ఉత్తరాయణం

అలవికాని ‘వృద్ధి’ లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఆవిడ విసుక్కొంటూ చేసిన జీడిపాకమైనా కొరుకుడు పడుతుందేమో కానీ ఈ జీడీపి లెక్కల హెచ్చుతగ్గులు మాత్రం అర్థం కావడం లేదు. తాజాగా మూడో త్రైమాసికంలో (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు) మన దేశం జీడీపి 7 శాతంగా నమోదైనట్టు అధికారిక వర్గాల వార్త. నోట్ల రద్దుని అధిగమిస్తూ జీడీపి వృద్ధిని సాధించడం తీపికబురు అనడంలో సందేహం లేదు. అయితే, ఆ వార్త ఆనందంతోపాటు అనుమానాల్ని కూడా మోసుకొచ్చింది. ముఖ్యంగా ఈమధ్యనే అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత్ జీడీపీ 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ, వృద్ధి రేటు పరుగులు పెట్టడాన్ని సందేహించడానికి కారణాలివి. నోట్ల రద్దు ద్వారా నవంబర్‌లో ఎనభై ఆరు శాతం కరెన్సీ చెల్లకుండా పోయింది. ఆ రెండు నెలలూ దేశంలో దాదాపు ఆర్థిక ఎమర్జన్సీ పరిస్థితి కనిపించింది. మార్కెట్, సినిమా హాళ్లు దాదాపు నిర్మానుష్యం. చిన్న చిన్న పరిశ్రమలు, ఉపాధి రంగం, నిర్మాణ రంగం మూతబడ్డాయి. నగదుమీద ఆధారపడ్డ లావాదేవీలు స్తంభించగా, బ్యాంకులు, ఏటిఎంల ముందు ముందు ప్రజలు పడిగాపులు పడి, పనిగంటలు కూడా వేలాదిగా నాశనమయ్యాయి. సాక్షాత్తూ ప్రధాని మోదీ చెప్పారు- ‘కలత చెందకండి.. కలకాలం కష్టములుండబోవంటూ’. అంటే అది అంత గడ్డుకాలం. మరి ఆ కాలానికి సంబంధించి వృద్ధి రేటు పరుగులు తీసిందంటే నమ్మశక్యంగా లేదు. ముఖ్యంగా జీడిపి పెరగడానికి వ్యవసాయం, గనుల రంగాలతోపాటు ప్రభుత్వ వ్యయం, ప్రయివేట్ వ్యయం (స్పెండింగ్)లో గణనీయ వృద్ధి నమోదు కావడం అంటున్నారు. మొదటి మూడు కారణాలతో విభేదాలు లేవు. ఎటొచ్చీ ప్రయివేట్ స్పెండింగు.. అర్థం కావడం లేదు. ఆ సమయంలో ప్రజలు చేసిన వ్యయం తగ్గినట్టు క్షేత్రస్థాయిలో కనబడింది. మరి స్థూలంగా చూస్తే భిన్నంగా ఎలా ఉంది? ఎన్నడూ లేనంతగా వివిధ పన్నులు వసూలైనట్టుగానే, పాత నోట్లు వదిలించుకునే భాగంగా వ్యయం కూడా పెరిగిందా? ఏమైనా నోట్ల రద్దువల్ల నకిలీ డబ్బు,నల్లధనంపై ఎంతమాత్రమూ ప్రభావం లేదంటున్న నిరాశావాదుల్ని ఎలా నమ్మలేమో, జీడీపీపై కూడా ఏ ప్రభావామూ లేదన్న అత్యాశావాదుల్ని కూడా అలానే నమ్మలేం. ఒకవేళ అంత పెద్ద నిర్ణయం ఏ ప్రభావమూ చూపించలేదంటే మన ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టమైనదైనా కావాలి లేదా వేసిన లెక్కలు వాస్తవదూరమైనా కావాలి. ఆ నిజాలు నిక్కచ్చిగా తెలిసిననాడే నిజమైన వేడుక.
-డా. డివిజి శంకరరావు, పార్వతీపురం
ఇదేనా ప్రజాస్వామ్యం?
శిక్షపడ్డ నేరగాళ్లు పదేళ్లవరకూ ఎన్నికల్లో పాల్గొనకుండా ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం అని అందరూ శ్లాఘించారు. కానీ, ఇప్పుడేమయింది? పదేళ్ళ అనర్హత జైల్లో వున్న శశికళ తన భృత్యుడ్ని తమిళనాడులో సిఎం చేసి, తానే జైలునుంచి రాష్ట్రాన్ని పాలిస్తోంది. జయలలిత గతంలో తన ఇంట్లోంచి తగిలేసిన ‘మన్నార్‌గుడి మాఫియా’ నాయకులు ఇప్పుడు పాలనలో కీలక వ్యక్తులయ్యారు. జల్లికట్టు వ్యవహారంలో సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షకులుగా విజృంభించిన తమిళ యువత ఇప్పుడు వౌనం వహించడం సరికాదు. అక్రమాస్తుల కేసులో దోషులుగా తేలిన అమ్మ, చిన్నమ్మల పాదసేవే తమ సంస్కృతి, సంప్రదాయం అన్నట్టు తమిళ యువత మిన్నకుండిపోవడం ఆశ్చర్యమే. అహా! ప్రజాస్వామ్యమా?
-శాండో ప్రచండ్, కాకినాడ
సీరియళ్లతో నిత్యహింస!
ఎడతెగని సీరియళ్లను ప్రసారం చేయడంలో టీవీ చానళ్లు పోటీపడుతున్నాయి. వీక్షకులకు ఆసక్తి, ఉత్కంఠ కలిగించడం కోసం అర్థం పర్థం లేని అసహజ కథాగమనంతో విపరీతమైన సాగతీత ధోరణులతో సహనానికి పరీక్ష పెడుతూ ఈ సీరియళ్లు మానసిక దౌర్భాల్యానికి కారణమవుతున్నాయి. సీరియల్స్ చూసేది ఎక్కువగా మహిళా ప్రేక్షకులే కనుక ఎలాంటి లాజిక్కులు అక్కర్లేదని అనుకుంటున్నారని అనిపిస్తుంది. పురుష పాత్రలకి వ్యక్తిత్వమనేది లేకుండా స్ర్తి పాత్రలతో నడిపిస్తున్నారు. కథానాయిక పాత్రను అతి సౌమ్యంగానూ, ప్రతినాయిక పాత్రను అతిక్రూరంగా, హింసాత్మకంగానూ చిత్రీకరించి సంవత్సరాల తరబడి కొనసాగిస్తున్నారు. తల్లులుగా కనిపించే స్ర్తి పాత్రలకు మెడలో తాళిబొట్టు లేకపోవడం, భర్తలను పేరుపెట్టి పిలుస్తూ కించపరుస్తూ మాట్లాడడం, భారీగా నగల అలంకరణ, ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి తరానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థం కావడం లేదు. మహిళల భద్రత కోసం గృహహింస చట్టం వంటివి ఉన్నా, ఈ సీరియళ్ల ద్వారా కలిగే మానసిక హింసని ఆపడానికి ఏ చట్టమూ లేదు.
- తాళ్ళూరి మణి, కాకినాడ