ఉత్తరాయణం

పెళ్లిఖర్చుపై ఆంక్షలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి ఖర్చు ఐదు లక్షలు దాటితే అందులో పదిశాతం మొత్తాన్ని ప్రభుత్వానికి సమర్పించుకోవాలన్న చట్టం రాబోతున్నదని వార్తలొచ్చాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్లు కన్యాదాత గృహంలో జరగడం లేదు వెనకటి మాదిరిగా. కల్యాణ మండపం బుక్ చేయాలి. బంధువులు, అయినవాళ్లు కూడా- ‘మా అబ్బాయికి అమెరికాలో జాబ్. వాడి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వస్తారు. పెళ్లి గ్రాండ్‌గా చేయాలి. మా అమ్మాయి పెళ్లి అలాగే చేశాం. ఒక్కగానొక్క కొడుకు. ఇదే మా ఇంట్లో ఆఖరు పెళ్లి..’ అంటూ నిర్మొహమాటంగా రావాల్సినవి అడిగి తీసుకుంటున్నారు. బంగారం ధర ఎంత వుందో తెలియని విషయం కాదు. ఎన్నాళ్లని పిల్లని ఇంట్లో పెట్టుకుంటాం. ఈడు మించిపోతే కష్టం అని పొలం పుట్ర అమ్మో, చక్రవడ్డీకి అప్పుతీసుకునో శుభకార్యం గట్టెక్కితే అంతే చాలని మధ్యతరగతి కుటుంబాలు భావిస్తున్నాయి. ఖర్చుపెట్టిన దాని మీద టాక్స్ చెల్లించమనడం గోరు చుట్టుపై రోకటి పోటువంటిది. ఇన్‌టాక్స్ అనకుండా ఇదో రకం బాదుడా? ఇక్కడా ట్రంప్ ప్రభుత్వం లాగా వుంది.
-బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ

భారతీయుల భద్రతకు కృషి చేయాలి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల అక్కడ ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన మన దేశ పౌరులకు ఇప్పుడు భద్రత కరువైందనేది స్పష్టం. భారతీయ నిపుణుల వల్లనే అమెరికా ఎంతో అభివృద్ధి చెందింది. శాంతికాముకులైన మనవారిని కొందరు దుర్మార్గులు కాల్చి చంపడం ఘోరం. తెలుగువాడైన కూచిభొట్ల శ్రీనివాస్‌ను దేశం విడిచిపొమ్మని కాల్చి చంపడం అక్కడ ఉంటున్న మన వారికి, ఇక్కడి మనకు మిక్కిలి ఆందోళన కలిగిస్తున్న అంశం. కేంద్రం తక్షణం అమెరికాలోని భారతీయుల క్షేమం కోసం ట్రంప్ ప్రభుత్వంతో సంప్రదించి సమస్య పరిష్కరించాలి.
-గర్నేపూడి రత్నాకరరావు, హనుమకొండ

తెలుగు భాషాభివృద్ధికి నిధులివ్వండి
ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తెలుగు భాషాభివృద్ధికి హెచ్చు నిధులను కేటాయించాలి. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో తెలుగు భాషాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సిఎం చంద్రబాబు స్పష్టం చేయడం ముదావహం. తెలుగు భాషా వికాసం కోసం సదస్సులు పెద్దఎత్తున నిర్వహించాలి. అధికార భాషా సంఘాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయి అధికార భాషా సంఘాలను పటిష్టం చేయడమే కాకుండా మండల స్థాయిలో సైతం భాషా సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే తప్ప తెలుగు భాషకు మనుగడ కష్టం. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని తెలుగు భాషాభివృద్ధికి కృషి సాగించాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు

హత్యారాజకీయాలు వద్దు
కేరళలో గత పదేళ్లుగా సాగుతున్న హత్యా రాజకీయాలు మళ్లీ పెరగడం బాధాకరం. కేరళలోని కన్నూరుజిల్లాలోనే పదుల సంఖ్యలో సంఘ పరివార్ కార్యకర్తలను చంపివేయడం దారుణమైన విషయం. తాడిత, పీడిత, దళితుల పక్షాన నిలబడతామనే సిపిఎం నేడు అదే సామాజిక వర్గాలకు చెందిన అనేకమందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. మనుషులను చంపడమే మానవతా సిద్ధాంతమా! కమ్యూనిజం లక్ష్యమే మనుషుల నిర్మూలనయా? సాధారణ పౌరుల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేరళ ప్రభుత్వంపై చర్యలేవీ? ఏ మీడియా దీని గురించి మాట్లాడట్లేదు? ఏ పౌరహక్కుల సంఘాల నేతలు ఎందుకు నోరు విప్పట్లేదు? ఏ సెక్యులరిస్టులు అవార్డులు వెనక్కి తిరిగి ఇవ్వట్లేదు? ఏ మేధావులు సామాజికవేత్తలు గొంతు ఎత్తట్లేదు? సిద్ధాంతపరమైన సంఘర్షణ ఉండవచ్చును గానీ పరస్పరం దాడులతో ఒరిగేదేమీ లేదనే విషయం గ్రహించాలి. కేరళ ప్రభుత్వం హత్యా రాజకీయాలు మాని ప్రజాసంక్షేమంపై దృష్టిపెట్టాలి. నిరాశ్రయ కుటుంబాలకు ఆశ్రయం, ఆర్ధిక సహాయం అందించాలి.
-సామల కిరణ్, జూలపల్లి