ఉత్తరాయణం

గల్ఫ్ కార్మికుల వెతలు తీరవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల దయనీయ స్థితి మారడం లేదు. 2016వ సంవత్సరంలో సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్‌లోని దోహాలో ప్రవాస భారతీయ కార్మికుల శిబిరాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీక్షించి, వాటిని వెంటనే తీరుస్తానని హామీఇచ్చి రెండేళ్ళు దాటింది. ఐనా వారి ఇబ్బందులలో కించిత్తయినా మార్పు రాకపోవడం బాధాకరం. సరైన ధ్రువపత్రాలు లేకుండా తమ దేశంలో నివాసం ఉంటున్న ప్రవాసులను దేశం విడిచి వెళ్ళాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెడితే దరఖాస్తుచేసుకున్న వారిలో 90 శాతం భారతీయులు, వారిలో 60 శాతం తెలుగు రాష్ట్రాలకు చెందినవారు వుండడం ప్రభుత్వాల వైఫల్యానికి అద్దం పడుతోంది. తక్కువ చదువుతో అధిక వేతనాలు, మెరుగైన జీవనోపాధి దక్కుతుందనే ఆశతో గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు వెదుక్కుంటూ వెళ్ళిన భారతీయులు దాదాపు కోటికి పైగా ఉన్నారు. ఇందులో అధిక శాతం తెలుగువారే వుండడం, 20 లక్షల మంది కార్మికులుగా జీవిస్తూ, ఉద్యోగాలను నిలుపుకోవడానికి స్వదేశం రావడానికి నానా యాతన పడుతున్నారు. ఏజెంట్ల మోసాలతో సరైన ధ్రువపత్రాలు లేక, అయినవారికి దూరంగా ఎందరో మనోవ్యధను అనుభవిస్తున్నారు. మన దేశంలో నిరుద్యోగ యువత ఎక్కువగా వుండడంతో కొంతమంది నకిలీ ఏజెంట్లు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొన్నారు. ప్రాథమిక విద్య పూర్తికాని వారికికూడా అధిక వేతనాల ఆశ చూపించి అక్కడ సరైన ఉద్యోగాలు లేకపోయినా వారినుండి భారీ మొత్తాలలో డబ్బులు గుంజారు. పర్యాటక వీసాలు లేక బోగస్ వీసాల మీద తప్పుడు పత్రాలతో అక్కడ వీరిని విడిచి రావడం, అక్కడికి వెళ్ళాక నిజాలు తెలుసుకొని రహస్య జీవనం సాగించడం నిత్యకృత్యమైపోయింది. ఎవరైనా ప్రమాదానికి గురైతే సరైన ఇన్సూరెన్సు, సకాలంలో చికిత్స అందక వేల మంది నిర్భాగ్యుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. మన ప్రభుత్వాలు ‘దాహం వేసినపుడు బావిని తవ్వే’ చందాన మృతదేహాలను రప్పించేందుకు అప్పుడు చర్యలు మొదలుపెట్టడం, బంధువులకు మృతదేహాన్ని ఆఖరుసారిగా కళ్ళారా చూసే భాగ్యం కలగకపోవడం, ఇటువంటి ఘటనలు ఎన్నిసార్లు పునరావృత్తం అయినా ప్రభుత్వాలలో స్పందన కరవైంది. బాధిత కుటుంబాలలో ప్రభుత్వాల పట్ల అసంతృప్తి జ్వాలలను రగిలుస్తున్నాయి. రాయబార కార్యాలయంలోని అధికారులు వీరి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ సుమారుగా 24వేల మంది తెలుగువారు గల్ఫ్ జైళ్ళలోనే మగ్గుతున్నారు. వీరిని విడిపించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం దారుణం.
-సిహెచ్.కనకదుర్గ, హైదరాబాద్
డీఎస్సీలో ‘సిలబస్’ గుదిబండ
ఉపాధ్యాయ నియామకాల (డీఎస్సీ) కోసం పాలకులు, విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న పనికిమాలిన నిర్ణయాలు నిరుద్యోగులను తీవ్ర మానసికక్షోభకు గురిచేస్తున్నాయి. తాజాగా డీఎస్సీ పరీక్షకు ఎస్జీటీల పాఠ్యాంశాల (సిలబస్)ను పెంపుచేస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సుమారు అయిదు లక్షల మంది అభ్యర్థులను అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తోంది. డీఎస్సీ ప్రకటన సమయంలో ఎనిమిదవ తరగతి వరకు సిలబస్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొన్న విద్యాశాఖాధికారులు ఇప్పటికిప్పుడు 10వ తరగతి వరకు పెంచారు. దీని ప్రకారం అభ్యర్థులు పదవ తరగతి వరకు పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. ఇప్పటికే నోటిఫికేషన్‌లో ప్రకటించిన సిలబస్ భారీగానే ఉంది. దానికి మరింత సిలబస్ జోడించడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల పరిస్థితి ‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు’గా ఉంది. మరోవైపు పరీక్షలకు సమయం నలభై రోజులు మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో నోటిఫికేషన్‌లో ప్రకటించిన సిలబస్‌తోపాటు కొత్త పాఠ్యాంశాలను చదవాలంటే ‘తలప్రాణం తోక కొస్తుంది’ అనడంలో సందేహం లేదు. విద్యాశాఖ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరవైమూడు వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే కేవలం 7వేలు మాత్రమే భర్తీచేస్తుండటంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు నలభైలోపే ఎస్జీటీ పోస్టులు కేటాయించడంతో నిరుద్యోగులు రోడ్లమీదకొచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పోస్టుల సంఖ్యను పెంచి, సిలబస్ పెంపును ఉపసంహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో లక్షలాది మంది నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం వారి మనోభీష్టాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఆ రెండుసార్లూ ప్రశ్నాపత్రాల రూపకల్పనలో విశ్వసనీయత, ప్రమాణతకు తిలోదకాలిచ్చారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాల్లో తప్పులు పునరావృత్తమైతే అభ్యర్థుల తల‘రాత’లు మారిపోతాయి. కష్టపడి చదివినవారి భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది. కాబట్టి ఆన్‌లైన్ పరీక్ష విధానానికి ప్రభుత్వం స్వస్తిచెప్పాలి.
-బట్టా రామకృష్ణ, సౌత్ మోపూరు
తవ్వినకొద్దీ మరింత మురికి!
సీబీఐ ఉన్నతాధికారుల మధ్య రగిలిన వివాదం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో, సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే మరిన్ని మలుపులు, మరిన్ని మరకలు వీధినపడుతున్నాయి. తీవ్ర అవినీతి ఆరోపణలతో ఎదురెదురుగా మోహరించిన సీబీఐ సంస్థ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ ఆస్తానా తరఫున కొత్త బలాలు చేరుతున్నాయి. ఆస్తానాపై కేసు విచారణ సందర్భంగా- బదిలీకి గురైన మరో డీఐజీ సిన్హా.. కేసులో ‘పెద్ద తలకాయలు’ తలదూర్చాయంటూ సుప్రీం తలుపుతట్టడం కొత్తమలుపు. ఆ ‘పెద్ద తలకాయ’ల్లో ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ చీఫ్ పేరు, ఇంకో కేంద్ర సహాయమంత్రి పేరు ప్రముఖంగా చెప్పాడు. మరోవైపు లాలూప్రసాద్‌పై గతంలో పెట్టిన కుంభకోణం కేసు బనాయించిందే అనే మాట అలోక్ వర్మ నుండి వినవచ్చింది. కేసు నడుస్తుండగా ఇంకెన్ని సంచలనాలు థ్రిల్లర్ సినిమాల్ని తలపిస్తాయో? మరోవైపు కేంద్ర విజిలెన్స్ కమిషన్ అభిప్రాయాలకు సుప్రీం ఆదేశానుసారం అలోక్ వర్మ సీల్డ్‌కవర్లో పంపాల్సిన జవాబులు ఆ కోర్టుకన్నా ముందే లీకై, ‘వైర్’ అనే అంతర్జాల పత్రికలో ప్రజలముందుకొచ్చాయి. ఈరోజువారీ సంచలనాలు సీబీఐలో వైరివర్గాల బలాబలాల్ని, వారి వెనకనున్న పెద్ద మనుషుల్ని అంచనా వేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప మరేమీ కాదు. ఒక్కో కేసుకు సంబంధించి ఇలా కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నట్టు ఆరోపణలే కావొచ్చు, కానీ కొంతైనా వాస్తవం ఉంటుంది అనుకొంటే దర్యాప్తు సంస్థ ఎంత లోపభూయిష్టంగా, వృత్త్ధిర్మానికి దూరంగా తయారైందో అర్థవౌతుంది. అవినీతిపరులైన అధికారుల్ని శిక్షించడంతోబాటు వ్యవస్థని రక్షించుకోవాల్సిన అవసరాన్ని సుప్రీం గమనంలోకి తీసుకోవాలి.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం