ఉత్తరాయణం

నిధులిచ్చినా ఖర్చు చేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని మోదీ పేదరికంపై యుద్ధం ప్రకటిస్తూ వచ్చే సంవత్సరాన్ని ‘గరీబీ కళ్యాణ్‌వర్ష్’గా ప్రకటించడం ముదావహం. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలను, దళితులను ఓటు బ్యాంకుగా భావించి సంక్షేమాన్ని నీరుగార్చిన ఫలితంగా గ్రామీణ దళితులు మరింత పేదలుగా, పట్టణాలలో దళితులు మురికివాడలకే పరిమితమైన వారిగా మిగిలిపోయారన్న మోదీ మాటలో అతిశయోక్తి లేదు. దళిత ఉపప్రణాళిక (సబ్ ప్లాన్) కింద కేటాయించినవి రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు. గిరిజన ఉపప్రణాళిక నిధుల్లోనూ సింహభాగం ఖర్చుకానివే. ఖర్చుచేసిన నిధుల్లో దుర్వినియోగమైనవనీ, పక్కదారి పట్టినవీ ఎక్కువే. కేంద్రంలోనే కాదు, రాష్ట్రాలలో కూడా సంక్షేమ పథకాలకు ఇదే దుర్గతి. కేటాయింపులు ఘనం. అమలులోకి రావడం శూన్యం. మోదీ ప్రధాని అయిన పిమ్మట కూడా ఈ నిధుల వినియోగంలో తేడా తగ్గలేదు. గత ఏడాది దళిత ఉప ప్రణాళికకు నిధుల కేటాయింపులో వృద్ధి ఇరవైఐదు శాతం కాగా, ఖర్చయినవి గతం కన్నా రెండువందల ఏభై శాతం అధికం. కేటాయింపుల్ని సద్వినియోపర్చడంతోనే- పేదరికంపై యుద్ధం మొదలుపెట్టాలి. జవాబుదారీతనం, పర్యవేక్షణకు నోడల్ వ్యవస్థ ఏర్పాటు, అతిక్రమణలపై క్రమశిక్షణ చర్యలు వంటి ప్రయత్నాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

అరుదైన అవకాశం..
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వంలో బిజెపికి లోక్‌సభలో సొంతంగా మెజారిటీ ఉంది. రాజ్యసభలోనూ ఆ పార్టీ బలం ఇటీవల పెరిగింది. ఈ పరిస్థితుల్లో చిరకాలంగా భారతీయులు ఎదురుచూస్తున్న బిల్లులకు మోక్షం కలిగించేందుకు తగిన అవకాశం ఉంది. ఇదివరకే రాజ్యసభలో ఆమోదించిన మహిళా బిల్లును ఇపుడు బిజెపి సభ్యులు తలచుకుంటే లోక్‌సభలో ఆమోదించడం కష్టం కాదు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభం కావాలని ఈ దేశంలో హిందువులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్నారు. అవసరమైతే పార్లమెంటులో బిల్లు పెట్టి రామమందిరం నిర్మాణానికి బిజెపి సభ్యులు చట్టపరంగా ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా బిల్లును ఆమోదించేందుకు ఎన్‌డిఎ సర్కారు ప్రయత్నించ వలసి ఉంది. ఈ విషయమై బిజెపి సభ్యులు చొరవ చూపాల్సి ఉంది.
- కెఎన్ శివాజీరావు, హైదరాబాద్

ఎపికి ప్యాకేజీ మంచిదే
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టపరంగా అవరోధాలున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాకేజీ రూపంలో నిధులు పొందడంలో తప్పేమీ లేదు. ప్రత్యేక హోదా అసాధ్యమని తెలిసి కూడా కొన్ని రాజకీయ పక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకే లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వల్ల నిధులు పుష్కలంగా కేటాయించినపుడు లేనిపోని భేషజాలకు పోవడం సముచితం కాదు. ‘హోదా’ పేరిట సెంటిమెంటును రెచ్చగొట్టడం వల్ల, ఆందోళనలు చేయడం వల్ల అశాంతి తప్ప అభివృద్ధి సాధ్యం కాదని విపక్ష నేతలు గ్రహించాలి. ప్యాకేజీ వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని ఆశించి ప్రతిపక్షాలు ‘హోదా’పై స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలకాలి.
-కాకుటూరి సుబ్రహ్మణ్యం, చెన్నై

అనైతిక అంశాలకే పెద్దపీట
ఇటీవలి కాలంలో సినిమాలు, టీవీ సీరియళ్లు వాస్తవిక సమాజానికి దూరంగా వుంటున్నాయి. కేవలం వ్యాపార దృక్పథంతో ఎంతటి అనైతిక అంశాలనైనా సినిమాలో చేర్చుతున్నారు. విలువలతో కూడిన ఈ కళ పతనావస్థకు చేరుతోంది. సినిమాల సంఖ్య పెరగడంతో నిర్మాతలకు మంచి కథలు దొరకడం లేదు. మంచి కథలతో సినిమాలు నిర్మించాలనేవారు తగ్గిపోతున్నారు. యువతను రెచ్చగొట్టేలా సినిమాలు నిర్మిస్తూ వారిలో నేరప్రవృత్తి పెరగడానికి కారణమవుతున్నారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యేలా అక్రమ సంబంధాలను ప్రోత్సహించేలా చిత్రాలు, సీరియళ్లు నిర్మిస్తున్నారు. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలను సేవించడం అంటే హీరోయిజం అనేలా చూపిస్తూ యువతను పెడత్రోవ పట్టిస్తున్నారు. ప్రజలు ఏది చూడాలో, ఏది చూడకూడదో అనే అంశంపై సెన్సార్ బోర్డు, ప్రభుత్వం, సామాజిక వేత్తలు అవగాహన ప్రజలకు కల్పించాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

ఉద్యోగాలకు గండి!
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయని ఆశించిన తెలంగాణ యువతకు నిరాశే మిగులుతోంది. రెవెన్యూ డివిజన్‌ల విభజన పేరుతో, జోన్‌ల పేరుతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెడుతోంది. ఉద్యోగ నియామక ప్రకటనలను నిలిపివేయడంతో యువత అయోమయంలో పడింది. ఓ వైపు జిల్లాల విభజనపై ఆందోళనలు నడుస్తున్నాయి. కొత్తగా 17 జిల్లాలు, మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటవుతున్నా నియామకాలు జరుగుతాయన్న ఆశలు కనిపించడం లేదు. ఉన్న సిబ్బందితోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రమే యువతను ఆకట్టుకునేందుకు ఏవోకొన్ని నియామక ప్రకటనలు వస్తాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. దీంతో కొత్తగా నియామకాలు ఉంటాయా? అన్న ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది.
-అయినం రఘురామారావు, ఖమ్మం