ఉత్తరాయణం

అధికారులకు అన్నీ తెలుసు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం రాత్రికి రాత్రి కట్టినది కాదు. కేవలం 260 చదరపు అడుగుల స్థలంలో ఇంత భారీ భవనం నిర్మిస్తున్నట్లు ఆ ప్రాంతంలో ఆస్తిపన్ను వసూలు చేసే జిహెచ్‌ఎంసి అధికారులకు, నల్లా కనెక్షన్లు ఇచ్చే ఉద్యోగులకు తెలియనిది కాదు. ఈ అధికారులెవరూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయనందునే ఏడంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించారన్నది జగమెరిగిన సత్యం. అక్రమ కట్టడాలు కూలిపోవడంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్న విషాద సంఘటనలు నగరంలో చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ దుర్ఘటనలకు కారణం. విధి నిర్వహణలో విఫలమైన అధికారులను, బాధ్యత మరచిన కార్పొరేటర్లను శిక్షించకుండా కేవలం బిల్డర్‌ను దండిస్తే సరిపోదు. బాధ్యత మరచిన అధికారుల జాబితాను ప్రకటించి, వారి అక్రమ సంపాదనపై విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలి. అవినీతి, అక్రమ కట్టడాలకు ప్రజాప్రతినిధులు అండగా ఉన్నంత కాలం అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు కూడా అదే బాటలో పయనిస్తారు. అన్ని స్థాయిల్లో ఇలాంటి వారిని కట్టడి చేస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదు.
- డా. టి.హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

మతం పేరుతో తాయిలాలు
మతం పేరిట రిజర్వేషన్లు కల్పించేందుకు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం. లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ జాతి సమైక్యతను విచ్ఛిన్నం చేస్తూ మన నేతలు మైనారిటీ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ప్రార్ధనా మందిరాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం సబబా? లౌకిక వాదం అంటే ఇదేనా? ప్రజలు ఇటువంటి రాజకీయ నాయకులను గుర్తించి వారిని దూరంగా వుంచాల్సిన అవసరం ఉంది. జాతి సమైక్యత కోసం పాటుపడే నాయకులకు జనం మద్దతు ఇస్తేనే దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.
- మాచవరం రాంబాబు, కందుకూరు

అయ్యప్ప భక్తుల అవస్థలు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ, రైల్వేశాఖలు ఘోరంగా విఫలమవుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే డిసెంబర్, జనవరి నెలల్లో రవాణా సౌకర్యాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. అయ్యప్ప దర్శనం కోసం వెళుతున్న తెలుగు రాష్ట్రాల భక్తులు ప్రమాదకరమని తెలిసినా ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఆర్టీసీ యాజమాన్యం రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో విఫలమవుతోంది. ప్రైవేటు వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ అయ్యప్ప భక్తులు మరణిస్తున్న సంఘటనలు ఏటా జరుగుతున్నాయి. ఇకనైనా శబరిమలకు రవాణా సౌకర్యాలను పెంచేందుకు రైల్వే, ఆర్టీసీ యాజమాన్యాలు చొరవ చూపాలి.
- గోదూరు అశోక్, గోధూర్

సామాజిక బాధ్యత లేదా?
నేటి సినిమాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మాచరణ వంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రపంచమంతా భారతీయతను ముక్తకంఠంతో శ్లాఘిస్తుంటే మన దర్శకులు, రచయితలు, నిర్మాతలు భారతీయతను ఖూనీచేసేలా సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకులకు ఇలాంటివే కావాలంటూ తప్పుడు ప్రకటనలతో తప్పించుకోజూస్తున్నారు. గతంలో దర్శక, నిర్మాతలకు సామాజిక బాధ్యత వుండేది. సినిమా ప్రభావం సమాజంపై ఎక్కువే వుంటుంది గనుక ఏదో ఒక సందేశం చెప్పాలనే తపన వుండేది. కమర్షియల్ విలువలు కూడా హద్దుమీరకుండా చూసుకునేవారు. నేడు కొందరు హాస్యచిత్రాల ముసుగులో బూతుచిత్రాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులే తిరస్కరించి సినీ నిర్మాతలు, దర్శకులకు గుణపాఠం చెప్పాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

‘కార్పొరేట్’కు దాసోహం
నేడు సర్వత్రా ‘కార్పొరేట్’ హవా కొనసాగుతోంది. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, కార్యాలయాలు కేవలం ధన దాహంతో నడుస్తున్నాయి. వీరికి రాజకీయ నాయకుల ప్రోత్సాహం వుంది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ వర్గాలు విరాళాలు ఇస్తుంటాయి. పేదవారి నుంచి భారీగా ధనాన్ని వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ అజమాయిషీలో విద్య, వైద్యం వంటి సౌకర్యాలు పేదలకు అందడం లేదు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా వంటి రంగాల్లో కార్పొరేట్ సంస్థలను పూర్తిగా నిషేధించాలి.
- కె.శశిధర్, విశాఖపట్నం