ఉత్తరాయణం

సామాన్య భక్తులంటే పట్టని టిటిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపన్నులకే సకల సౌకర్యాలు కల్పిస్తూ సామాన్యభక్తుల పట్ల ఉదాసీన వైఖరిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదర్శిస్తోంది. దైవ దర్శనం, సత్రాలు, ఇతర సౌకర్యాల విషయంలో సాధారణ భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ సామాన్య భక్తుల నుంచి కూడా అధిక మొత్తంలో ఆదాయం వస్తున్నా, ఆలయ అధికారులు సంపన్నవర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలయంలో ఉన్నతాధికారులను సైతం ఇక్కడి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక్క ఉచిత భోజనంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ సామాన్య భక్తులు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. పేద, మధ్యతరగతి వారికి ఇచ్చే కాటేజీలు అసౌకర్యాలకు అద్దం పడుతున్నాయి. వసతి దొరకడం, క్యూలో పడిగాపులు, లడ్డూ ప్రసాదం.. ఇలా అన్ని చోట్లా సాధారణ భక్తులు చాలాకాలంగా అవస్థలు పడుతున్నారు. వీరికి కేటాయించే గదుల్లో నల్లులు, బొద్దింకలు, పురుగులు చేరుతున్నాయి. శిధిలమైన కాటేజీలను పేదలకు కేటాయిస్తూ, సంపన్నులకు మాత్రం విలాసవంతమైన ఏసీ గదులు ఇస్తున్నారు. ఆలయ పరిసరాల్లో వ్యాపారుల దోపిడీ వర్ణణాతీతం. కొండపైన, కింద వ్యాపారులు అధిక ధరలకు ఆహారం, ఇతర వస్తువులు విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా టిటిడి అధికారుల అజమాయిషీ లేదు. పాలకమండలి సభ్యులు వివిఐపిల సేవలో తరిస్తున్నారే తప్ప సామాన్యుల బాధలను పట్టించుకోవడం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో దేవుడు ‘కొందరివాడు’ కావడం బాధాకరం. టిటిడి పాలనావ్యవస్థను ఇకనైనా ప్రక్షాళన చేసి, సాధారణ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
- నాగరాజ ఎస్, పుంగనూరు
కమ్యూనిస్టుల కువిమర్శలు
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారు అడ్రస్ ఇక గల్లంతేనంటూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం. మన దేశంలో కేరళ, కొంతవరకూ పశ్చిమబంగ, త్రిపుర రాష్ట్రాలలో తప్ప మరెక్కడా సిపిఐకి ఏ శాసనసభలోనూ నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా లేదు. 1925లో కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో ఆవిర్భవించినా, ఇంతవరకూ ఏ ఎన్నికలలో కూడా- వామపక్ష పార్టీలన్నింటికీ కలిపి 3 నుంచి 5 శాతం కన్నా ఓట్లు రావడం లేదు. ఎన్‌డిఎలో ప్రధాన పక్షమైన భారతీయ జనతాపార్టీ మాత్రం అంచెలంచెలుగా ఎదిగి ఇపుడు చాలా రాష్ట్రాలలో, కేంద్రంలో పాలిస్తున్నది. తమ పట్ల ప్రజలకు ఎందుకు విశ్వాసం లేదో, ఏడెనిమిది పార్టీలుగా ఎందుకు చీలిపోయామోనని సిపిఐ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం ఉత్తమం. పత్రికా ప్రకటనలకు పరిమితమైన కమ్యూనిస్టులు బిజెపి మీద, ఎన్‌డిఎ మీద కువిమర్శలు చేయడం అనుచితం.
- త్రిపురనేని హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్
సత్తుపల్లి జిల్లా వద్దు
ఖమ్మం జిల్లాను మరోసారి విభజించి సత్తుపల్లి కేంద్రంగా ఇంకో జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇపుడు తెరపైకి వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు ఈ దిశగా ఉద్యమాన్ని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లాను విడగొట్టి ‘్భద్రాద్రి కొత్తగూడెం’ జిల్లాను ఏర్పాటు చేశారు. వైశాల్యం తక్కువగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాను రెండు ముక్కలు చేశారు. ఇది చాలదన్నట్లు సత్తుపల్లిని జిల్లా చేయాలంటూ ఆ ప్రాంత నేతలు ప్రయత్నించడం సరికాదు. అధికార పార్టీ నాయకులు ఒకరిని చూసి మరొకరు కొత్త మండలాలు, జిల్లాలు, డివిజన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ కారణంగానే తెలంగాణలో జిల్లాల సంఖ్య ఎకాఎకిన పది నుంచి 31కి చేరింది. ప్రజల అవసరాల రీత్యా తప్ప, రాజకీయ కోణంలో జిల్లాలను ఏర్పాటు చేయడం తగదు. సత్తుపల్లిని జిల్లా చేస్తే ఖమ్మం జిల్లా మరింత చిన్నదైపోయే ప్రమాదం ఉంది.
- ఎఆర్‌ఆర్‌ఆర్ గౌడ్, ఖమ్మం
కోర్టు ధిక్కరణ కాదా?
మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని 1980లో మద్రాసు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇందుకు విరుద్ధంగా నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ, ఎపి సిఎంలు ఇప్పటికే వాగ్దానాలు చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాల్లో కులాలు లేవని, హిందూ మతం నుంచి ఆ రెండు మతాల్లోకి వెళితే కూడా కులం ఉండదని హైకోర్టు తీర్పు సారాంశం. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు చెల్లవు. భారత రాజ్యాంగం అంగీకరించదని తెలిసినా ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్లంటూ ఇద్దరు ‘చంద్రులు’ తాయిలాలు ప్రకటించడం కోర్టు ధిక్కారణ కాదా? రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించే ప్రభుత్వాలను రద్దు చేసి, రాజ్యాంగాన్ని కాపాడేందుకు గవర్నర్, రాష్టప్రతి చొరవ చూపాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం