంటూ మన మీడియా విజృంభిస్తున్నది. అయితే, అక్కడి పరిస్థితులను మనం వివేకంతో అర్థం చేసుకొని వాస్తవాలను తెలుసుకోవలసి ఉంది. రిజర్వేషన్లు, భూమిపుత్రులు, జోనల్ విధానం, 370వ అధికరణాల వల్ల మన దేశంలో లక్షలాది అర్హులకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఈ అవ్యవస్థను ఎదిరించలేకున్నాం. కిక్కురుమనలేకున్నాం. కాని అమెరికాలో ఉద్యోగాలు మన హక్కు అన్నట్లు, ట్రంప్ వాటిని లాక్కుంటున్నాడంటూ విద్వేషంతో రగిలిపోతున్నాం. మీడియా యధాశక్తి విద్వేషం రగుల్చుతున్నది. ఎంత వింత!
-పవన్‌పుత్ర, కాకినాడ