ఉత్తరాయణం

ఉద్యోగాలన్నీ కన్నడిగులకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్న పరిశ్రమల్లో ఉద్యోగాలన్నీ నూటికి నూరు శాతం కన్నడిగులకే ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం చట్టం చేయబోతోందన్న వార్త చూశాక మనం ఉన్నది భారతదేశంలోనా? లేక విదేశంలోనా? అని ప్రతి పౌరుడికీ సందేహం కలగటం సహజం. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ మినహా మిగిలిన అన్ని ప్రైవేటు రంగ సంస్థలకూ ఈ నిబంధన వర్తిస్తుందట. ఈ ఆదేశాలు అమలులోకి వస్తే పరిశ్రమలన్నీ తమ కంపెనీల్లో ఎంతమంది కన్నడిగులకు ఉద్యోగాలు ఇస్తున్నాయో ప్రభుత్వానికి నివేదించాల్సి వుంటుంది. నూరు శాతం ఉద్యోగాలను కన్నడిగులకు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆయా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను రద్దు చేస్తుందట! ఈ మేరకు ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ రూల్స్‌కి సవరణ చేయాలని భావిస్తోందిట. నూటికి నూరు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ చట్టం చేయవద్దని కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కోరుతోంది. రాయితీల్లో కోతలకు బదులుగా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చినవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటిస్తే బాగుంటుందని సూచించింది. నిజంగా ఈ పద్ధతి అమలుపరిస్తే కర్నాటకకు కేంద్రం ఇచ్చే అన్ని రాయితీలను తక్షణం ఆపేయాలి. దీనిపై వెంటనే ప్రధాని మోదీ స్పందించకపోతే దేశ ప్రగతికి అవరోధం కలగక తప్పదు. ఈ పద్ధతిని అన్ని రాష్ట్రాలూ అమలుపరిస్తే, నియంతల పాలన మొదలవటం ఎంతో దూరం లేదు.
-చామర్తి వెంకట రామకృష్ణ, హైదరాబాద్

రాజకీయ అపరిపక్వత
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్నట్టు ఉంది సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ వైఖరి. ఆయన తాజాగా ట్విట్టర్‌లో ఉంచిన మూడు ట్వీట్లలోనూ రాజకీయ అపరిపకత్వక, విచక్షణా లోపం కనిపిస్తున్నాయి. పైగా భాజపాపై ఆయన ద్వేషం కూడా కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి ఎవరినీ కలవకుండానే దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు భాజపా కారణం అని పవన్ ఏకపక్షంగా నిర్ణయించేశాడు. సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శనపై సుప్రీంకోర్టు తీర్పు చెబితే కేంద్రం భాజపా భావజాలం వ్యాప్తి చేస్తున్నదంటాడు. అరకొర జ్ఞానంతో మాట్లాడితే ప్రజల్లో పవన్ పలుచబడిపోతాడు.
-సోనాలి, సూర్యారావుపేట (తూ.గో)

శభాష్.. నితీష్
అధికారంలోకి వచ్చిన నెలరోజులకే సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడమే కాకుండా, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కృషిచేస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అభినందనీయుడు. మద్యపాన నిషేధం ఇప్పటికే పలు రాష్ట్రాలలో విఫలమైనా, వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతామని తెలిసినా స్థిరచిత్తంతో ముందుకు దూసుకుపోతున్న నితీష్‌కు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవాల్సిన అవసరం వుంది. మద్యపానం వల్ల వివిధ సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయని అందరికీ తెలిసిందే. ఓట్ల కోసం ప్రజాకర్షక పథకాలతో తాయిలాలు ఎరవేసే పార్టీలు, ప్రభుత్వాలు మద్యపాన నిషేధాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం అసాధ్యం. ‘ప్రజలు ఏమైపోతేనేం? మా ఆదాయం మాకు కావాలి’ అనే దృక్పథమే చాలామంది నేతల్లో ఉంటోంది. వీరందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్న నితీష్ కుమార్ తపన ఇతర సిఎంలకు స్ఫూర్తి కావాలి.
-సిహెచ్.సాయి ఋత్విక్, నల్లగొండ

‘శాక్సు’ ఉద్యోగుల్ని కాపాడండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (శాక్సు)లో సుమారు 1800 మంది ఉద్యోగులు వారి భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2014, 2015 సంవత్సరాలకు సంబంధించి బకాయిలు చెల్లించాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిధులిచ్చినా ‘శాక్సు’ అధికారులు స్పందించడం లేదు. ఎ.పి శాక్స్ అయితే 2016 సంవత్సరానికి 5 శాతం ఇంక్రిమెంట్లు ఇచ్చి 2014, 2015 ఎరియర్స్ అంశం ప్రస్తావించనే లేదు. కొన్ని అంశాల్లో ప్రభుత్వం తన సొంత ఆలోచనల్ని రుద్దే ప్రయత్నాలూ లేకపోలేదు. ఉద్యోగుల్ని ‘విభజించు పాలించు’ చందాన రెండు సంఘాల ఏర్పాటుకు బీజాలు వేశారు. రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలన్న డిమాండ్లున్నా, సమాన పనికి సమాన వేతనమన్న సుప్రీం కోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు.
-టి.సురేష్‌కుమార్, శ్రీకాకుళం

బ్యాంకులకూ పాకిన అవినీతి
ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖల్లో అవినీతి పేరుకుపోగా ఇపుడు జాతీయ బ్యాంకులు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత బడాబాబుల వద్దకు 2 వేల రూపాయల కరెన్సీ కట్టలు కట్టలు చేరిపోవడం వెనుక కొందరు బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది బ్యాంకు అధికారులపై కేసులు నమోదవుతున్నట్టు రోజూ వార్తలు వస్తున్నాయి. నల్లకుబేరులతో బ్యాంకు అధికారులు చేతులు కలపడం వల్లే నగదుకు కొరత ఏర్పడింది. ఈ పరిణామాలతో ప్రజల్లో బ్యాంకుల పట్ల విశ్వసనీయత తగ్గుతోంది. భారీ క్యూలలో జనం ఇబ్బందులు పడుతున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోక పోవడం దారుణం.
-వి.బాలకేశవులు, గిద్దలూరు