ఉత్తరాయణం

‘హరితహారం’ కమిటీలు వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానలకు, వనాలకు సంబంధం ఉన్నది. చెట్లు లేకుండా వర్షాలు రావు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా అడవుల శాతాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి అడవులు 33 శాతం ఉండేలా చర్యలు ప్రారంభించారు. మూడేళ్ల కాలవ్యవధిలో అటవీ ప్రాంతాల్లో 100 కోట్లు, నివాస ప్రాంతాల్లో 120 కోట్ల మొక్కలను నాటాలని సంకల్పించారు. మరో పది కోట్ల మొక్కలు హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి పరిధిలో నాటుతారు. ప్రతి గ్రామంలో 40 వేలు, ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ‘తెలంగాణకు హరితహారం’ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు గత 35 ఏళ్లలో నాటిన మొక్కలు 35 కోట్లుగా ప్రభుత్వ లెక్కల్లో ఉంది. కాగా, గత రెండున్నరేళ్లలో నాటిన మొక్కలు 47.98 కోట్లు. గత ప్రభుత్వాలు అటవీ శాఖకు ఏడాదికి 13 కోట్లరూపాయలు ఖర్చు చేస్తే, తెలంగాణ ఏర్పడ్డాక 1,283 కోట్ల రూపాయలు అటవీ శాఖకు ప్రభుత్వం కేటాయించింది. అంటే సగటున ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలకుపైగా పచ్చదనంపై ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి మొక్కలు నాటడం హర్షించదగ్గ విషయమే కాని, నాటిన మొక్కలకు రక్షణ కరవైంది. మొక్కలకు రక్షణగా ట్రీగార్డ్స్ ఏర్పాటు చేస్తే గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నారు. నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. ‘హరితదళం’ పేరిట ప్రతి మొక్కని కాపాడేందుకు ప్రభుత్వం కనీసం ఐదుమందితో మొక్కల పర్యవేక్షణ కమిటీని నియమించాలి. ఈ కమిటీలో అటవీశాఖ సహా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో పాటు సామాజిక కార్యకర్తలను నియమించాలి. మొక్కల పరిరక్షణ బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించాలి.
-గుండమల్ల సతీష్‌కమార్, సంస్థాన్ నారాయణపురం
సంక్షేమంపై శ్రద్ధ చూపరా?
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ రాజకీయ వ్యూహాలు, సభలు, సమీక్షలతోనే కాలం గడుపుతుతున్నారు. వీటివల్ల సామాన్యులకు ఒరిగిందేమీ లేదు, వృథా ఖర్చు తప్ప. ప్రజల మీద పన్నులు వేసి, వచ్చిన ఆదాయాన్ని ప్రజాకర్షక పథకాలకు వ్యయం చేస్తున్నారు. వర్షాలు పడక పంటల సాగు విస్తీర్ణం రానురానూ తగ్గిపోతోంది. కూరగాయలు, బియ్యం మొదలగు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పంటలు పండినపుడు విపరీతంగా ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతుండగా దళారీలు మాత్రం బాగుపడుతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హడావుడి చేసేదానికంటే నిత్యావసరాలు ధరలు తగ్గేట్టు, ఉపాధి దొరికేట్టు చర్యలు చేపట్టాలి. ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచే చర్యలు చేపట్టాలి. లేకపోతే రైతులు, సామాన్య ప్రజలు మున్ముందు మరింతగా కష్టాలపాలవుతారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపైన, విద్యార్థుల ఫీజులపైన, రైతులకు నాణ్యమైన విత్తనాలు,మందులపైనా, తాగునీరు, సాగునీరు అందించడంపైన దృష్టి పెడితే బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు, ఆర్భాటాలు తగ్గించి ప్రజా సంక్షేమంపై శ్రద్ధ చూపాలి. ఈ బాధ్యతలు నిర్వహించాక ఎన్నికల సంగతి చూసుకోవచ్చు.

-ఈశ్వర్, పొద్దుటూరు
పాక్ ప్రజాస్వామ్యం ఓ ప్రహసనం
సాధారణంగా రెండు రకాల ప్రజాస్వామ్యం ఉంటుందని, ఒకటి అధ్యక్ష తరహా అని- రెండోది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని మనం చదువుకున్నాం. పాకిస్తాన్ ప్రజాస్వామ్యం మరో తరహాది. ప్రజాస్వామ్యం ఓ ప్రహసనం కావడంతో గత 70 ఏళ్లలో ఆ దేశంలో ఏ ప్రధాని కూడా పదవీకాలం పూర్తి చేయలేకపోయారు. అధ్యక్షుడి చేతిలోనో లేదా మిలటరీ చేతిలోనో పదవీచ్యుతి పొందడం పాక్ ప్రధానికి అనివార్యం. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వరకూ ఆగి ఉంటే తాజాగా పదవీచ్యుతి పొందిన నవాజ్ షరఫ్ పూర్తి కాలం ప్రధాని పదవిని అధిష్ఠించిన తొలి వ్యక్తి అయి ఉండేవాడు. కానీ ఈసారి ఆయనను పదవి నుంచి తొలగించిన బాధ్యతను పాక్ సుప్రీం కోర్టు తీసుకుంది. అలంకార ప్రాయమైన ప్రజస్వామ్యం పాకిస్తాన్ ప్రత్యేకత. అక్కడ అధికారం సైన్యానిది. పాలనలో అస్థిరత, మత చాందసవాదుల ఆధిక్యత, ఉగ్రవాదం నేపథ్యంలో ప్రజాస్వామ్యం బలహీనపడింది. దీంతో పొరుగు దేశాలకు సైతం నష్టం తప్పదు. కనుక భారత్ అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. పాక్‌లో బందీగా ఉన్న మన కులభూషణ్‌ను విడిపించేలా చొరవ చూపాలి.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం