ఉత్తరాయణం

జాత్యహంకారం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో గతంలోనూ భారత సంతతికి చెందినవారిని ఏదో ఒక మిషతో కాల్చి చంపిన సంఘటనలు జరిగాయి. తన కారు మరో కారుకు తగిలిందనో, ఓ యువతిని రక్షించే క్రమంలో జరిగిన వివాదంలో వరంగల్‌కు చెందిన ఓ ఇంజనీర్‌ను అమెరికన్ పౌరుడు కాల్చి చంపాడు. ఇటీవల ఓ క్లబ్‌లో హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాత్యహంకారంతో ఓ తెల్లజాతీయుడు కాల్చిచంపి తెలుగు ప్రజలను విషాదంలో ముంచేశాడు. తుపాకుల విక్రయాలను నిషేధించాలని గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఎంతోమంది విన్నవించారు. కఠిన నిర్ణయాలు తీసుకునే కొత్త ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో విదేశీయుల రక్షణకు ఇకనైనా చర్యలు తీసుకోవాలి. జాత్యహంకార వైఖరిని అంతమొందించాలి.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

అమరావతిలో తొలి బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన శాసనసభలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రులు తమ గమనాన్ని, పథాన్ని పునర్నిర్వచించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వెయ్యాలి. విభజనానంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక వృద్ధి రేటు జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. జాతీయంగా అది 7.1గా నమోదైతే, రాష్ట్రానిది 11.6 శాతం. వ్యవసాయం, ఉద్యాన, ఇతర అనుబంధ పరిశ్రమల్లో సాధించిన ప్రగతి వల్ల ఇది సాధ్యమైందని ప్రభుత్వం చెప్తోంది. వనరుల్ని సమగ్ర అభివృద్ధికి పునాదులుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆర్థిక వృద్ధిపై భిన్నాభిప్రాయాల మాట ఎలా ఉన్నా, మానవాభివృద్ధిపై అందరిదీ ఏకాభిప్రాయమే. మానవాభివృద్ధి సూచీలన్నింటా మనది అథమ స్థానమే. అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్టికాహార లేమి, మాతాశిశువుల మరణాల రేటు వంటి అంశాల్లో ఇంకా ఆందోళనకర పరిస్థితే. సమగ్ర సామాజిక అభివృద్ధికి మానవ వనరుల అభివృద్ధి మొదటి అడుగు. కాబట్టి అభివృద్ధికి ‘అ ఆ’లు దిద్దడంతోనే అమరావతి కలలు సాకారం కావాలి. ఇక్కడ ‘అ’ అక్షరం (విద్య), ‘ఆ’ అంటే ఆరోగ్యం. ఈ రెండింటికీ అధిక నిధులు కేటాయించాలి. ఈ సంవత్సరం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు 12 శాతం, ఆరోగ్యానికి 24 శాతం నిధులు కేటాయించింది. ఆ రాష్ట్రానికీ, మన రాష్ట్రానికీ పోలికలేవీ లేకపోయినా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడంలో తప్పులేదు. మనకు అది అత్యవసరం కూడా.
-డా. డివిజి శంకరరావు, పార్వతీపురం

అర్చకులను ఆదుకోండి
దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలి. ఆలయాలను నమ్ముకున్నవారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా- తెలంగాణ సిఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అర్చకులకు, ఉద్యోగులకు ఈ బడ్జెట్ జీవితాంతం గుర్తు ఉండేలా చేయటం సిఎం వల్లనే అవుతుంది. వేతన డిమాండ్లపై గతంలో పలుమార్లు అర్చకులు, ఉద్యోగులు ఆందోళన బాట పట్టగా సమస్యను పరిష్కరిస్తామని కెసిఆర్ అభయం ఇచ్చారు. ఇక ఎటువంటి ఉపసంఘాలు, కమిటీలు అంటూ కాలయాపన చేసి అర్చకుల సహనానికి పరీక్షలు పెట్టి బాధించవద్దు. నిత్యం భగవంతుడి సేవలో నిమగ్నమేయ్యేవారికి ఆర్థిక బలం చేకూర్చడం తక్షణ అవసరం. గతంలో చేసిన వాగ్దానాలపై ఇప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడం బాధాకరం. సిఎం తీసుకునే నిర్ణయంతో అర్చకులు, ఆలయ సిబ్బంది జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
-చామర్తి వెంకట రామకృష్ణ, హైదరాబాద్

కైలాసగిరిపై నిర్లక్ష్యం నీడలు
విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన వైభవం కోల్పోతోంది. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాల్సిన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) తన స్వంత ఆదాయంపై దృష్టి సారిస్తోందే తప్ప సమస్యల పరిష్కారం పట్ల తగిన శ్రద్ధ చూపడం లేదు. కైలాసగిరిపై చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటుచేసిన ఉయ్యాల, జారుడుబల్ల, బొమ్మలు శిథిలావస్థకు చేరాయి. మంచినీటి కుళాయిల వద్ద అపరిశుభ్రత పేరుకుంది. పాదచారులు వెళ్లే దారులన్నీ దెబ్బతిన్నాయి. భారీ సంఖ్యలో ఉన్న కుక్కలు సందర్శకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొక్కలు చాలావరకూ వాడిపోయాయి. ఫుడ్‌కోర్టుల వద్ద ఆహార పదార్థాలను అధికధరలకు అమ్ముతున్నారు. ఇక చీకటి పడ్డాక ప్రేమజంటలు అసభ్యంగా, విశృంఖలంగా ప్రవర్తిస్తూ చూపరులకు జుగుప్స కలిగిస్తున్నాయ. ఇప్పటికైనా వుడా అధికారులు స్పందించి కైలాసగిరిపై వౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, సందర్శకులకు ఆహ్లాదం కలిగించాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం