ఉత్తరాయణం

భారమైన బతుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యావసర సరుకుల ధరలు నింగికెక్కి కూర్చున్నాయి. బడుగుజీవులు రెండుపూటలా కాకపోయినా కనీసం ఒక్క పూటయినా పోషక పదార్థాలు తినలేక, కొనలేక కూలబడ్డారు. ఇంకా వెయ్యిలోపు వస్తున్న ప్రభుత్వ పెన్షనర్లు కూలిపనులు చేయలేక, రాక, అలవాటులేక బడుగు జీవులైపోయారు. బ్యాంకుల్లో వడ్డీనానాటికీ తీసికట్టవుతోంది. బతుకులు బాగుపడతాయన్న ఆశ సన్నగిల్లింది. అనారోగ్యాల పాలైనవారు ఆసుపత్రుల పీడనను కూడా తట్టుకోలేక ప్రజాప్రభుత్వంలో అనాథలుగానే జీవితాలను చాలిస్తారేమో.! ఆరు దశాబ్దాల స్వాతంత్య్రం మనకిచ్చినదిదే. ప్రభుత్వాలు పేదలవికాదని రూఢీ అయిపోయింది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

చీటీ లేకుండానే మందులు!
డాక్టర్ చీటీలు లేకుండా మందులు అమ్మటం, బిల్లులు ఇవ్వకపోవటం, నకిలీ మందులు అమ్మటం వంటి అంశాలపై దృష్టిసారించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. ఇప్పుడు మందుల కొట్లవాళ్లు అన్ని నిబంధనలనీ అతిక్రమిస్తూనే ఉన్నారు. విచక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా మందులువాడుకోవటం మాని స్వంత వైద్యాలకి పూనుకోకుండా ఎవరికివారే జాగ్రత్తవహించాలి. ప్రభుత్వాన్ని, మందుల కొట్లవాళ్లని నిందించటంవలన జరిగేది ఏమీ ఉండదు. స్వంత ప్రాణంకన్నా తీయనైనిది సృష్టిలో మరోటి ఉండదు మరి.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

అదనపు చార్జీలు ఎందుకు?
గుంటూరు నగరం మొత్తం గుంటలూరుగా మారింది. ఏ వీధి చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా పరిస్థితి వుంది. చిన్న వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా చిలకలూరిపేట, ఒంగోలు వెళ్ళే రహదారిలో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఇక్కడ ఐటిసి దగ్గర నూతన బ్రిడ్జి నిర్మాణం జరగడంవలన వన్‌వే ట్రాఫిక్ విధానం పెట్టినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. దీని మూలంగా ఇటు చిలకలూరిపేట, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు నుండి వచ్చే బస్సులు బైపాస్ మీదుగా చుట్టూ తిరిగి వస్తున్నాయి. బస్‌లో కూడా అదనపు చార్జీ వసూలుచేస్తున్నారు. తిరిగి చిలకలూరిపేట, ఒంగోలు వెళ్ళేటప్పుడు మాత్రం మామూలు చార్జీలు వసూలుచేస్తున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకొని త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలి.
- మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం

బాధ్యత విస్మరిస్తే ఎలా?
వాటంతట అవి చచ్చినాయో లేదా ఎవరైనా చంపి పడేశారో తెలియదు గాని రోడ్డుమీద నడుస్తుంటే చచ్చిన ఎలుకలు, పందికొక్కులు కన్పిస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది చూసీ చూడనట్లుంటున్నారు. కార్ల చక్రాల కింద పడి ఛిద్రం అవుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది అసహ్యం అనుకుంటే ఎలా? తగిన పరికరాలు యిస్తున్నారు కదా. ఎవరికి పుట్టిన బిడ్డరా వరవలా ఏడుస్తున్నాడు అన్న తంతు అవుతే ఎలా? హక్కులే కాదు బాధ్యతలు కూడా వుంటాయి కదా. సిబ్బంది జీతాలు ప్రజలు కట్తున్న పన్నుల్లోంచి యిస్తున్నదే అని గ్రహించాలి.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ

చెకింగ్‌లు నిర్వహించాలి
రైళ్ళలో జనరల్ బోగీలలో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. గాలి కూడా దూరనంతగా ప్రయాణికులతో కిటకిటలాడుతూ నరకప్రాయం అవుతుంది. స్ర్తిలు, వృద్ధులు, పిల్లల బాధ వర్ణనాతీతం. ఇక స్టేన్ సమీపించి దిగాల్సి వచ్చినా దిగలేని పరిస్థితి. ఇక అత్యవసర పరిస్థితిలో బాధపడుతున్న వారి నరకం చెప్పనలవి కాదు. జనరల్ బోగీలలో టికెట్ చెకింగ్ లేకపోవడం వలన టికెట్ లేని ప్రయాణికులు బాగా ఎక్కే అవకాశం వుంది. తప్పనిసరిగా అన్ని కంపార్టుమెంట్లలోనూ టికెట్ చెకింగ్ చేసి లేని వారికి జరిమానా విధించాలి. రద్దీనిబట్టి జనరల్ కంపార్టుమెంట్లు పెంచాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఆలయ పవిత్రతను కాపాడాలి
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ప్రపంచ సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం, ప్రపంచంలోనే తొలి కూర్మావతార ఆలయంగా వినుతికెక్కిన శ్రీ కూర్మనాథాలయం ప్రాంగణంలో తీవ్ర అపారిశుద్ధ్య పరిస్థితుల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చారిత్రక ప్రసిద్ధ ఆలయం ఆహ్లాదానికి, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక పారవశ్యానికి నిలయంగా వున్నప్పటికీ ఆలయం వెనుక చెత్తాచెదారంతో ఈగలు, దోమలతోపాటు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దేవాదాయశాఖ తక్షణం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి ఆలయ పవిత్రతను మరింత పెంచేందుకు కృషిచేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం