ఉత్తరాయణం

కరవు భత్యం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కరవుభత్యం పెంచిన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం కూడ తమ ఉద్యోగులకు, లక్షలాది మంది పెన్షనర్లకు కూడ దాన్ని పెంచే ఆనవాయితీ కొనసాగుతూ వున్నది. గత ప్రభుత్వం పదకొండవ వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) అమలులోకి వచ్చేదాక తాత్కాలిక భృతిని 20 శాతంగా ప్రకటించి, ఆ మేరకు జీతాలు, పెన్షన్లు ఇచ్చారు. జనవరి 2018కి సంబంధించి డీఏ సైతం ఇచ్చారు. జూలై 2018 నుంచి ఇవ్వవలసిన డీఏ ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక- జనవరి 2019 డి.ఎ. జూలై 2019 డి.ఎ, గత 2018 జూలై డి.ఎ. 3 దఫాల డి.ఎ.లు ఇంతవరకు ప్రకటించలేదు. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు, పెన్షనుదారులు కొత్త ప్రభుత్వం తాత్కాలిక భృతితోపాటు అదనంగా 7% తాత్కాలిక భృతి ప్రకటించగా సంతోషపడ్డారు. నిలిచిపోయిన మూడు దఫాల డీఏ కోసం పి.ఆర్.సి.లో భాగంగా ఫిట్‌మెంట్ తప్పక ప్రకటిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. కనీసం మిగిలిన మూడుదఫాల డీఏలను దీపావళి కానుకగా ప్రకటిస్తారని త్వరలో ఫిట్‌మెంట్ కూడా ఆశాజనకంగా ప్రకటిస్తారని ఉద్యోగులు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
-డా.వి.హనుమంతరావు, గుంటూరు
ఉద్యోగ సంఘాల రాజకీయం!
కాంగ్రెస్, కమ్యూనిస్టు, భారతీయ జనతాపార్టీలకు అనుబంధంగా కార్మిక, విద్యార్థి, ప్రజాసంఘాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాని తెలంగాణలో తొలిసారిగా అధికార తెరాసకు అనుబంధ సంస్థలుగా ప్రభుత్వ గెజిటెడ్, నాన్ గెజెటెడ్ ఉద్యోగ సంఘాలు- సివిల్ సర్వీసు నిబంధనలను త్రోసిరాజని వ్యవహరించడం ప్రజలకు తెలిసివస్తోంది. ఈ రెండు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంలో చేరినా గౌరవాధ్యక్షులుగా సంఘాలను తమ అజమాయిషీలో వుంచుకోవడం గమనించవచ్చు. ఇది ఉద్యోగుల చైతన్య రాహిత్యమో, నిస్సహాయ స్థితో తెలియదు. మొన్నటివరకు వేతన సవరణ గురించి మాత్రమే కాదు, కనీసం కరువు భత్యం బకాయిపై నోరుమెదపని సంఘాల నేతలు- ఇటీవల ఆర్టీసీ సమ్మె ఆరంభం కాగానే ముఖ్యమంత్రిని కలిశారంటే వారి అనుబంధానికి సాక్ష్యం అక్కరలేదు. రాష్ట్రంలో స్థితిగతులను కేంద్రం గమనిస్తోందని కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రానికి చెందిన మంత్రి గాని, ఆఖరుకు పార్లమెంటు సభ్యులుగాని అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. పత్రికలు, సామాజిక మాధ్యమాలలో వచ్చింది నిజమే ఐతే, కనీసం శాసనసభ్యుడు కూడా కాని తెలంగాణ భాజపా అధ్యక్షుడు ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి సారించిందని అనడం తనదిగాని ధర్మమే. ప్రభుత్వానికి, పార్టీకి నడుమ వుంటే వెంట్రుక వాసి తేడా ఇలాంటి సీనియర్ నేతలకు తెలియదని అనుకోవాలా?
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
సమ్మెతో ఎవరికి నష్టం?
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు సంస్థ కార్మికులకు పోయేది ఏమీ లేదు. ఎప్పటికైనా ప్రభుత్వం, కార్మికులు ఒక అంగీకారానికి రావాల్సిందే. ఆ తర్వాత సమ్మె విరమిస్తారు. సమ్మె కొనసాగడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. గతంలో సైతం ఆర్టీసీ కార్మిక సంఘాలు పండుగ దినాలలో సమ్మెను నిర్వహించాయి. సమ్మె కాలంలో అందరికీ సరిపోయే బస్సులు వేయటం అసాధ్యం. 57వేల మంది ఆర్టీసీ కార్మికుల కోసం కోట్లమంది ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు బాగానే ఉంటారు కానీ నష్టపోయేది ప్రజలే. కార్మికుల కోర్కెలు సమంజసమైనవే కావచ్చు. కానీ సమ్మెకు ప్రజల మద్దతు ఉందనటం తప్పు. ప్రభుత్వం మొండివైఖరికి పోకుండా సమ్మె పరిష్కారానికి కృషిచేయాలి. సమంజసమైన కోర్కెలు తీర్చాలి.
-ఎ.ఆర్.రామారావు, ఖమ్మం
దేశభాషగా సంస్కృతం
మన విస్తృత భారతావని అనేక భాషల నిలయమై ఉన్నప్పటికీ పురాణ భాషగా, శాస్ర్తియ భాషగా, వేదభాషగా, దేవనాగరి భాషగా కీర్తింపబడిన సంస్కృతం దేశభాషగా శతాబ్దాలుగా చెలామణి అయింది. దాదాపు అన్ని భారతీయ భాషలు సంస్కృతం నుండి ఉద్భవించినవే. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఏలుతున్నప్పుడు వారికి ఆంగ్లభాషను బోధించి గుమాస్తాలుగా సేవలందించడానికి బ్రిటిష్ అధికారి టి.బి.మెకాలే ఇచ్చిన నివేదికను (1835) అనుసరించి అన్ని విద్యాసంస్థలలోనూ సంస్కృతాన్ని నిషేధించి ఆంగ్లభాషను ప్రవేశపెట్టారు. ఆనాటి సంఘసంస్కర్తలు, విద్యావంతులు- రాజారామ్మోహన్‌రాయ్ లాంటివారు ఈ మార్పుకు సమ్మతించారు. వ్యతిరేకించి ఉన్నట్లయితే దేశభాషగా సంస్కృతం పరిఢవిల్లి ఉండేది. ఆంగ్లభాష నేడు ప్రపంచ భాషగా వెలుగుతున్నప్పటికీ రష్యా, జర్మని, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల వారు మాతృభాషకే అధిక ప్రాధాన్యమిచ్చారు, ఇస్తున్నారు. ఈ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కావా? భారతీయ భాషలకు తల్లిభాషయిన సంస్కృతాన్ని అన్ని విద్యాలయాల్లోనూ తప్పనిసరి చేయాలి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయాలి. కొంత కాలానికయినా దేశభాషగా మరలా సంస్కృతం వికసించాలి.
-ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్